పెద్దచెరువు దశ మారేదెన్నడో?

ABN , First Publish Date - 2021-06-12T04:54:03+05:30 IST

ఎన్నేళ్లయినా దుబ్బాక మండలం పోతరెడ్డిపేటలోని పెద్దచెరువు రూపురేఖలు మారడం లేదు. సుమారు 845 ఎకరాల శిఖం, 250 ఎకరాల కట్ట కలిగిన చెరువు కళావిహీనంగా తయారైంది. రెండు దశాబ్దాలుగా చెరువు పునరుద్ధరణకు మోక్షం లభించడం లేదు.

పెద్దచెరువు దశ మారేదెన్నడో?
పూడుకుపోయిన పెద్దచెరువు మత్తడి

రెండు దశాబ్దాలుగా పునరుద్ధరణకు నోచుకోని వైనం

భూసేకరణ పూర్తయినా ఇంకా ప్రారంభంకాని కాల్వ పనులు


దుబ్బాక, జూన్‌ 11 : ఎన్నేళ్లయినా దుబ్బాక మండలం పోతరెడ్డిపేటలోని పెద్దచెరువు రూపురేఖలు మారడం లేదు. సుమారు 845 ఎకరాల శిఖం, 250 ఎకరాల కట్ట కలిగిన చెరువు కళావిహీనంగా తయారైంది. రెండు దశాబ్దాలుగా చెరువు పునరుద్ధరణకు మోక్షం లభించడం లేదు. ఈ చెరువును ఆనుకుని కూడవెళ్లి వాగు ఉండడంతో ఎత్తిపోతల పథకం ద్వారా చెరువును నింపేందుకు 2001లో అప్పటి మంత్రి, దివంగత నేత చెరుకు ముత్యంరెడ్డి సుమారు రూ.3 కోట్లను మంజూరు చేయించారు. అయితే కరెంటు వ్యయం పెరగడం, నిర్వహణ కష్టతరం అవుతుందని కాలగర్భంలో కలిపారు. రాష్ట్ర గీతా పారిశ్రామిక సహాకార సంఘం చైర్మన్‌ బండి నర్సాగౌడ్‌ 2004లో అప్పటి సీఎం వైఎ్‌సఆర్‌ను కలిసి పెద్దచెరువును పునరుద్ధరించాలని విన్నవించారు. దీంతో అప్పటి కలెక్టర్‌ చిన్నవాగు ద్వారా కాలువను మళ్లించి పెద్దచెరువును నింపాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఈ పనులను విడతల వారీగా చేపట్టడానికి ప్రయత్నించినప్పటికీ ముందుకు సాగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి చెరువును పునరుద్ధరణకు నడుంబిగించారు. మంత్రి హరీశ్‌రావు కృషితో మొదటి విడతగా రూ.3 కోట్ల పైచిలుకు నిధులు మంజూరయ్యాయి. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలోని చిన్నవాగు ద్వారా కాలువను ఏర్పాటు చేయాల్సి ఉండటంతో కొంత జాప్యం జరిగింది. సుమారు 6 కిలోమీటర్ల దూరం కాలువ తవ్వేందుకు భూసేకరణ జరపడంలో రెండు జిల్లాల అధికారుల్లో సమన్వయ లోపించింది. దీంతో పనులు సకాలంలో ముందుకు సాగలేదు. సుమారు రూ.2.15 కోట్ల నిధులను భూసేకరణకు వెచ్చించారు. మిగతా నిధులతో చెరువు శిఖంలోని పిచ్చిమొక్కల తొలగింపు, కట్టపై జంగల్‌ కటింగ్‌ పనులను చేపట్టారు. అనంతరం మరిన్ని నిధులు మంజూరు కాకపోవడంతో పనులు సాగడం లేదు. మరో రూ.2 కోట్ల వరకు నిధులను కేటాయిస్తే కాలువ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో దుబ్బాక మండల పరిధిలోని ఏడు గ్రామాలకు ప్రయోజనం చేకూరనుంది.


Updated Date - 2021-06-12T04:54:03+05:30 IST