కర్నాల్ లాఠీచార్జిపై దర్యాప్తు, మరణించిన రైతు కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగం

ABN , First Publish Date - 2021-09-11T19:47:45+05:30 IST

రైతులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి జరిపిన ఘటన సంచలనం సృష్టించడంతో..

కర్నాల్ లాఠీచార్జిపై దర్యాప్తు, మరణించిన రైతు కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగం

కర్నాల్: రైతులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి జరిపిన ఘటన సంచలనం సృష్టించడంతో హర్యానా సర్కార్ రైతు ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఇరువర్గాల మధ్య అవగాహన కుదిరింది. ఆగస్టు 28న పోలీసులు జరిపిన లాఠీచార్జీ ఘటనపై దర్యాప్తు జరుపుతామని, లాఠీచార్జిలో మృతి చెందిన రైతు కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. హర్యానా అడిషనల్ చీఫ్ సెక్రటరీ దేవేందర్ సింగ్ రైతు ప్రతినిధులతో కలిసి శనివారంనాడు జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మృతి చెందిన రైతు సతీష్ కాజల్ కుటుంబంలోని ఇద్దరికి ఉద్యోగాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సింగ్ తెలిపారు. లాఠీచార్జి ఘటనపై రిటైర్ట్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దర్యాప్తు నెలరోజుల లోపు పూర్తి కావాల్సి ఉంటుందన్నారు.


రైతు నేత గుర్నాం సింగ్ చౌరుని మాట్లాడుతూ, లాఠీచార్జి ఘటనలో మృతి చెందిన రైతు కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశామని, ప్రభుత్వం అంగీకరించిందని, వారంలోకి వారికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఎస్‌డీఎంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అనుకున్నప్పటికీ పోలీసు విధుల పేరుతో బయటపడే అవకాశాలున్నాయంటూ లాయర్లు ఇచ్చిన సలహా మేరకు రిజైర్ట్ జడ్జితో విచారణకు డిమాండ్ చేశామన్నారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరించినట్టు చెప్పారు.


ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టార్ పాల్గొనే కార్యక్రమానికి నిరసన తెలిపేందుకు ఆగస్టు 28న రైతు నిరసనకారులు సమావేశమయ్యారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు విచక్షణా రహితంగా లాఠీచార్జి జరపడంతో పలువురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆల్ ఇండియా కిసాన్ సభ నేత కాజల్ గుండెపోటు వచ్చి కన్నుమూశారు. పోలీసు లాఠీచార్జిపై సెప్టెంబర్ 7 నుంచి రైతులు కర్నాల్ మినీ సెక్రటేరియట్ వద్ద ప్రదర్శనలకు దిగారు.

Updated Date - 2021-09-11T19:47:45+05:30 IST