రాత పరీక్షల మార్కులే కీలకం

ABN , First Publish Date - 2020-08-05T09:09:50+05:30 IST

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూలు అత్యంత కీలకం. కానీ, కొన్నేళ్లుగా ఈ పరీక్షల ప్రక్రియను పరిశీలిస్తే ఇంటర్వ్యూల

రాత పరీక్షల మార్కులే కీలకం

  • అవే ఓవరాల్‌ టాపర్లను నిర్ణయిస్తున్నాయ్‌ 
  • నామమాత్రంగా మారిన యూపీఎస్సీ ఇంటర్వ్యూ?
  • వాటిల్లో రాణించలేకపోతున్న రాతపరీక్షల ర్యాంకర్లు
  • అయినా అత్యుత్తమ ర్యాంకులు


హైదరాబాద్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూలు అత్యంత కీలకం. కానీ, కొన్నేళ్లుగా ఈ పరీక్షల ప్రక్రియను పరిశీలిస్తే ఇంటర్వ్యూల మార్కులతో పోలిస్తే రాతపరీక్షల మార్కులే టాపర్లను నిర్ణయిస్తున్నాయి. యూపీఎస్సీ-2018 విడుదల చేసిన జాబితాను పరిశీలిస్తే ఇంటర్వ్యూలో టాప్‌-10గా నిలిచిన వారందరూ ఓవరాల్‌ ర్యాంకుల్లో మాత్రం వెనకబడిపోయారు. టాప్‌-20లో నిలిచినవారు కనీసం ఐపీఎస్‌ కూడా సాధించలేకపోయారు. ఉదాహరణకు.. గత ఏడాది ఆల్‌ఇండియా టాపర్‌గా నిలిచిన రాజస్థాన్‌కు చెందిన కనిష్క్‌ కటారియ రాత పరీక్షల్లో 1750 మార్కులకు 942 మార్కులు సాధించగా, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు 179 మాత్రమే. ఇంటర్వ్యూలో ఆయన కనీసం టాప్‌-100లో కూడా లేరు. గత ఏడాదే కాదు అంతకుముందు 2017లో టాపర్‌గా నిలిచిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన అనుదీప్‌ దురిశెట్టి, 2016 టాపర్‌ కర్ణాటకకు చెందిన నాని, 2015లో ఢిల్లీకి చెందిన టీనా బాబీ, 2014లో ఢిల్లీకి చెందిన ఇరా సింఘాల్‌.. ఇలా గత పదేళ్ల రాత పరీక్షల టాపర్ల మార్కులు పరిశీలిస్తే..  వీరంతా ఇంటర్వ్యూల్లో టాప్‌-100లో కూడా లేరు. అయినా రాత పరీక్షలో సాధించిన అత్యధిక మార్కులతో ఓవరాల్‌ టాపర్‌గా నిలుస్తున్నారు. 


నామ మాత్రంగా మారిన ఇంటర్వ్యూ

యూపీఎస్సీలో మొత్తం 2,025 మార్కులకు రాతపరీక్ష ద్వారా 1750, ఇంటర్వ్యూ ద్వారా 275 మార్కులు ఉంటాయి. మేధస్సు, విశ్లేషణ సామర్థ్యం, జనరల్‌ నాలెడ్జ్‌తో పాటు వివిధ సబ్జెక్టుల్లో ప్రతిభను రాతపరీక్ష ఆధారంగా పరీక్షిస్తుండగా.. కీలకమైన వ్యక్తిత్వ విశ్లేషణ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో టాపర్‌గా నిలిచినవారు ఓవరాల్‌ ర్యాంకుల్లో మాత్రం ఎక్కడో మూలన ఉంటున్నారు. రాత పరీక్షలో వచ్చిన మార్కులే ర్యాంకులను నిర్ణయిస్తున్నాయి. గత ఏడాది టాప్‌-10 ర్యాంకుల్లో స్థానం సాఽధించిన ఒకరు ఇంటర్వ్యూలో 275 మార్కులకు సాఽధించినది 96 మాత్రమే.


ఇలా అనేకమంది టాపర్లు ఇంటర్వ్యూల్లో చతికిలబడుతున్నారు. అయినా అత్యుత్తమ ర్యాంకులతో ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకు ఎంపికవుతున్నారు. ఇప్పటి విధానంలో  రాతపరీక్షలకే ప్రాధాన్యత ఉందని, ఇంటర్వ్యూ నామమాత్రంగా మారిందని మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో టాప్‌-120లోపు ర్యాంకు సాధించిన తెలంగాణ అభ్యర్థి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’తో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇంటర్వ్యూలోనూ కనీసం 70-80 శాతం మార్కులు సాధించాలన్న లాంటి నిబంధన అమలుచేస్తే మరింత ప్రతిభావంతులను గుర్తించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-08-05T09:09:50+05:30 IST