విద్యార్థినులపై Headmaster లైంగిక వేధింపులు.. పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా మారని బుద్ధి..

ABN , First Publish Date - 2021-12-27T16:40:49+05:30 IST

ఉపాధ్యాయుడంటే మంచితనం మూర్తీభవించినట్లు ఉండాలి. కానీ

విద్యార్థినులపై Headmaster లైంగిక వేధింపులు.. పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా మారని బుద్ధి..

హైదరాబాద్‌ సిటీ : ఉపాధ్యాయుడంటే మంచితనం మూర్తీభవించినట్లు ఉండాలి. కానీ, షేక్‌పేట్‌ మండల పరిధి బంజారాహిల్స్‌లో ఉన్న ఓ ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బుద్ధి గడ్డి తిన్నట్లుంది. పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, వారిని లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయం తెలిసినా ఉన్నతాధికారులు బయటకు రాకూండా దాచి పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. హెడ్‌ మాస్టర్‌ నిర్వాకాన్ని ఓ విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు తాము మందలిస్తామని నచ్చచెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. గతంలో కూడా సదరు హెడ్‌మాస్టర్‌పై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ చర్యలు ఇప్పటికీ తీసుకోకపోవడం గమనార్హం.


మారని బుద్ధి..

దశాబ్ధ కాలం క్రితం ఫిలింనగర్‌ బాలికల పాఠశాలలో పని చేసిన ఆ హెడ్‌మాస్టర్‌ అక్కడా అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మహిళా వలంటీర్లను సైతం లైంగికంగా వేధించినట్లు తెలిసింది. ప్రస్తుతం బంజారాహిల్స్‌ బాలికల పాఠశాల హెడ్‌మాస్టర్‌గా ఉన్న ఆ వ్యక్తి పదవీ విరమణకు దగ్గరవుతున్నా తన వక్రబుద్ధి మార్చుకోలేదు. ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. విచారణ కోసం పాఠశాలకు వెళ్లిన అధికారులకు అతడిపై ఫిర్యాదులు చేయడమే కాకుండా, పలువురు విద్యార్థినులు కంటతడి పెడుతూ అతడి అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు కూడా చూపినట్లు తెలిసింది.


చర్యలు నిల్‌..

ఈ హెడ్మాస్టర్‌ లీలలపై స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ చిరంజీవిని వివరణ కోరగా స్పందించేందుకు తొలుత నిరాకరించారు. ఆయన ముందు ఆధారాలను ఉంచగా, ఫిర్యాదు అందిన విషయాన్ని నిర్ధారించారు. విచారణ జరుపుతున్నామన్నారు. కొన్నేళ్లుగా హెడ్‌మాస్టర్‌ విద్యార్థినులను వేధిస్తున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించగా దాటవేసే ధోరణిలో మాట్లాడారు. విద్యార్థిని భవిష్యత్‌ దృష్ట్యా ఈ విషయాన్ని వెలుగులోకి తేవద్దని ఆయన కోరడం గమనార్హం.

Updated Date - 2021-12-27T16:40:49+05:30 IST