Abn logo
Aug 3 2021 @ 04:56AM

మధ్యవర్తిత్వం మేలు

  • జల వివాదానికి సామరస్య పరిష్కారం.. అందుకు మేమూ సహకరిస్తాం
  • ఒకరిపై మరొకరిని ఉసిగొల్పలేం.. నేను రెండు రాష్ట్రాలకూ చెందిన వాడిని
  • లీగల్‌గా దీనిపై విచారణ జరపలేను.. కుదరదంటే మరో ధర్మాసనానికి బదిలీ
  • కృష్ణా జలాల వివాదంపై చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టీకరణ.. అనవసర జోక్యం వద్దని హితవు
  • ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకోవాలి: ఏపీ న్యాయవాది.. సుప్రీంలో విచారణ రేపటికి వాయిదా


‘‘ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే... ఇలాంటి వివాదాలు తప్పనిసరిగా పరిష్కారం కావాలని గట్టిగా భావిస్తున్నాం. ఈ జల వివాదాన్ని మేం పరిష్కరించగలం. అయితే... (ఒక రాష్ట్ర) ప్రజలకు వ్యతిరేకంగా (మరో రాష్ట్ర) ప్రజలను ఉసిగొల్పలేం. కలలో కూడా అలాంటి వివాదాలకు తావు ఇవ్వొద్దు. మీమీ ప్రభుత్వాలను ఒప్పించి మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకునేలా చేయండి. అనవసరంగా మరొకరి జోక్యాన్ని ఆహ్వానించకండి!’’ 

- జస్టిస్‌ ఎన్వీ రమణ (రెండు తెలుగు రాష్ట్రాల న్యాయవాదులతో)


న్యూఢిల్లీ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సూచించారు. చర్చలు, మధ్యవర్తిత్వ మార్గంలో సమస్య పరిష్కరించుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైతే ఇందుకు సుప్రీంకోర్టు కూడా సహకరిస్తుందని తెలిపారు. ‘ఈ విషయంలో అనవసరంగా కోర్టు జోక్యం చేసుకోవాలని భావించడంలేదు’ అని చెప్పారు. ఇటీవల కృష్ణా ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా జల విద్యుదుత్పత్తి చేస్తోందని, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆదేశాలను ఉల్లంఘిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. తెలంగాణ ప్రభుత్వ అసంబద్ధ, అన్యాయమైన చర్యలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కులకు భంగం కలుగుతోందని, చట్టబద్ధంగా దక్కాల్సిన జలాలు దూరమవుతున్నాయని పేర్కొంది. ఈ వ్యాజ్యం సోమవారం చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ ఎన్వీ రమణకు తెలంగాణతోనూ మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు భాషాభిమానిగా ఆయన తనకు తాను ఉభయ రాష్ట్రాలకూ చెందినవాడిగానే భావిస్తారు. వ్యాజ్యం తన ముందుకు రాగానే... ఆయన ఇదే విషయం చెప్పారు. ‘‘లీగల్‌గా ఈ పిటిషన్‌పై వాదనలు వినలేను. ఎందుకంటే... నేను రెండు రాష్ట్రాలకు చెందిన వాడిని’’ అని చెప్పారు. అదే సమయంలో... ‘‘మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చేమో, దయచేసి పరిశీలించండి.


ఈ విషయంలో మేమూ సహకరిస్తాం. సమాఖ్య అంశాలను పరిగణనలోకి తీసుకొని మధ్యవర్తిత్వ వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తాను. కానీ... న్యాయపరమైన విచారణే కావాలని, కేంద్ర ప్రభుత్వ జోక్యం తప్పదని భావిస్తే ఈ పిటిషన్‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తాను’’ అని జస్టిస్‌ రమణ తెలిపారు. దీనిపై రెండు రాష్ట్రాల తరఫు న్యాయవాదులు ప్రభుత్వాలను ఒప్పించి, సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందని ఆకాంక్షించారు. దీనిపై ఏపీ తరఫు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే స్పందిస్తూ... ఇది రాజకీయపరమైన అంశమని, రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. ఇందుకు కొంత సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు. దీంతో ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేస్తామని చెప్పగా... అందుకు తెలంగాణ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ కూడా అంగీకరించారు.  


నీటి కొరత ఉన్నప్పుడు వివాదాలు... 

ఇప్పటికే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసినందున ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌ చెల్లదని వైద్యనాథన్‌ తెలిపారు. అయితే, ఆ  నోటిఫికేషన్‌ అక్టోబరు నుంచి అమల్లోకి వస్తుందని, అప్పటి వరకు నాలుగునెలల పాటు ఆంధ్రప్రదేశ్‌ నష్టపోతుందని దవే పేర్కొన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న జస్టిస్‌ రమణ.. ‘‘నీటి కొరత ఏర్పడినప్పుడు ఇలాంటి వివాదాలు వస్తుంటాయి. ఇలాంటి కేసుల్లో నేనూ హాజరయ్యేవాడిని’’ అని అన్నారు. ఇదే సందర్భంగా అసోం-మిజోరాం మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదం, ఘర్షణల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఈ విచారణకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది మహ్‌ఫూజ్‌ నజ్కీ, తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది రవీందర్‌ రావు కూడా హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...