చిగురిస్తున్న ‘ఆశలు’

ABN , First Publish Date - 2022-01-23T04:41:02+05:30 IST

హైదరాబాద్‌ మహానగరం చుట్టూ విస్తరించిన

చిగురిస్తున్న ‘ఆశలు’

  • ఉమ్మడి జిల్లాలో పెరిగిన అటవీ విస్తీర్ణం 
  • 35.69 చ.కి.మీ విస్తీర్ణంలో కొత్త ‘పచ్చదనం’ 
  • కేంద్ర తాజా సర్వేలో వెల్లడి


హైదరాబాద్‌ మహానగరం చుట్టూ విస్తరించి ఉన్న ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో అటవీ విస్తీర్ణం పెరిగినట్లు కేంద్రం తాజాగా విడుదల చేసిన ఇండియా స్టేట్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ -2021లో వెల్లడైంది. నగర శివార్లలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దండిగా సాగుతుండటంతో పచ్చటి వ్యవసాయ పొలాలన్నీ కూడా కనుమరుగుతున్నాయని అందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కొత్తగా పచ్చదనం సంతరించుకోవడం శుభపరిణామమనే చెప్పాలి.  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం అటవీ విస్తీర్ణం పెరగడానికి దోహదపడిందనే చెప్పొచ్చు.


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, జనవరి 22 : హైదరాబాద్‌ మహానగరం చుట్టూ విస్తరించిన ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో మళ్లీ పచ్చదనం పరుచుకుంటోంది. దేశవ్యాప్తంగా పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో అడవులు అంతరించిపోతున్నాయని అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. హైదరాబాద్‌ మహానగరం చుట్టూ అటవీ భూముల విస్తీర్ణం పెరిగినట్లు కేంద్రం తాజాగా విడుదల చేసిన సర్వే నివేదికలో వెల్లడైంది. 2019తో పోలిస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో  35.69 చదరపు కి.మీ విస్తీర్ణంలో కొత్తగా పచ్చదనం సంతరించుకుంది. కేంద్రం తాజాగా విడుదల చేసిన ఇండియా స్టేట్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ -2021 (ఐఎ్‌సఎ్‌ఫఆర్‌)లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగినట్లు సర్వేలో తెలిసింది.  దేశంలోని అటవీ వనరులను అంచనా వేసే ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎ్‌సఐ) ప్రతి రెండేళ్లకోసారి ఈ సర్వే నిర్వహించి వివరాలను వెల్లడిస్తుంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ వీటిని విడుదల చేశారు. ఇదిలాఉంటే 2019తో పోలిస్తే రాష్ట్రంలో మొత్తం 632 చదరపు కి.మీ మేర అడవులు(3.07శాతం) పెరగగా ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో 35.69 చదరపు కి.మీ విస్తీర్ణం మేర పెరిగాయి. హైదరాబాద్‌ మహానగరం చుట్టూ విస్తరించి ఉన్న ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో ఈమేర అటవీ విస్తీర్ణం పెరగడం మంచి పరిణామమనే చెప్పాలి. హైదరాబాద్‌ శివార్లలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దండిగా సాగుతుండడంతో వ్యవసాయ భూములన్నీ కూడా వెంచర్లుగా మారిపోతున్న విషయం తెలిసిందే. పచ్చటి వ్యవసాయ పొలాలన్నీ కూడా కనుమరుగుతున్నాయని అందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ చుట్టుపక్కల అటవీ విస్తీర్ణం పెరగడం శుభపరిణామమనే చెప్పాలి.  రాష్ట్రంలో భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చదరపు కి.మీ కాగా ఇందులో 21,214 చ.కి.మీ. (18.93శాతం) అడవులు విస్తరించి ఉన్నాయి. అలాగే ఉమ్మడి రంగారెడ్డిజిల్లా భౌగోళిక విస్తీర్ణం 7,493 చదరపు కి.మీ.లు కాగా, ఇందులో 806.11 చదరపు కి.మీ (10.76శాతం)మేర అడవులు విస్తరించాయి. ఉమ్మడి జిల్లాలో దట్టమైన అడవులు 0.02 చదరపు కి.మీ., మధ్యస్థ అడవులు 146.10 చదరపు కి.మీ., మైదాన ప్రాంత అడవులు 659.99 చదరపు కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. 


హరితహారంతో ఆశాజనక ఫలితాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమం అటవీ విస్తీర్ణం పెరగడానికి దోహదపడిందనే చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం, అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అటవీ ప్రాంతాలతోపాటు గ్రామాలు, పట్టణాల్లో హరితహారం కింద పెద్దఎత్తున మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నాటిన మొక్కలు ఎండిపోతే స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే విధంగా చట్టం తీసుకువచ్చారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హారితహారం కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేస్తున్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం పెరిగింది. హరితహారం కింద నాటిన మొక్కలను సంరక్షించేందుకు జియో ట్యాగ్‌లు వేయడంతో పాటు స్థానికుల భాగస్వామ్యంతో గ్రీన్‌ బ్రిగేడ్‌లు ఏర్పాటు చేశారు. గతేడాది అటవీశాఖ రంగారెడ్డిజిల్లాలో 52ప్రాంతాల్లో 6,29,145 మొక్కలు నాటింది. అలాగే వికారాబాద్‌ జిల్లాలో 82చోట్ల 7,55, 709 మొక్కలు, మేడ్చల్‌ జిల్లాలో 27 చోట్ల 93,708  మొ క్కలు నాటింది. ఈ కారణంగా అటవీ భూముల్లో కొత్తగా పచ్చదనం సంతరించుకుంది. 


Updated Date - 2022-01-23T04:41:02+05:30 IST