Abn logo
Apr 6 2020 @ 04:04AM

వెంటాడే గాయాలు అతని కథలు

వి. చంద్రశేఖరరావు కథలు చదువుతుంటే పికాసో గీసిన తెలుపు, నలుపు చిత్రం ‘గెర్నికా’ స్ఫురిస్తుంటుంది నాకు. ‘గెర్నికా’ యుద్ధ బీభత్సానికి ప్రతీక ఐతే, చంద్రశేఖరుడి కథలు జీవన బీభత్సానికి బొమ్మ కట్టిన దృశ్యాలు.


వి. చంద్రశేఖరరావు కథల్లోని పాత్రలు ఒకానొక ఆదర్శానికి కట్టుబడినట్టే ఉంటాయి. కానీ కట్టుబడవు. వైఫల్యాలూ, నైరాశ్యాల నడుమ విరుచుకుపడుతోన్న కల్లోలాన్ని కళ్ళక్కడతాడు అతడు. అతని అక్షరాలలో అరణ్యాల్ని చుట్టుముట్టిన కార్చిచ్చు రెపరెపలాడుతుంటుంది.

‘‘...ఎండ రంగు పొర ఏదో

భూమినంతా కప్పినట్టు

వాడిపోయిన ఆకులు

పసుపురంగు కప్పుకొని

‘ఊపిరాడనితనం’

చెట్ల పైనుండి నేలంతా పాకి

ఇళ్ళల్లోకి ప్రవేశించి

కిటికీ పక్కన అద్దంలో

చెట్లు దుఃఖిస్తున్న చప్పుడేదో

వినపడి మేల్కొంది ఆమె!


ఆ చీకటిలో

కంటి లోపలి రెటీనా కూడా

పని చేయక

ఒక దుర్భరమైన దుఃఖపురంగు నలుపు

ఆమె చుట్టూ కమ్ముకొంది’’

- ఈ కవిత రాసింది ప్రఖ్యాత కథకుడు వి. చంద్రశేఖర  రావు. ‘పూర్ణమాణిక్యం ప్రేమ కథలు’ లోని ఓ పేరాగ్రాఫు లోని కొన్ని పంక్తుల్ని విడగొట్టి, ‘పేర్చితే’ రూపుదాల్చిన కవిత ఇది. పూర్వాశ్రమంలో వి.చంద్రశేఖరరావు కవిత్వమూ రాశాడు. ‘అపూర్వరాగం’ అనే అతడి కవితలోని కొన్ని వాక్యాల్ని ఇక్కడ ఉదహరిస్తాను:


‘‘అమ్మ కళ్ళలోని లాలిత్యము

లేత ఎండలా వెచ్చగా, హాయిగా

నా ఒంటిని తడుముతుంటే-

అది ఉదయం కాబోలు’’.

వి.చంద్రశేఖరరావు కవి హృదయం అతడు కథకుడిగా రూపాంతరం చెందినా కూడా అతణ్ణి వీడిపోలేదు. కవితాత్మక కథనం అతడి శిల్ప సంవిధానం! అతని పదాలలోని లాలిత్యం అతడి కథలకి సొబగులద్దిందేకానీ కథాగమనానికి ఎక్కడా అడ్డు తగల్లేదు. అంతర్లోకాల్ని, అంత రంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించే ప్రక్రియగా ‘కథ’ని మలిచాడు. అతని పాత్రల బాహ్య ప్రవర్తన లోపలి దుఃఖానికీ, అంతస్సంఘర్షణకీ అనుగుణంగానే ఉంటుంది. అధివాస్తవిక ధోరణిలో ‘కథ’ని చెప్తూనే జీవితంలోని అసంబద్ధతని తేటతెల్లం చేస్తాడు. 


నాకు చంద్రశేఖరరావు కథలు చదువుతుంటే ‘అజంతా’ గుర్తొస్తాడు. ‘‘మృత్యువు ముఖంలోనే కదా మనిషి విజృంభణ’’ అంటాడు అజంతా. ‘‘మరణం అంటని ఒక ముగిం పుని కలగన్నాను’’ అంటాడు వి. చంద్రశేఖరరావు. ‘బ్లాక్‌ స్పైరల్‌ నోట్‌బుక్‌’ అనే కథ... ఒక దళిత విద్యార్థికి ఒక బహుజన అమ్మాయికి మధ్య నడిచే ‘ప్రేమకథ’! ఈ కథలో కథానాయకుడు ఒకానొక సందర్భంలో ఇలా అంటాడు: ‘‘నేనొక కుర్చీలో కూర్చుని చనిపోయిన మనిషి వైపు చూశాను. శివకాంతా, ఆ క్షణాలు నీకు ఎలా వివరించను? ఆ చనిపోయిన మనిషి ముఖం అచ్చం నాలాగే లేదూ’’. అజంతా కూడా అదే అంటాడు, ‘‘రోడ్డు మీద నా మృత కళేబరాలను నేనే లక్షసార్లు చూశాను’’ అని! ఆత్మసంఘర్షణ మరణం కంటే తక్కువేమీ కాదు. జీవితమంటేనే పునరపి మరణం! అంతస్సంఘర్షణ లేకుండా చంద్రశేఖరరావు కథ లేదు! వ్యక్తి అంతర్లోకాల్లోని చీకటి కోణాన్ని ఆవిష్కరించటమే చంద్రశేఖరరావు కథలు చేసిన ముఖ్యమైన పని. అటువంటి పనిముట్టుగానే తన కలాన్ని మలిచాడు అతడు.


వి. చంద్రశేఖరరావు కథలు చదువుతుంటే పికాసో గీసిన తెలుపు, నలుపు చిత్రం ‘గెర్నికా’ స్ఫురిస్తుంటుంది నాకు. ‘గెర్నికా’ యుద్ధ బీభత్సానికి ప్రతీక ఐతే, చంద్రశేఖరుడి కథలు జీవన బీభత్సానికి బొమ్మ కట్టిన దృశ్యాలు. పికాసో చిత్రకారుడే కాదు ‘అచిత్రకారుడు’ కూడా! చంద్రశేఖరరావూ అంతే! కథకుడు కాని కథకుడు. అతని కథలో ‘కథ’ ఒకింత కూడా ఉండదు. ఏవో కొన్ని సన్నివేశాలూ, కొన్ని పాత్రలూ, ఆ పాత్రల చుట్టూ అల్లుకున్న సున్నితమైన భావోద్వేగాలు. అంతే! దీన్నే అతిశక్తిమంతంగా తనదైన రీతిలో కథగా మలుస్తాడు. అందుకే అతని కథలు ఎప్పటికీ నవనవోన్మేషంగానే ఉంటాయి. పాత్రల పేర్లు పదే పదే పునరావృతమౌతుంటాయి కానీ కథానుగుణంగా పాత్రల చిత్రణ మారిపోతుంటుంది. 


‘‘నీ స్పర్శలో నేను పొయెమ్‌ను అవుతాను. పొయెమ్‌నో పాటనో హమ్‌ చేస్తుండగా నువ్వు కళ్ళు తెరుస్తావు’’ లాంటి కవితాత్మక వాక్యాల్తో ఒక ‘మూడ్‌’ని క్రియేట్‌ చేస్తాడు. ఆ ‘మూడ్‌’లోకి పాఠకుణ్ణి లాక్కువెళ్తాడు. అందుకే అతడి కథలు ‘క్లాసిక్స్‌’గా గుర్తింపులోకి వచ్చాయి.


రాడికల్‌ విద్యార్థి సంఘంతో ‘ట్యూన్‌’ అయిన కాలేజీ జీవితం అతడి కథలకి ‘నాంది’ పలికితే, తదనంతర కాలంలో ‘అస్తిత్వ’ ఉద్యమాల్తో మమేకం కావటంతో ఆ కథలకి సార్థకత చేకూరింది. పాశ్చాత్య సాహిత్య ధోరణుల్ని ఆకళించుకొని, తనదైన పంథాని కొనసాగించాడు చంద్రశేఖరరావు. అందుకే అతని కథలు వెంటాడే గాయాలై హృదయాన్ని మెలిపెడుతుంటాయి. అతని కథల్లోని పాత్రలు ఒకానొక ఆదర్శానికి కట్టుబడినట్టే ఉంటాయి. కానీ కట్టుబడవు. వైఫల్యాలూ, నైరాశ్యాల నడుమ విరుచుకుపడుతోన్న కల్లోలాన్ని కళ్ళక్కడతాడు అతడు. అతని అక్షరాలలో అరణ్యాల్ని చుట్టుముట్టిన కార్చిచ్చు రెపరెపలాడుతుంటుంది. 


1988 ప్రాంతాల్లో మొదలైన చంద్రశేఖరరావు కథా ప్రస్థానం 2017 నాటికి ఉత్కృష్ట స్థితికి చేరుకొంది. అతడి అర్ధాంతర మరణానంతరం వెలువడిన ‘ముగింపుకు ముందు’ కథా సంపుటి అతడి కథలకే తలమానికంగా నిలిచింది. ఆ సంపుటిలోని ఓ మూడు కథల్ని ఇక్కడ ప్రస్తావిస్తాను.


పి.వి.శివం కథ: ఈ కథ ఉత్తమ పురుషలో నడుస్తుంది. పి.వి.శివం కొడుకు పాత్ర దృక్కోణంలోంచి కథని చెప్పుకుపోతాడు రచయిత! పి.వి. శివం వేషభాషలూ, హావభావాలూ సుప్రసిద్ధ కవి కె.శివారెడ్డిని పోలి ఉంటాయి. అతడే ఈ కథకి నాయకుడు (తనకి చిరపరిచితులైన వ్యక్తుల వ్యక్తిత్వాలను పాత్రలుగా తీర్చిదిద్దటాన్ని చంద్రశేఖరరావు రాసిన ప్రతి ఒక కథలోనూ గమనించవచ్చు!). పి.వి.శివం కేరక్టర్ని ఓల్డ్‌ టైమర్‌, ఎక్సెస్‌ లగేజీ లాంటి వాడని విసుక్కొంటుంటూ ఉంటుంది అతడి కొడుకు పాత్ర (ఈ పాత్రకి వేరే పేరు లేదు). కానీ ఆ పాత్ర ‘ఆంతరంగిక భాషణ’ (మోనోలాగ్‌ అనొచ్చునా?)లోనే పి.వి. శివం పాత్ర ఎలివేట్‌ అవుతుంది.


ఈ ‘పి.వి.శివం కథ’ని భాను అనే ఓ సెక్స్‌ వర్కర్‌, భూమిని కోల్పోయిన ఒక ఆడమనిషి లాంటి పాత్రలు ముందుకి నడిపిస్తాయి. రాజు అనే ఆత్మహత్య చేసు కున్న కవి, వృద్ధాశ్రమంవాళ్ళు ఇంటికి పంపించేసిన హనుమయ్యల పాత్రలు (పరోక్షంగా) పి.వి. శివం వ్యక్తిత్వపు ఔన్నత్యాన్ని చాటి చెప్తాయి. ఒక తాగుబోతు చేతిలో బూర్జువా మనస్తత్వం ఉన్న పి.వి.శివం కొడుకు భంగపాటుకి లోను కావటంతో కథ ముగుస్తుంది. కేవలం ‘నెరేషన్‌’తోనే ఈ కథని రక్తికట్టించాడు చంద్రశేఖరరావు.


ముగింపుకి ముందు: ఈ కథ ఇతివృత్తం.. ‘ఒకే కప్పు కింద కాపురముంటున్న భార్యాభర్తల మధ్య ఆకర్షణకి బదులు వికర్షణ (నిజానికది విద్వేషం) జనించటం’! ఈ కథలోని కథానాయకుడి పాత్ర ‘హార్ట్‌ ఎటాక్‌’ (గుండెపోటు)కి లోనౌతుంది. కాలికి ఫ్రాక్చర్‌ కూడా అయి ఉంటుంది. ఇనుపరాడ్డు, ప్లేటుతో కాలి ఎముకల్ని అతికించిన ‘వైకల్య’ స్థితిలో ఉంటాడు. అటువంటి సందర్భంలో అతని భార్య అతణ్ణి వదిలి వెళ్ళిపోతుంది (పైకి కనపడని కారణాలు అనేకం!). సమకాలీన సమాజంలో దెబ్బతిన్న మానవ సంబంధాల్నీ, సంఘర్షణనీ ఎత్తి చూపే కథ ఇది! 


హిట్లర్‌: హిట్లర్‌ కథలో అసలు హిట్లర్‌ ఎవరో తెలుసుకోవటంలోనే కథంతా నిబిడీకృతమై ఉంది. ఒక రకంగా చూస్తే వీధి కుక్కగా రూపాంతరం చెందిన మేలు జాతి కుక్క కథ ఇది! ఇంకో రకంగా చూస్తే సదరు కుక్కని చేరదీసిన కులదురహంకారి ఐన ఓ రీసెర్చ్‌ స్కాలర్‌ కథ కూడా! యూనివర్సిటీ కేంపస్‌ నేపథ్యంగా నడిచే ఈ కథలో కోరలు సాచిన ఫాసిజం వికృత రూపాన్ని చూపిస్తాడు చంద్రశేఖరరావు. 


ఈ కథలోని ‘కరుణ కుమారి’ పాత్రే లేకపోతే ఈ కథ మనుగడకే అర్థం లేదు. విద్వేషానికి అవతలి పార్శ్వం ‘ప్రేమే’నని కరుణ కుమారి పాత్ర ద్వారా విశదపరుస్తాడు రచయిత.


ప్రతి కథలోనూ మానసిక సంఘర్షణనీ, మానవీయ కోణాన్నీ ప్రస్ఫుటంగా ప్రకటిస్తాడు చంద్రశేఖరరావు. ప్రతీకాత్మకంగా కథల్ని ముగించటం అతడి మార్కు ప్రత్యేకత. కాలంతో పాటు గొప్ప పరిణతిని సాధించిన కథాశిల్పి వి. చంద్రశేఖరరావు కథలు అజరామరం.

(ఏప్రిల్‌ 12న వి.చంద్రశేఖరరావు జయంతి)

రవూఫ్‌

98490 41167


Advertisement
Advertisement
Advertisement