హవాలా దందా!

ABN , First Publish Date - 2021-01-27T06:21:05+05:30 IST

విశాఖపట్నంలో హవాలా వ్యాపారం జోరుగా సాగుతోంది.

హవాలా దందా!

విశాఖలో జోరుగా సాగుతున్న వ్యాపారం

చేతులు మారుతున్న రూ.కోట్లు

నెల రోజుల్లో మూడు కేసులు

రూ.2.2 కోట్లు స్వాధీనం

రూ.లక్షకు వేయి రూపాయలు కమీషన్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


విశాఖపట్నంలో హవాలా వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇన్నాళ్లూ ముంబై, హైదరాబాద్‌, చెన్నై వంటి నగరాలకే పరిమితమైన ఈ అక్రమ నగదు లావాదేవీలు ఇటీవల నగరంలో ఎక్కువగా జరుగుతున్నాయి. నెల రోజుల్లో మూడు కేసులు నమోదయ్యాయి. రూ.2.2 కోట్ల నగదు పోలీసులకు చిక్కింది. రెండుసార్లు ముందుగా అందిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా, మరోసారి లాడ్జీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు లెక్కలు లేని నగదు బయటపడింది. ఈ కేసుల్లో పట్టుబడిన వారంతా బయట ప్రాంతం నుంచి వచ్చినవారే. హైదరాబాద్‌కు డబ్బును తరలించేందుకు యత్నిస్తూ దొరికిపోయారు.


హవాలా అంటే...


ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి...దొడ్డిదారిన నగదు బదిలీ చేసే విధానాన్నే హవాలా అని పిలుస్తారు. దీన్నే బ్లాక్‌ మనీని వైట్‌ చేయడం అని అనవచ్చు. సాధారణంగా సొమ్మును బ్యాంకుల ద్వారా తరలించవచ్చు. పెద్ద మొత్తాల్లో పంపాలంటే కచ్చితమైన లెక్క ఉండాలి. లేనిపక్షంలో పన్ను చెల్లించాలి. అదే హవాలా రూపంలో అయితే లెక్కాపత్రం అవసరం లేదు. కోట్ల రూపాయలు కోరిన చోట అందిస్తారు. ఉదాహరణకు విశాఖలో ‘ఎక్స్‌’ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ‘వై’ అనే వ్యక్తికి రూ.పది కోట్లు అందజేయాలనుకుంటే...ఈ దందా నిర్వహించే వారిని సంప్రతిస్తారు. ‘ఎక్స్‌’ ఇక్కడ సొమ్ము చెల్లించగానే ఒక కోడ్‌ నంబర్‌ ఇస్తారు. దీనిని హైదరాబాద్‌లో వుంటున్న ‘వె’ౖకి తెలియజేయాలి. అతను ఆ వివరాలు అక్కడి వ్యాపారికి తెలియజేస్తే...చాలు క్షణాల్లో కమీషన్‌ తీసుకుని మిగిలిన మొత్తాన్ని ఇచ్చేస్తారు. ఈ దందా అంతా ఫోన్ల మీద సాగిపోతుంటుంది.


లక్షకు రూ.వేయి కమీషన్‌


హవాలా వ్యాపారులు లక్షకు రూ.700 నుంచి వేయి రూపాయలు కమీషన్‌గా తీసుకుంటారు. అంటే కోటి రూపాయలు చేతులు మార్చడానికి లక్ష రూపాయలు కమీషన్‌గా ఇవ్వాలి. విశాఖలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, సెటిల్‌మెంట్లు బాగా పెరగడంతో హవాలా ఏజెంట్లకు డిమాండ్‌ పెరిగింది. ఉత్తరాదికి చెందిన వ్యాపారులు చాలామంది విశాఖలో ఉండడం, వారికి ప్రధాన నగరాల్లోని హవాలా వ్యాపారులతో సంబంధాలు ఉండడంతో ఇక్కడ వ్యాపారం పెరుగుతోంది. అయితే ఒకరంటే మరొకరికి గిట్టనప్పుడో, మరేవైనా తేడాలొచ్చినప్పుడో పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా సమాచారం ఇచ్చి వారు పట్టుబడేలా చేస్తున్నారు. ఈ విధంగానే రెండు సార్లు నిందితులు పట్టుబడ్డారు. 


దువ్వాడతో లింకులు



- డిసెంబరు 21వ తేదీన వేగుల నుంచి అందిన సమాచారం మేరకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, సిటీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కలిసి రైల్వేస్టేషన్‌ పరిసరాల్లోని లాడ్జీల్లో తనిఖీలు చేపట్టారు. దువ్వాడలో ‘రాజు’ అనే వ్యక్తి నుంచి కోటి రూపాయలు వసూలు చేసి, హైదరాబాద్‌లో ఓ కాంట్రాక్టర్‌కు ఇవ్వడానికి వచ్చిన ఇద్దరు హైదరాబాదీలు దొరికారు. వారి దగ్గర కోటి రూపాయలు లభ్యమైంది. పని పూర్తిచేసుకొని హైదరాబాద్‌కు వెళ్లిపోవాలనుకుంటున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు.


ఆశీల్‌మెట్ట జంక్షన్‌ వద్ద


ఈ నెల 10వ తేదీన ఆశీల్‌మెట్ట వైపు వస్తున్న కారులో భారీగా నగదు వుందని సమాచారం అందడంతో పోలీసులు అక్కడ కాపు కాశారు. అర్ధరాత్రి సమయంలో వచ్చిన ఓ కారులో రూ.70 లక్షల నగదు దొరికింది. అన్నీ రూ.500, రూ.2 వేల నోట్లే. వాటిని తీసుకెళుతున్న ఇద్దరు వ్యక్తులు..ఆ మొత్తం ఎక్కడిదనేది ఆధారాలు చూపించలేదు. వివరాలు వెల్లడించలేదు. దాంతో ఆ మొత్తం సీజ్‌ చేశారు. 


తాజాగా కంచికచర్ల వద్ద...


తాజాగా విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళుతున్న ట్రావెల్స్‌ బస్సును కంచికచర్ల వద్ద పోలీసులు తనిఖీ చేయగా పెందుర్తికి చెందిన ఓ న్యూస్‌ ఛానల్‌ విలేఖరి వద్ద రూ.50 లక్షల నగదు దొరికింది. దానికి కూడా ఆధారాలు, పత్రాలు లేవు. దాంతో పోలీసులు సీజ్‌ చేశారు. అదే బస్సులో మరికొంత నగదు కూడా దొరికిందని ప్రచారం జరుగుతోంది. అంటే విశాఖపట్నం నుంచి బస్సుల్లో, రైళ్లలో హవాలా సొమ్ము తరలిస్తున్నారనే విషయం తేటతెల్లమైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, పోలీసులు దీనిపై దృష్టిపెట్టారు.

Updated Date - 2021-01-27T06:21:05+05:30 IST