హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం రూ.3,442 కోట్లు

ABN , First Publish Date - 2022-01-15T08:31:58+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.3,442 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.3,969 కోట్ల లాభంతో పోలిస్తే 13 శాతం క్షీణించింది.

హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం రూ.3,442 కోట్లు

  • ఒక్కో షేరుకు రూ.10 డివిడెండ్‌
  • ఈసారి 20,000-22,000 ఫ్రెషర్ల నియామకాలు 
  • 2022-23లో హైరింగ్‌ రెట్టింపు

 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.3,442 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.3,969 కోట్ల లాభంతో పోలిస్తే 13 శాతం క్షీణించింది. 2021-22 రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబరు)లో ప్రకటించిన రూ.3,259 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం 5 శాతం పెరిగింది. గడిచిన మూడు నెలల్లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 15 శాతం వృద్ధి చెంది రూ.22,331 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించనున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. మరిన్ని విషయాలు.. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి స్థిర కరెన్సీ ఆధారిత ఆదాయం రెండంకెల్లో వృద్ధి చెందనుందని, స్థూల లాభాల మార్జిన్‌ 19-21 శాతంగా ఉండవచ్చని కంపెనీ అంచనా వేసింది. 

మూడో త్రైమాసికంలో కంపెనీ దక్కించుకున్న కొత్త కాంట్రాక్టుల మొత్తం విలువ 213.5 కోట్ల డాలర్లుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన ఈ విలువ 64 శాతం పెరిగింది. 

గడిచిన మూడు నెలల్లో కంపెనీ నికరంగా 10,143 మందిని ఉద్యోగంలో చేర్చుకుంది. దాంతో మొత్తం సిబ్బంది సంఖ్య డిసెంబరు 31 నాటికి 1,97,777కు చేరుకుంది. 

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 17,500 మంది ఫ్రెషర్లను నియమించుకోవడం జరిగిందని, ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేసరికి ఫ్రెషర్ల పూర్తి నియామకాలు 20,000-22,000కు చేరుకోవచ్చని హెచ్‌సీఎల్‌ టెక్‌ చీఫ్‌ హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ అప్పారావు వీవీ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇంతకు రెట్టింపు సంఖ్యలో నియామకాలు చేపట్టనున్నట్లు  చెప్పారు. 

అక్టోబరు-డిసెంబరు కాలానికి కంపెనీ ఉద్యోగుల వలసల (ఆట్రిషన్‌) రేటు 19.8 శాతానికి పెరిగింది. 

స్టాక్‌ మార్కెట్లో వారాంతం ట్రేడింగ్‌ ముగిశాక కంపెనీ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. బీఎ్‌సఈలో కంపెనీ షేరు ధర 0.32 శాతం పెరిగి రూ.1,337.55 వద్ద స్థిరపడింది. 


రూ.315 కోట్లకు హంగేరి కంపెనీ కొనుగోలు 

హంగేరి దేశ రాజధాని బుడాపె్‌స్టకు చెందిన స్టార్‌స్కీమా అనే కంపెనీని 4.25 కోట్ల డాలర్లకు (దాదాపు రూ. 315 కోట్లు) కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రకటించింది. 2006లో స్థాపించిన స్టార్‌స్కీమా.. అమెరికా, ఐరోపాలోని 2000 బహుళజాతి కంపెనీలకు డేటా ఇంజనీరింగ్‌ సేవలందిస్తోంది. ఈ కొనుగోలు ద్వారా  కంపెనీ డిజిటల్‌ ఇంజనీరింగ్‌ సామర్థ్యంతోపాటు మధ్య, తూర్పు ఐరోపాలో మరింత విస్తరించినట్లవుతుందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ పేర్కొంది. 

Updated Date - 2022-01-15T08:31:58+05:30 IST