3 నెలల తర్వాత ‘రెస్టారెంట్’కు బిజినెస్ టైకూన్.. అక్కడ ఏదైనా రూ.10 లోపేనట!

ABN , First Publish Date - 2020-07-02T17:46:29+05:30 IST

కొవిడ్‌-19 లాక్‌డౌన్ కారణంగా మీ ఫేవరెట్ రెస్టారెంట్‌ను మిస్ అవుతున్నామని అనిపిస్తోందా?

3 నెలల తర్వాత ‘రెస్టారెంట్’కు బిజినెస్ టైకూన్.. అక్కడ ఏదైనా రూ.10 లోపేనట!

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 లాక్‌డౌన్ కారణంగా మీ ఫేవరెట్ రెస్టారెంట్‌ను మిస్ అవుతున్నట్టు అనిపిస్తోందా? కొత్తగా ఏదైనా కేఫ్‌కో, హోటల్‌కో వెళ్లి కడుపారా ఆరగించాలని ఆశగా ఉందా? అయితే ప్రముఖ బిజినెస్ టైకూన్ హర్ష్ గొయేంకా చెబుతున్న ఈ ఐడియా వింటే మీ ఆలోచన మారొచ్చు..! తాను ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రుచులను ఎలా ఆస్వాదించానో చెబుతూ ఆయన ట్విటర్లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అచ్చం రెస్టారెంటును తలపించేలా ఇంట్లోని చిట్టి చెఫ్‌లు తయారు చేసిన మెనూ తాలూకు అనుభవాన్ని షేర్ చేసుకుంటూ ఆయన పెట్టిన ఫోటోలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘‘మూడు నెలల తర్వాత ఎట్టకేలకు ఓ రెస్టారెంట్లోకి అడుగుపెట్టాను. అక్కడి ఆహారం మీ సొంతవాళ్లు స్వయంగా తమ చిట్టిచేతులతో ఉత్సాహాన్ని, ప్రేమనంతా రంగరించి వండితే.. ప్రపంచంలోని టాప్ రెస్టారెంట్ రుచులు కూడా చిన్నబోవాల్సిందే..’’ అని గొయేంకా వ్యాఖ్యానించారు.


ఈ రెస్టారెంటుకు స్పెషల్‌గా వాళ్లు పెట్టిన పేరు, ఆయనకు ఇచ్చిన మెనూ, కొన్ని ఆహార పదార్థాలను గొయేంకా ఫోటోలు తీసి షేర్ చేసుకున్నారు. ఈ హాంగౌట్‌లోని ఆహార పదార్ధాల ధరలన్నీ రూ. 10 లోపే ఉండడం మరో విశేషం. ఆయన పోస్టును ఇప్పటికే వెయ్యిమందికి పైగా లైక్ చేయగా.. అనేకమంది తమ అభిప్రాయాలను చెబుతూ కామెంట్లు రాస్తున్నారు. ‘‘మాక్కూడా హోం డెలివరీ పంపిస్తారా?’’ అని ఓ నెటిజన్ అడగ్గా.. గొయేంకా ‘‘నో’’ అని చెప్పేశారు. ‘‘నేను కూడా ఓ టేబుల్ బుక్ చేసుకోవచ్చా?’’ అని మరొకరు ప్రశ్నించగా.. ‘‘సొంతగా వండుకుంటే.. ఆనందానికి ఆనందం, ఆరోగ్యానికి ఆరోగ్యం...’’ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ‘‘ఎంత అద్భుతంగా ఉందో... రెస్టారెంట్లను తలదన్నేలా ఉంది..’’ అని మరొకరు పేర్కొన్నారు. అవును కదా.. మీరేమంటారు..!



Updated Date - 2020-07-02T17:46:29+05:30 IST