Abn logo
Aug 5 2020 @ 00:34AM

ఆయనొక పాటల దండు!

వంగపండు ప్రసాదరావు

‘కాసుల కోసం కళను అమ్ముకోకూడదు’ అన్న సిద్ధాంతాన్ని పాటించిన రచయిత వంగపండు ప్రసాదరావు. విప్లవ గీతాలతో ప్రజాకవిగా పేరు పొందడంతో, పలువురు దర్శక-నిర్మాతలు ఆయనతో పాటలు రాయించుకోవాలని ప్రయత్నించారు. అయితే, కవిగా తొలినాళ్లల్లో సినీ గీతాలకు ఆయన దూరంగానే ఉన్నారు. ‘మీ సిద్ధాంతాలు, భావజాలం ప్రతిబింబించే కొన్ని చిత్రాలకైనా పాటలు రాయండి’ అని మిత్రులు చేసిన సూచనతో కొన్నేళ్ల తర్వాత మనసు మార్చుకున్నారు. సుమారు 40 చిత్రాలకు పాటలు రాశారు. కొన్ని పాటలు పాడారు. సినీ గీతాలలోనూ తనదైన సిద్ధాంతాలు చెప్పే ప్రయత్నమే చేశారాయన. సమాజాన్ని చైతన్యవంతం చేయాలన్న తన లక్ష్యం చలనచిత్ర మాధ్యమం ద్వారా నెరవేరుతుందన్న ఏకైక ఉద్దేశంతో సినిమా గీతాలు రాశానని ఒకానొక సందర్భంలో వంగపండు అన్నారు.


‘విముక్తి కోసం’ చిత్రంలో పాటలన్నీ వంగపండు ప్రసాదరావు రాశారు. కృష్ణంరాజు హీరోగా నటించిన ‘ఉగ్ర నరసింహం’, ‘అగ్గిరాజు’ చిత్రాల్లో కొన్ని పాటలు రాశారు. అందులో ‘ఉగ్ర నరసింహం’ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శక-నిర్మాత. వంగపండు కలం, గళం అందించిన చిత్రాల్లో ఆర్‌. నారాయణ మూర్తివే ఎనిమిది. ‘అర్ధరాత్రి స్వతంత్రం’, ‘చీమల దండు’, ‘రైతాంగ పోరాటం’, ‘భూమి పోరాటం’, ‘రేపటి పౌరులు’, ‘ఎర్రసైన్యం’, ‘అడవి దివిటీలు’, ‘ఎర్ర సముద్రం’ చిత్రాల్లో ఆయన రాసిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టి. కృష్ణ చిత్రాలకూ పాటలు అందించారు. ‘కర్తవ్యం’ చిత్రం కోసం ఆయన రాసిన ‘కొట్టు కొట్టు’ పాట చక్కని ఆదరణ పొందింది.


‘‘నేను రాసిన సినిమా పాటల్లో ‘అర్ధరాత్రి స్వతంత్రం’లో ‘మీ అమ్మ చచ్చినా దమ్మిడొగ్గను’ పాట నాకిష్టమైన పాట’’ అని ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణతో వంగపండు చెప్పారు. ఒక్కో పాటకు వెయ్యి నుండి 1500 రూపాయల పారితోషికం ఇచ్చేవారని ఆయన తెలిపారు.


శ్రీకాకుళంలో అమాయక గిరిజన ప్రజలు తమ బతుకులు బాగు చేసుకోవడానికి ఏవిధంగా పోరాటం చేశారో వివరిస్తూ, వంగపండు రాసిన ‘ఏం పిల్లడో ఎల్ద మొత్తవా’ పాట విశేష ప్రజాదరణ పొందింది. దానిని ‘అర్ధరాత్రి స్వతంత్రం’లో టి. కృష్ణ మీద ఆర్‌. నారాయణమూరి చిత్రీకరించారు. సినిమాలో గీతాన్నీ వంగపండు పాడటం గమనార్హం. తర్వాత మరోసారి ‘ఎర్ర సముద్రం’లో ఆ పాటను ఉపయోగించారు. ‘మగధీర’లో ‘జోర్‌సే’ గీతంలో ‘ఏం పిల్లడో ఎల్ద మొత్తవా’ లైన్లు ఉపయోగించారు. హిట్‌ పాటలు రాసినప్పటికీ... ఎప్పుడూ క్యాష్‌ చేసుకోని రచయిత వంగపండు.


‘మగధీర’ వివాదం

రామ్‌ చరణ్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అల్లు అరవింద్‌ నిర్మించిన ‘మగధీర’ చిత్రంలో ‘జోర్‌సే జోర్‌సే’ పాట విషయంలో వివాదం జరిగిన సంగతి తెలిసిందే! వంగపండు ప్రసాదరావు రచించిన ‘ఏం పిల్లడో.. ఎల్ద మొత్తవా’ లిరిక్స్‌లోని కొన్ని లైన్లను ఆయన అనుమతి లేకుండా ‘మగధీర’లో ఉపయోగించారు. కనీసం లిరికల్‌ క్రెడిట్‌ కూడా ఇవ్వలేదని అప్పట్లో వివాదం అయింది. స్ఫూర్తిదాయకమైన పాటను వల్గర్‌గా చిత్రీకరించారని వంగపండు ఆవేదన వ్యక్తం చేశారని సన్నిహితులు తెలిపారు.


వంగపండు హిట్‌ సాంగ్స్‌

ఏం పిల్లడో ఎల్ద మొత్తవా (అర్ధరాత్రి స్వతంత్రం)

నీయమ్మ సచ్చిన దమ్మిడొగ్గను (అర్ధరాత్రి స్వతంత్రం)

జజ్జనకరి జనారె (విప్లవ శంఖం)

యంత్రమెట్ట నడుస్తుందంటే (చీమలదండు)

అన్నం పెట్టే అన్నదాతకు ఆత్మహత్యలే శరణ్యమా (అన్నదాత సుఖీభవ)

కొట్టు కొట్టు (కర్తవ్యం)

అరుదైన రచయిత!

‘‘వంగపండుగారితో నా ప్రయాణం, స్నేహం సుమారు 40 ఏళ్లనాటిది. అన్న నల్లూరి వెంకటేశ్వర్లు ద్వారా ఆయన పరిచయమయ్యారు. సినిమా ప్రస్థానానికి వస్తే... ఆర్‌. నారాయణమూర్తి ద్వారా ఆయన పరిచయమయ్యారు. పలు చిత్రాలకు కలిసి పని చేశాం. వంగపండుగారు అరుదైన గొప్ప రచయిత. ఆయన పాటల్లో ఎంత కరుకుదనం ఉంటుందో, మనిషిగా ఆయన అంతటి సున్నిత స్వభావం కలవారు. ‘ఎర్ర సముద్రం’లో ఆయన  రాసిన ‘ఏం పిల్లడో ఎల్ద మొత్తవా’ పాడే అవకాశం  దక్కడం నా అదృష్టం.  ఆయన ‘భూభాగోతం’ నాటకాన్ని ప్రదర్శించిన ప్రతిసారి ఆయనతో పాడే అవకాశం దక్కింది’’

‘వందేమాతరం’ శ్రీనివాస్‌


‘‘సినీ పరిశ్రమలో కెరీర్‌ మొదలుపెట్టినప్పటి నుంచీ ఆయనతో నాకు అనుబంధం ఉంది. నా తొలి చిత్రం ‘అర్ధరాత్రి స్వతంత్రం’ చిత్రానికి రెండు అద్భుతమైన పాటలు రచించారు. నేను దర్శకత్వం వహించిన ఎనిమిది చిత్రాల్లో పదికి పైగా పాటలు రాశారు. ప్రజలకు న్యాయం జరిగే ఏ కార్యక్రమానికైనా ఆయన ముందుండేవారు. ఆయన పాటలతో జనాల్లో చైతన్యం కలిగించారు. నేను రెండు రాష్ట్రాలు కావాలని గొంతెత్తితే ఆయన సమైక్యాంధ్ర కోసం పోరాడారు. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినా ఒకరినొకరం గౌరవించుకునేవాళ్లం’’   

ఆర్‌.నారాయణమూర్తి


భూభాగోతాన్ని పిక్చరైజ్‌  చేద్దామనుకున్నాం! కానీ...

‘‘వంగపండుగారు, నేను ‘భూభాగోతం’ నాటకాన్ని పిక్చరైజ్‌ చేద్దామనుకున్నాం. మురళీమోహన్‌ సహాయం తీసుకోవాలనుకున్నాం. నేను వేరే చిత్రాలతో బిజీగా ఉండటం, ఆయన ఉద్యమానికి వెళ్లడంతో కుదరలేదు. జయప్రకాశ్‌ నారాయణ ఆధ్యర్యంలో ‘స్వరాజ్య పాలన’ ఆడియో క్యాసెట్‌కి మేం కలిసి పని చేశాం. అందులో ఆయన, అశోక్‌తేజ, నేను... తలో రెండు పాటలు రాశాం. ఇక, నా సినిమాల్లో ఆయనతో పని చేయడం కుదరలేదు. ఉద్యమ పాటల్లో ఆయనది ప్రత్యేక శైలి’’

దర్శకుడు ధవళ సత్యం


‘‘గొప్ప రచయిత, వాగ్గేయకారులు, వారి పాటతో ఎందరినో చైతన్య పరిచారు. సమాజంలో రుగ్మతలపై, సమాజ చైతన్యం కోసం పాటుపడ్డ నిజమైన ప్రజా కళాకారుడు. పాట - ప్రజా కళలు జీవితంగా బతికారు. ప్రజా కళాకారులకు మరణం ఉండదు. ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా గుర్తుంటారు’’  

మాదాల రవి


Advertisement
Advertisement
Advertisement