మంత్రిగారూ కరుణించండి

ABN , First Publish Date - 2022-02-15T06:39:03+05:30 IST

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్సీ బాల, బాలికల స్టూడెంట్‌ మేనేజ్‌మెంట్‌ హాస్టళ్లు లేక మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. ఇక్కడ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు గత ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదు.

మంత్రిగారూ కరుణించండి
మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వినతి పత్రం ఇస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘ నాయకుడు (ఫైల్‌)

 పెద్దపల్లిలో ఎస్సీ మేనేజ్‌మెంట్‌ హాస్టళ్లు లేక ఇబ్బందులు

 జిల్లా ఏర్పాటై ఐదేళ్లయినా పట్టించుకోని ప్రభుత్వం

 అర్ధంతరంగా చదువు మానేస్తున్న విద్యార్థులు

 పట్టించుకోని అధికారులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

 మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం చిన్న వెంకటాపూర్‌ గ్రామం. రామ టెంకి అంకయ్య, సత్తమ్మలకు ఎలాంటి భూములు లేకపోవడంతో కౌలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి సంతానంగా సాయి ప్రియ, పూజిత. రక్షిత లు జన్మించారు. రెండవ కూతురు పూజిత మంచి ర్యాలలో ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉంటూ డిగ్రీ ద్వితీయ సంవ త్సరం చదువుతున్నది. మూడవ అమ్మాయి రక్షిత నిర్మల్‌ జిల్లాలో ఎస్సీ గురుకుల విద్యాలయంలో ఇంటర్‌ చదువుతున్నది. డిగ్రీ పూర్తి చేసిన పెద్ద కుమార్తె సాయిప్రియ డీఈడీ చేసేం దుకు సిద్ధపడి ప్రవేశ పరీక్ష రాసింది. ఆమెకు పెద్దపల్లిలోని ఒక ప్రైవేట్‌ కళా శాలలో డీఈడీ సీటు వచ్చింది. కానీ ఆమెకు ఉండేందుకు ఇక్కడ ఎస్సీల కు స్టూడెంట్‌ మేనేజ్‌ మెంట్‌ హాస్టల్‌ లేకపోవడంతో ఇబ్బందులు పడు తున్నది. తమ గ్రామం నుంచి పెద్దపల్లికి పోయి రావడం సాధ్యం కాదు. ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉందామంటే డబ్బులు చెల్లించే స్థోమత వారి కుటుంబానికి లేదు.  పెద్దపల్లిలో గల బీసీ స్టూడెంట్‌ మేనేజ్‌మెంట్‌ హాస్టల్‌కు వెళ్లి సీటు కోసం ప్రయత్నించింది. అక్కడ అన్ని భర్తీ అయ్యాయి. గోదావరిఖనిలో గల ఎస్సీ స్టూడెంట్‌ మేనేజ్‌మెంట్‌ హాస్టల్‌లో చేరి అక్కడి నుంచి పెద్దపల్లికి రోజు వచ్చి పోదామంటే అందుకు నిబంధనలు ఒప్పుకోవు. అక్కడ, ఇక్కడ తిరిగి సోమ వారం కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నది. నాకు హాస్టల్‌లో సీటు ఇప్పించాలని, లేకుంటే చదువు మానేయాల్సి వస్తుందని దయచేసి ఎక్కడైనా ఒక సీటు ఇప్పించండి అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యింది. 

ఈ బాధ ఒక్క సాయిప్రియది కాదు. అనేక మంది విద్యార్థులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్సీ బాల, బాలికల స్టూడెంట్‌ మేనేజ్‌మెంట్‌ హాస్టళ్లు లేక మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. ఇక్కడ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు గత ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. సాక్షాత్తు ఈ జిల్లాకే చెందిన కొప్పుల ఈశ్వర్‌ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్ప టికీ హాస్టళ్లు ఏర్పాటు కావడం లేదు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియో జకవర్గాల పరిధిలో ఎస్సీ స్టూడెంట్‌ మేనేజ్‌మెంట్‌ హాస్టళ్లు ఉన్నప్పటికీ, పెద్దపల్లి నియోజక వర్గంలోనే లేకపోవడం విచారకరం. ఇక్కడ ప్రభుత్వం ఎందుకు హాస్టళ్లను ఏర్పాటు చేయడం లేదు. ప్రజాప్రతి నిధులు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 

 ఏళ్లుగా ఎదురు చూపులే...

 ఎస్సీ, బీసీలకు బాల బాలికల కోసం వేర్వేరుగా ప్రతి నియోజక వర్గంలో స్టూడెంట్‌ మేనేజ్‌మెంట్‌ హాస్టళ్లను ఏర్పాటు చేస్తారు. ఇంటర్‌, డిగ్రీ, పీజీ, డీఇడీ, బీఇడీ, ఫార్మసీ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు ఈ హాస్టళ్లలో వసతి కల్పిస్తారు. ఒక్కో హాస్టల్‌లో 100 మందికి ప్రవేశం కల్పి స్తారు. ప్రభుత్వం వీరికి మెస్‌ చార్జీల కింద ఇచ్చే డబ్బులతో హాస్టళ్లను నడుపు తుంటారు. జిల్లాలోని రామగుండం, మంథని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీ బాలుర బాలికల స్టూడెంట్‌ మేనేజ్‌ మెంట్‌ హాస్టళ్లు ఉన్నప్పటికీ, పెద్దపల్లి నియోజక వర్గంలో లేకపోవడం గమనార్హం. తెలంగాణ ఏర్పాటై ఏడేళ్లు గడుస్తున్నా ఇక్కడ హాస్టళ్లను ఏర్పాటు చేయడం లేదు. జిల్లాల పునర్‌ వ్యవస్థీ కరణలో భాగంగా పెద్దపల్లి జిల్లా ఏర్పా టై ఐదేళ్లు గడుస్తున్నా కూడా హాస్టళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదు. జిల్లా కేంద్రంలో రెండు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ఫార్మసీ, బీఈడీ, డీఈడీ కళాశాలలు కూడా ఉన్నాయి. ఇక్కడి కళాశాలల్లో జిల్లాకు చెందిన విద్యార్థులే గాకుండా, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల జిల్లాలకు చెందిన విద్యా ర్థులు చదువుకోవడానికి వస్తుంటారు. 

ఎస్సీ విద్యార్థులకు హాస్టల్‌ సౌకర్యం లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ఇక్కడ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దృష్టికి కూడా తీసుక వెళ్లారు. అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. విద్యార్థుల వెతలపై ‘ఆంధ్రజ్యోతి’లో రెండుసార్లు కథనాలు ప్రచురిత మయ్యాయి. ఇక్కడ హాస్టళ్లు ఏర్పాటు చేసే విఽషయమై ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఏమాత్రం ఒత్తిడి తీసుకరావడం లేదు. ఇప్పటికైనా జిల్లా ఇన్‌చార్జీ మంత్రి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పందించి వెంటనే హాస్టళ్లను మంజూరు చేసి ఆరంభించాలని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు కోరుతున్నారు.

Updated Date - 2022-02-15T06:39:03+05:30 IST