దశాబ్దికి అతడే

ABN , First Publish Date - 2020-12-29T06:39:06+05:30 IST

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) పురస్కారాల్లో మరోసారి దుమ్ము రేపాడు. దశాబ్ది వ్యక్తిగత

దశాబ్దికి అతడే

అత్యుత్తమ క్రికెటర్‌ కోహ్లీ

 వన్డే ఆటగాడి అవార్డూ కైవసం

 ధోనీకి ‘స్పిరిట్‌ ఆఫ్‌ ది క్రికెట్‌’ పురస్కారం

 ఐసీసీ దశాబ్ది ‘వ్యక్తిగత’ అవార్డులు


దుబాయ్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ  అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) పురస్కారాల్లో మరోసారి దుమ్ము రేపాడు. దశాబ్ది వ్యక్తిగత అవార్డుల్లో రెండు పురస్కారాలు దక్కించుకున్నాడు. ఇక మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీకి ఇంకో అవార్డు లభించింది. వ్యక్తిగత పురస్కారాల్లో మొత్తం నాలుగింటికి కోహ్లీ పోటీపడగా..దశాబ్ది అత్యుత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు. అలాగే దశాబ్ది ఉత్తమ వన్డే క్రికెటర్‌ అవార్డునూ విరాట్‌ సొంతం చేసుకున్నాడు.


 2011లో ఇంగ్లండ్‌తో నాటింగ్‌హామ్‌ టెస్టులో ఇయాన్‌ బెల్‌ రనౌట్‌ విషయంలో నాటి కెప్టెన్‌ ధోనీ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి అతడికి ‘స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌’ పురస్కారం తెచ్చిపెట్టింది. అవార్డులను ట్విటర్‌ ద్వారా ఐసీసీ సోమవారం వెల్లడించింది. అలాగే పురస్కారాలను వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో విజేతలకు అందజేశారు. 




పదేళ్లు..66 సెంచరీలు

అవార్డుకు..గత పదేళ్లలో చూపిన ప్రతిభను ఐసీసీ పరిగణనలోకి తీసుకోగా..కెరీర్‌లో ఇప్పటివరకు కోహ్లీ చేసిన 70 సెంచరీలలో 66 ఈ దశాబ్దిలోనే రావడం విశేషం. ఇదే సమయంలో అతడు అత్యధిక అర్ధ శతకాలు (94), అత్యధిక పరుగులు (20,396) సాధించాడు. ఇదే కాలంలో..70కిపైగా ఇన్నింగ్స్‌ల్లో గరిష్ఠ సగటు (56.97) నమోదు చేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు. మొత్తంగా 32 ఏళ్ల విరాట్‌ 50కిపైగా సగటుతో వన్డేల్లో 12,040, టెస్టుల్లో 7,318, టీ20ల్లో 2,928 పరుగులు చేశాడు. ఐసీసీ దశాబ్ది అత్యుత్తమ పురుష క్రికెటర్‌ అవార్డుకోసం కోహ్లీతో అశ్విన్‌, జో రూట్‌, సంగక్కర, స్టీవ్‌ స్మిత్‌, డివిల్లీర్స్‌, కేన్‌ విలియమ్సన్‌ పోటీపడ్డారు.


కాగా..ఆదివారం ప్రకటించిన అన్ని ఫార్మాట్ల దశాబ్ది అత్యుత్తమ జట్లలో కోహ్లీ స్థానం దక్కించుకోవడంతోపాటు..టెస్ట్‌ జట్టుకు అతడు కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. మరోవైపు దశాబ్ది వన్డే, టీ20 జట్లకు మహీ సారధిగా ఎంపికయ్యాడు. వన్డే క్రికెట్‌కు సంబంధించి..పదేళ్లలో పదివేలకు పైగా పరుగులు చేసిన క్రికెటర్‌ కోహ్లీయే. ఈ క్రమంలో అతడు 61.83 సగటుతో 39 సెంచరీలు, 48 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. ఈ రికార్డులన్నీ కోహ్లీ దశాబ్ది అత్యుత్తమ క్రికెటర్‌ అవార్డు లభించేందుకు తోడ్పడ్డాయని ఐసీసీ తెలిపింది. 

ఈ అవార్డును స్వీకరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. 2011 వన్డే వరల్డ్‌ కప్‌, 2013 చాంపియన్స్‌ ట్రోఫీ గెలవడం, 2018లో ఆస్ట్రేలియాపై టెస్ట్‌ సిరీస్‌ విజయం గత దశాబ్దిలో నా గుండెను తాకిన మధుర క్షణాలు. ఇక గణాంకాలను నేనెప్పుడూ పట్టించుకోలేదు. అవి నా పయనంలో  మైలురాళ్లు మాత్రమే.

-విరాట్‌ కోహ్లీ

 




 విజేతలు వీరే..


ఎలిస్‌ పెర్రీ (ఆస్ట్రేలియా)


విరాట్‌ కోహ్లీ (గ్యారీ సోబర్స్‌ దశాబ్ది అత్యుత్తమ పురుష క్రికెటర్‌, వన్డే క్రికెటర్‌)

ఎలిస్‌ పెర్రీ (దశాబ్ది అత్యుత్తమ మహిళా క్రికెటర్‌, వన్డే, టీ20 క్రికెటర్‌)


ఎంఎస్‌ ధోనీ (స్పిరిట్‌ ఆఫ్‌ ది క్రికెట్‌)

స్టీవెన్‌ స్మిత్‌ (అత్యుత్తమ టెస్టు క్రికెటర్‌)

రషీద్‌ ఖాన్‌ (అత్యుత్తమ టీ20 క్రికెటర్‌)


కైల్‌ కొయిట్జర్‌ (స్కాట్లాండ్‌, అసోసియేట్‌  దేశాల పురుష క్రికెటర్‌)

కాథరిన్‌ బ్రైస్‌ (స్కాట్లాండ్‌, అసోసియేట్‌ దేశాల మహిళా క్రికెటర్‌)


Updated Date - 2020-12-29T06:39:06+05:30 IST