Abn logo
Sep 23 2021 @ 21:44PM

పరువు కాపాడాలనుకున్న డీకే శివకుమార్.. విషయం బయటపెట్టేసిన సిద్దరామయ్య.. అసెంబ్లీలో నవ్వులే నవ్వులు!

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ లేచి ఆయన చెవిలో గుసగుసలాడారు. దీంతో సభ్యుల దృష్టి ఒక్కసారిగా వారిద్దరిపై పడింది. ఇంతకీ డీకే శివకుమార్ ఆయన చెవిలో ఏం చెప్పారో తెలుసా?.. పంచె జారిపోతోంది సరిగా కట్టుకోండి అని. ఆ మాట విన్న సిద్దరామయ్య ‘అవునా!’ అంటూ కుర్చీలో కూర్చున్నారు. తాను ధోతీ సరిగా కట్టుకున్న తర్వాత మాట్లాడతానని సభకు చెప్పడంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. 


మైసూరు సామూహిక అత్యాచార ఘటనపై సిద్దరామయ్య మాట్లాడుతున్న సమయంలో ఇది జరిగింది. సిద్దరామయ్య ఆ మాట అనగానే.. స్పీకర్ స్థానంలో ఉన్న కుమార్ బంగారప్ప స్పందిస్తూ.. సమస్య ఏంటో మీరే చెబితే వినడానికి గమ్మత్తుగా ఉంటుందని అన్నారు. ధోతీ గట్టిగా కట్టుకున్న తర్వాత సిద్దరామయ్య లేచి మాట్లాడుతూ.. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత నాలుగైదు కిలోల బరువు పెరిగానని, పొట్ట పరిమాణం పెరగడంతో పంచె జారిపోతుందని చెప్పారు.


ఆర్‌డీపీఆర్‌ మంత్రి కేఎస్ ఈశ్వరప్పను ఉద్దేశించి మాజీ సీఎం మాట్లాడుతూ.. ‘‘నా పంచె ఊడిపోతోంది ఈశ్వరప్పా. పొట్ట పెరిగింది.. పంచె ఊడిపోతోంది’’ అని నవ్వుతూ సంజాయిషీ చెప్పుకొచ్చారు. 


అంతలో ట్రెజరీ వైపు నుంచి సాయానికి ముందుకు రాగా, ‘‘మీరు అవతలి (పార్టీ) వైపు ఉన్నారు కాబట్టి మీ సాయం నేను కోరను’’ అని సున్నితంగా తిరస్కరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ మాట్లాడుతూ..‘‘మా పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పంచె ఊడిపోతున్న విషయాన్ని సిద్దరామయ్య చెవిలో చెప్పి ఆయనను, పార్టీ పరువును కాపాడాలనుకున్నారు. కానీ సిద్దరామయ్య ఈ విషయాన్ని సభలో చెప్పేశారు. దీంతో ఇప్పుడు బీజేపీ వాళ్లు మాపై విరుచుకుపడేందుకు ఎదురుచూస్తున్నారు’’ అని నవ్వేడంతో సభలో నవ్వులు విరిశాయి.

ప్రత్యేకంమరిన్ని...