ద్వేషం, దురభిమానం కూడదు!

ABN , First Publish Date - 2021-10-01T05:30:00+05:30 IST

మనిషి హృదయంలో ద్వేషం, దురభిమానం గూడుకట్టుకోవడం

ద్వేషం, దురభిమానం కూడదు!

మనిషి హృదయంలో ద్వేషం, దురభిమానం గూడుకట్టుకోవడం ప్రారంభిస్తే... ఒక పట్టాన అతణ్ణి వదలవు. అవి క్రమంగా తీవ్ర రూపం దాలుస్తాయి. ప్రతీకారం, హింస, హత్యా కాండలకు దారి తీస్తాయి. వినాశనకారకమైన ఇటువంటి ధోరణులకు లోబడకుండా విశ్వాసులు అప్రమత్తంగా ఉండాలని ఇస్లాం ధర్మం పలు సందర్భాల్లో సూచించింది. దౌర్యన్యంగా వ్యవహరించే వ్యక్తికి ప్రళయ దినాన సర్వం అంధకారంగా మారుతుందని దైవ ప్రవక్త మహమ్మద్‌ హెచ్చరించారు. ‘‘హద్దు మీరేదాకా దౌర్జన్యపరుడికి దైవం ఆటవిడుపు ఇస్తాడు. కానీ పట్టుకుంటే మాత్రం శిక్షించకుండా వదిలిపెట్టడు’’ అని ఒక సందర్భంలో ఆయన చెబుతూ... ‘‘నీ ప్రభువు దేన్నయినా పట్టుకోవడం జరిగితే (ఇక దానికి వినాశనం మూడినట్టే)... ఆయన పట్టు చాలా కఠినంగా, ఎంతో బాధాకరంగా ఉంటుంది’’ అంటూ దివ్య ఖుర్‌ఆన్‌లోని సూక్తిని పఠించారు. 


‘‘ఒక వ్యక్తి దుర్మార్గుడని తెలిసీ అతణ్ణి సమర్థించేవారు ఇస్లాం నుంచి బయటకు వెళ్ళిపోయినట్టే. అధర్మమైన, అక్రమమైన పనుల్లో తన తెగ, కులం, జాతి, వర్గం వారికి సహకరించే మనిషి... బావిలో పడిపోతున్న ఒంటె తోక పట్టుకొని, తాను కూడా బావిలో పడిపోయే మూర్ఖుడి లాంటివాడు. దురభిమానం వైపు పిలిచేవాడు మనవాడు కాదు. దురభిమానంతో యుద్ధం చేసేవాడు కూడా మనవాడు కాదు. దురభిమానంతో రగిలిపోయే స్థితిలో మరణించేవాడు కూడా మనవాడు కాదు’’ అని హదీస్‌ గ్రంథం స్పష్టం చేస్తోంది. 


పీడనకు గురైన వారి శాపాలకూ, ఆర్తనాదాలకూ శక్తి ఉంటుంది. దురహంకారంతో దుర్మార్గాలు చేసేవాళ్ళు వాటికి భయపడాల్సిందే. ‘‘పీడితుడు తన హక్కుగా రావాల్సింది ప్రసాదించాలని మాత్రమే దేవుడికి మొరపెట్టుకుంటాడు. ఏ హక్కుదారుడికీ... అతనికి రావలసినదాన్ని దేవుడు ఇప్పించకుండా ఉండడు. కాబట్టి పీడితుడి శాపానికీ, ఆర్తనాదాలకూ భయపడండి’’ అని మహా ప్రవక్త మహమ్మద్‌ హెచ్చరిక చేశారు. ద్వేషాన్నీ, దురభిమానాన్నీ విడిచిపెట్టి, దైవం పట్ల విశ్వాసంతో, సత్ప్రవర్తనతో జీవించేవారే అల్లాహ్‌కు ప్రీతిపాత్రులవుతారు.

 మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2021-10-01T05:30:00+05:30 IST