హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం రూ.3,214 కోట్లు

ABN , First Publish Date - 2021-07-20T06:08:52+05:30 IST

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌.. జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.3,214 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం రూ.3,214   కోట్లు

  • కంపెనీ కొత్త సీఈఓ, ఎండీగా విజయ్‌ కుమార్‌.. 
  • ఒక్కో షేరుకు రూ.6 మధ్యంతర డివిడెండ్‌


న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌.. జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.3,214 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే నికర లాభం 9.9 శాతం వృద్ధి చెందిం ది. కాగా త్రైమాసిక సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 12.5 శాతం వృద్ధి చెంది రూ.20,068 కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో కంపెనీ కొత్త డీల్స్‌ను దక్కించుకోవటంతో మొత్తం కాంట్రాక్టు విలువ 166.4 కోట్ల డాలర్లకు చేరుకుందని వెల్లడించింది. అయితే కొత్త డీల్స్‌ రానుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిని సాధించటం ఖాయమని హెచ్‌సీఎల్‌ టెక్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ విజయ్‌ కుమార్‌ చెప్పా రు. ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ.6 మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది. డివిడెండ్‌ చెల్లింపు కోసం ఈ నెల 28వ తేదీని రికార్డు తేదీగా ఖరారు చేసింది. 


22 వేల కొత్త నియామకాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 20,000-22,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని చూస్తున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఎఫ్ఓ అప్పారావు చెప్పారు. జూన్‌ త్రైమాసికంలో కొత్తగా 7,522 మందిని నియమించుకోవటంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,76,499కి చేరిందని తెలిపారు. ద్వితీయ త్రైమాసికంలో 6,000 మంది ఫ్రెషర్లను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కాగా వలసల రేటు 11.8 శాతం ఉందని పేర్కొన్నారు. మరోవైపు గత ఏడాది కరోనా కారణంగా అక్టోబరులో వేతన పెంపు చేపట్టగా ఈ ఏడాది జూలై 1 నుంచే వేతనాలను పెంచనున్నట్లు అప్పారావు తెలిపారు. ప్రస్తుతంఉద్యోగుల్లో కేవలం 3 శాతం మంది మాత్రమే కార్యాలయాలకు వచ్చి పనిచేస్తున్నారన్నారు.

Updated Date - 2021-07-20T06:08:52+05:30 IST