రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో హర్షవర్ధన్ కోవిడ్ రివ్యూ...

ABN , First Publish Date - 2021-04-16T20:33:46+05:30 IST

దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్..

రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో హర్షవర్ధన్ కోవిడ్ రివ్యూ...

న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శనివారంనాడు అన్ని రాష్ట్రాల హోం మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆసుపత్రుల్లో సౌకర్యాల పెంపునకు సంబంధించి దేశంలోని ఎయిమ్స్ ఆసుపత్రులతో వచ్చే సోమవారంనాడు వర్చువల్ మీట్ నిర్వహించనున్నారు. డాక్టర్ హర్షవర్ధన్ శుక్రవారంనాడు మీడియాకు ఈ విషయం తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం, దేశంలోని 54 జిల్లాల నుంచి గత ఏడు రోజులుగా ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదని, అలాగే 44 జిల్లాల నుంచి గత 28 రోజులుగా ఎలాంటి కరోనా కేసులు నమోదవలేదని చెప్పారు.


ఎయిమ్స్ ట్రౌమా సెంటర్‌లో 70 అదనపు పడకలు, ఝజ్జర్‌లోని నేషనల్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో మరో 100 పడకలు ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించామని, కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. రెమ్‌డెసివిర్ డ్రగ్‌ను బ్లాక్‌మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెమ్‌డెసివర్ ఉత్పత్తిని పెంచాలని కంపెనీలను ఆదేశించామని చెప్పారు. శుక్రవారంనాడు ఎయిమ్స్ ఆసుపత్రిని హర్షవర్ధన్ సందర్శించారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఇతర డాక్టర్లు ఆయన వెంట ఉన్నారు.

Updated Date - 2021-04-16T20:33:46+05:30 IST