కూతురికి పట్టం

ABN , First Publish Date - 2020-07-18T06:24:54+05:30 IST

దేశంలో అత్యంత ధనవంతురాలైన రోష్ని నాడార్‌ మల్హోత్రా.. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. భారత్‌లో లిస్టెడ్‌ ఐటీ కంపెనీ చైర్మన్‌ పదవిని చేపట్టిన తొలి...

కూతురికి పట్టం

హెచ్‌సీఎల్‌ టెక్‌ కొత్త చీఫ్‌గా రోష్ని నాడార్‌ 

భారత్‌లోని లిస్టెడ్‌ ఐటీ కంపెనీల్లో 

మహిళకు చైర్మన్‌ పదవి ఇదే తొలిసారి 

బాధ్యతల నుంచి తప్పుకున్న శివ్‌ నాడార్‌ 


దేశంలో అత్యంత ధనవంతురాలైన రోష్ని నాడార్‌ మల్హోత్రా.. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. భారత్‌లో లిస్టెడ్‌ ఐటీ కంపెనీ చైర్మన్‌ పదవిని చేపట్టిన తొలి మహిళ రోష్నినే. కంపెనీ వ్యవస్థాపకులు శివ్‌ నాడార్‌ చైర్మన్‌ పదవితోపాటు బోర్డు నుంచి తప్పుకున్నారని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ శుక్రవారం ప్రకటించింది. శివ్‌ నాడార్‌ తన ఏకైక కూతురు రోష్ని నాడార్‌ను కొత్త చైర్‌పర్సన్‌గా నియమించారని, ఈ మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. అయినప్పటికీ శివ్‌ నాడార్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతారని స్పష్టం చేసింది. చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ హోదాలో ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 2013లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ బోర్డులో చేరిన రోష్ని.. ఇప్పటివరకు బోర్డు వైస్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. హెచ్‌సీఎల్‌ గ్రూప్‌ వ్యాపారాల హోల్డింగ్‌ కంపెనీ హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌కు ఆమె ఇప్పటికే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే, శివ్‌ నాడార్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్రీగా ఉన్నారు. కంపెనీ వెబ్‌సైట్‌ ప్రకారం.. 990 కోట్ల డాలర్ల విలువైన హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌కు శివ్‌ నాడార్‌ చైర్మన్‌గా ఉన్నారు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌సీఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్‌, హెస్‌సీఎల్‌ హెల్త్‌కేర్‌ ఈ గ్రూపులోని కంపెనీలు. 


మరిన్ని సంగతులు.. 


శాస్త్రీయ సంగీతంలోనూ ప్రవేశమున్న రోష్ని తొలుత యూకేలోని స్కై న్యూస్‌, సీఎన్‌ఎన్‌ అమెరికా చానెళ్లలో న్యూస్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. 

2009లో హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌లో చేరారు. ఏడాదిలోగా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అయ్యారు. 27 ఏళ్ల ప్రాయంలో కంపెనీ సీఈఓ బాధ్యతలు చేపట్టారు. 

రోష్ని భర్త శిఖర్‌ మల్హోత్రా ప్రస్తుతం హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌  డైరెక్టర్‌, హెచ్‌సీఎల్‌ హెల్త్‌కేర్‌ వైస్‌ చైర్మన్‌, శివ్‌ నాడార్‌ ఫౌండేషన్‌ ట్రస్టీగా ఉన్నారు. 

హురున్‌ రిచ్‌ లిస్ట్‌ ప్రకారం.. రోష్ని దేశంలోనే అత్యంత ధనవంతురాలు. ఆమె వ్యక్తిగత ఆస్తి రూ.36,800 కోట్లు. 2019లో ఫోర్బ్స్‌ విడుదల చేసిన ‘ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన 100 మహిళల’ జాబితాలో రోష్ని నాడార్‌కు 54వ స్థానం లభించింది. 

2017లో బాబ్సన్‌ కాలేజ్‌ ఈమెకు లెవిస్‌ ఇనిస్టిట్యూట్‌ కమ్యూనిటీ చేంజ్‌ మేకర్‌ అవార్డు ప్రదానం చేసింది. 

పర్యావరణ ప్రేమికురాలైన రోష్ని.. 2018 లో  ‘ది హాబిటాట్స్‌ ట్రస్ట్‌’ను ఏర్పాటు చే సింది. వన్యప్రాణులు, వాటి ఆవాసాలను పరిరక్షించేందుకు ఈ ట్రస్ట్‌ కృషి చేస్తోంది. 2019లో అంతార్జాతీయ మేధో బృందం హొరాసిస్‌ నుంచి ‘ఇండియన్‌ బిజినెస్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకుంది. 

2014-19 మధ్యకాలంలో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌కు చెందిన  ‘ఫోరమ్‌ ఆఫ్‌ యంగ్‌ గ్లోబల్‌ లీడర్స్‌’లో సభ్యురాలుగా ఉంది.  






Updated Date - 2020-07-18T06:24:54+05:30 IST