ఎరువుల ధరల పెంపు ఆగినట్లేనా?

ABN , First Publish Date - 2021-04-10T08:28:17+05:30 IST

అన్నదాతకు ఊరట! ఎరువుల ధరలను పెంచొద్దని కంపెనీలకు కేంద్రం స్పష్టం చేసింది.

ఎరువుల ధరల పెంపు ఆగినట్లేనా?

  • ముడిసరుకుల సాకుతో 58 శాతం పెంపు.. 
  • వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు
  • కేంద్రం జోక్యంతో కంపెనీల వెనకడుగు.. 
  • రైతు మెడపై ఇంకా వేలాడుతున్న ధరల కత్తి
  • ఎన్నికల తర్వాత మళ్లీ పెంచే అవకాశం

(అమరావతి/హైదరాబాద్‌ - ఆంధ్రజ్యోతి): అన్నదాతకు ఊరట! ఎరువుల ధరలను పెంచొద్దని కంపెనీలకు కేంద్రం స్పష్టం చేసింది. రైతులకు పాత ధరలకే ఎరువులు లభించనున్నాయి! అయితే ఇది ఎన్నాళ్లు? ఎరువుల ధరలు రానున్న రోజుల్లోనూ యథాతథంగా ఉంటాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎరువుల ధరలను కంపెనీలు పెంచేసినా.. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతుల ఆగ్రహజ్వాల నుంచి తప్పించుకునేందుకే వ్యూహాత్మకంగా ధరల పెంపునకు బ్రేకులు వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఽమొత్తమ్మీద ఎరువుల ధరల పరంగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించేందుకు శుక్రవారం కీలక ప్రకటన చేసింది.  ఈ మేరకు ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, దీనికి కంపెనీలు కూడా అంగీకరించాయని కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ సహాయ మంత్రి మన్సుక్‌ మాండవీయ ఢిల్లీలో వెల్లడించారు. 


దీంతో అన్నదాతలకు కాంప్లెక్స్‌ ఎరువులు ప్రస్తుతానికి పాతరేట్లకే లభించనున్నాయి. కానీ కేంద్రం జోక్యంతో ప్రస్తుతానికి కంపెనీలు వెనక్కితగ్గినా.. ధరల కత్తి రైతు మెడపై వేలాడుతూనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో రైతుల నుంచి వ్యతిరేకతను పసిగట్టిన ప్రభుత్వం కంపెనీలను నియంత్రించింది. ఎన్నికలు పూర్తవగానే కంపెనీలు ఎరువుల ధరలను పెంచే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే ఖరీఫ్‌ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నెల నుంచే ఎరువుల ధరలు పెంచనున్నట్లు ఎరువుల కంపెనీలు ప్రకటించాయి. 58 శాతం ధరల పెంపు ఉంటుందని టోకు వ్యాపారులకు సమాచారం ఇవ్వటంతో రైతులు, రైతుసంఘాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై గురువారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించింది. ఎరువుల ధరల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని నిర్ణయం తీసుకొని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఎరువుల కంపెనీలకు పంపించింది. 


పెంపు ఇందుకేనా?

రసాయన ఎరువుల తయారీకి వినియోగించే క్రూడాయిల్‌, నత్రజని, భాస్వరం, పొటాష్‌ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగాయని కంపెనీలు చెబుతున్నాయి. కేంద్రం కొత్తగా తెచ్చిన అగ్రి సెస్‌తో ఎరువులపై 5ు అదనపు భారం పడింది. దీంతో ఎరువుల కంపెనీలు ధరల పెంపు ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. అయితే కంపెనీల ప్రతిపాదనలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో 2 సీజన్లలో కలిపి సుమారు 13 లక్షల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువుల విక్రయాలు జరుగుతుంటాయి. సాగు విస్తీర్ణం కూడా రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతోంది. ఈ యాసంగి సీజన్‌లో 68.15 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. గడచిన వానాకాలం సీజన్‌లో 1.35కోట్ల ఎకరాల్లో రైతు లు పంటలు సాగుచేశారు. రెండు సీజన్లలో కలిపి 2.03 కోట్ల ఎకరాల్లో రైతుల పంటలు సాగుచేశారు. ఇంత భారీ ఎత్తున సాగుచేస్తున్న రైతులపై ఎరువుల భారం పడుతుందనే ఆందోళన నెలకొంది.  


నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు: రైతులు

ఎరువుల ధరను తక్షణం తగ్గించాలని తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీలు డిమాండ్‌ చేశాయి. ఎరువుల ధర పెంపుదలకు నిరసనగా ఏప్రిల్‌ 10న జిల్లా, మండల కేంద్రాల్లో జీవో (ప్రభుత్వ ఆదేశాల) కాపీలను దగ్ధం చేయాలని  రైతు సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు.  



Updated Date - 2021-04-10T08:28:17+05:30 IST