ఢిల్లీ సీఎం కుమార్తెకూ టోపీ

ABN , First Publish Date - 2021-02-13T05:44:02+05:30 IST

ఇటీవల కాలంలో చిన్న ట్రిక్‌తో కూడా నేరగాళ్లు సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నారు. నిజానికి ఇది సైబర్‌ సెక్యూరిటీ వ్యవహారం కూడా కాదు.

ఢిల్లీ సీఎం కుమార్తెకూ టోపీ

ఆన్‌లైన్‌ స్కామ్‌

మోసపోయేది అలా  

బయటపడేది ఇలా

ఇటీవల కాలంలో చిన్న ట్రిక్‌తో కూడా నేరగాళ్లు సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నారు. నిజానికి ఇది సైబర్‌ సెక్యూరిటీ వ్యవహారం కూడా కాదు. కొంతమంది విషయంలో  క్యూఆర్‌ కోడ్‌ విషయంలో చిన్నపాటి అలసత్వంతో నష్టం జరుగుతోంది.  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కుమార్తె కూడా ఇటీవల ఇలాగే మోసపోయింది. ఔల్‌ఎక్స్‌ సహాయంతో పాత  సోఫాను అమ్మాలనుకున్న ఆమె రూ.34,000 మేర నగదును కోల్పోయింది.  యాప్‌ బేస్డ్‌ పేమెంట్స్‌ వ్యవహారాలపై అవగాహన లేకపోవడమే ఇలాంటి మోసాలకు అసలు కారణం.  కొనుగోలు చేసిన వ్యక్తి తెలివిగా నగదు పేమెంట్‌ చేయడానికి బదులుగా నగదు ఇవ్వమంటూ రిక్వెస్ట్‌ పంపాడు.   వచ్చిన మెసేజ్‌ను చదవకుండా ఆ అమ్మాయి యాక్సెప్ట్‌ చేసింది. వెంటనే ఆమె అకౌంట్‌లో నుంచి నగదు బదిలీ జరిగిపోయింది.


చిన్న చిన్న జాగ్రత్తలో కొన్ని మోసాలు అరికట్ట వచ్చు. ఎలాగో ఒకసారి చూద్దాం. 


 పాత ఫర్నిచర్‌ లేదంటే మరొకటి అమ్మాలని భావించినప్పుడు క్వికర్‌ లేదంటే ఔల్‌ఎక్స్‌లో ప్రకటన ఇవ్వడం సర్వసాధారణం. ఆ ప్రకటనలోనే తమ సెల్‌ నంబర్‌ కూడా ఇస్తారు. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు  వెంటనే కాల్‌ చేస్తారు. 


 కొనాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ చాలామంది బేరాలు చేస్తారు. కస్టమర్‌కు ఉండే సాధారణ ప్రవృత్తి ఇది. అయితే మోసం చేయాలని అనుకునే వ్యక్తి మాత్రం బేరం చేయడు. ప్రొడక్ట్‌కు ఎంత వెల నిర్ణయించారో ఆ ధరకే అంగీకరిస్తాడు. 


 మోసం యావత్తు యుపిఐపై జరుగుతుంది. మోసం చేసే వ్యక్తే ఫోన్‌ చేస్తారు. ఫిక్స్‌ చేసిన రేటుకు అంగీకారం తెలుపుతారు. మొత్తం లేదా బుకింగ్‌ మనీని గూగుల్‌ పే, ఫోన్‌పే లేదా ఇతర యాప్‌ల ద్వారా చెల్లించేందుకు ముందుకువస్తారు. 


 కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తి నిజానికి నిర్దేశించుకున్న యాప్‌ ద్వారా మనీ చెల్లించాలి. అయితే మోసం చేయాలనుకునే వ్యక్తి సదరు మొత్తాన్ని బదలాయించడానికి బదులు ‘రిక్వెస్ట్‌ మనీ’ ఆప్షన్‌ క్లిక్‌ చేస్తాడు. వ్యక్తులు ఇక్కడ మోసపోతారని గుర్తించాలి. యుపిఐ యాప్‌పై ఉన్న ఎస్‌ఎంఎస్‌ను పూర్తిగా చదవకుండా సింపుల్‌గా దానిపై క్లిక్‌ చేయడంతో అమ్మకందారు అకౌంట్‌ నుంచి మనీ మోసగాడికి బదిలీ అవుతుంది. 


 ఎవరైనా దీనిని గుర్తించి ఇలా ఎందుకు పంపారంటూ ప్రశ్నిస్తే పొరపాటున పంపించానంటూ మాటమారుస్తారు.


 మర్చంట్‌ పేమెంట్స్‌ విషయంలో భద్రత కోసం యుపిఐ యాప్‌లు ఒటిపి నంబర్‌ను పంపుతాయి. పేమెంట్‌ అప్రూవల్‌ కోసం షాప్‌కీపర్‌ దీన్ని ఉపయోగిస్తారు. ఈ ఉదంతంలో మోసం చేసే వ్యక్తి షాప్‌కీపర్‌ అకౌంట్‌ నుంచి ఒటిపి జనరేట్‌ చేసి తద్వారా అమౌంట్‌ బదిలీ చేయించుకుంటారు. నిజానికి అలాంటి ఒటిపిలను ఫోన్‌లో ఎవరితోనూ షేర్‌ చేసుకోకూడదు. మన అకౌంట్‌ నుంచి మనీ వెళుతున్నప్పుడు మాత్రమే ఒటిపి జనరేట్‌ అవుతుందన్న విషయం మరిచిపోకూడదు. ఇతరులు మీ అకౌంట్‌లోకి డబ్బు పంపినప్పుడు మీకు ఒటిపి రాదు. 


 మరి కొన్ని సందర్భాల్లో మనం అమ్మాలని ప్రకటించిన వస్తువు కొంటామని, ఇంకా ఎక్కువ రేటు ఇస్తామని అంటే ఇద్దరు ముగ్గురు నుంచి కాల్స్‌ వస్తాయి. వీరిలో ఒకరు నిర్ణయించి రేటు కంటే అధిక మొత్తం కోట్‌ చేస్తారు. అక్కడే జాగ్రత్త పడాల్సి ఉంటుంది. 


 ఔల్‌ఎక్స్‌ లేదంటే క్వికర్‌ ద్వారా అమ్మాలని అనుకున్నప్పుడు కొనుగోలుదారుడిని నేరుగా వచ్చి కలవమని చెప్పడం ఈ వ్యవహరంలో సురక్షితం. అలాగే నగదు చెల్లింపు అడగాలి. ప్రొడక్ట్‌ వచ్చిన తరవాత మనీ చెల్లించడం లేదంటే తీసుకున్న తరవాతే డబ్బు ముట్టజెప్పడం చాలా మంచి పద్ధతి. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు అవసరం. అదేవిధంగా అవసరమైతే తప్ప మన ఇంటి చిరునామాను కూడా తెలియనివ్వకూడదు.



 


Updated Date - 2021-02-13T05:44:02+05:30 IST