నీరజ్‌కు హరియాణా ప్రభుత్వం భారీ నజరానా

ABN , First Publish Date - 2021-08-08T00:17:04+05:30 IST

ఒలింపిక్స్‌లో వందేళ్ల కలను సాకారం చేస్తూ ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

నీరజ్‌కు హరియాణా ప్రభుత్వం భారీ నజరానా

చండీగఢ్: ఒలింపిక్స్‌లో వందేళ్ల కలను సాకారం చేస్తూ ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్‌కు స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు నీరజ్‌ను అభినందిస్తూ ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో నీరజ్‌ చోప్రాకు హరియాణా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఒలింపిక్స్‌ చరిత్రలో అథ్లెటిక్స్‌లో భారత్‌కు వచ్చిన తొలి స్వర్ణం ఇదే. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ఇది రెండో స్వర్ణం. 2008లో షూటర్‌ అభినవ్‌ బింద్రా స్వర్ణం సాధించాడు. 13ఏళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో మరోసారి దక్కిన స్వర్ణం నీరజ్‌దే. 2018 కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లోనూ నీరజ్‌ స్వర్ణ పతకాలు సాధించాడు.


ప్రస్తుతం సైన్యంలో సుబేదార్‌ హోదాలో ఉన్న నీరజ్‌ చోప్రా స్వస్థలం హరియాణాలోని పానిపట్‌. ఈ క్రమంలో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌కు హరియాణా ప్రభుత్వం రూ.6 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. దీంతోపాటు గ్రూప్‌-1 ఉద్యోగం కూడా ఇస్తున్నట్లు వెల్లడించింది. అలాగే నీరజ్‌కు 50 శాతం రాయితీతో ఇంటి స్థలం కూడా అందిస్తామని హరియాణా సీఎం ప్రకటించారు. కాగా, నీరజ్ సాధించిన స్వర్ణంతో ఈ ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 7కు చేరింది. దీంతో లండన్ ఒలింపిక్స్‌లో సాధించిన పతకాల రికార్డును భారత్ అధిగమించింది.

Updated Date - 2021-08-08T00:17:04+05:30 IST