వెంకటాపురం వాసులకు వైద్యం మిథ్య

ABN , First Publish Date - 2021-09-18T05:35:32+05:30 IST

వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్‌ విష వాయువు బాధితుల కోసం ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ క్లినిక్‌ మూతపడింది.

వెంకటాపురం వాసులకు వైద్యం మిథ్య
మూతపడిన వైఎస్సార్‌ క్లినిక్‌ ఇదే..

మూతపడిన వైఎస్సార్‌ క్లినిక్‌

మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామన్న ప్రకటన బూటకమేనా?

అధికార పార్టీ నాయకుల తీరుపై స్థానికుల ఆగ్రహం

వైద్య సేవలకు ఎక్కడికి వెళ్లాలని ఆవేదన


గోపాలపట్నం, సెప్టెంబరు 17: వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్‌ విష వాయువు బాధితుల కోసం ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ క్లినిక్‌ మూతపడింది. ఇక్కడ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని అధికార పార్టీ నాయకులు చేసిన ప్రకటనలు బూటకమని తేలిపోయిం దని స్థానికులు వాపోతున్నారు. ఏడాది క్రితం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ క్లినిక్‌  మూతపడ డంతో తమకు వైద్య సేవలు ఎలా అందుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. విషవాయువు పీల్చిన వారికి భవిష్యత్తులో కేన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించడంతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని అప్పట్లో స్థానికులు డిమాండ్‌ చేశారు. వీరి ఆందోళనలకు ప్రతిపక్ష పార్టీల నాయకులు మద్దతు పలకడంతో అధికారులు వెంకటాపురంలోని ప్రాథమిక పాఠశాల భవనంలో ఏడాది క్రితం ఐదు పడకలు ఏర్పాటు చేసి తాత్కాలిక క్లినిక్‌ను ప్రారంభించారు. అయితే ఈ క్లినిక్‌లో రోగుల కోసం పడకలు, వైద్య సిబ్బంది ఉన్నా అవసరమైన వైద్య పరికరాలు, మందులు లేకపోవడంతో ఇది కేవలం ప్రథమ చికిత్సలకే పరిమితమైంది. అయితే క్లినిక్‌ను ప్రారంభించిన తొలినాళ్లలో రోజుకు ఇరవై, ముఫ్పై మంది రోగులు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకునేవారు. అయితే తగిన సౌకర్యాలు లేకపోవడంతో ఈ క్లినిక్‌కు ప్రథమ చికిత్సల కోసం మాత్రమే స్థానికులు వచ్చేవారు. దీంతో అప్పటి వరకు నలుగురు సిబ్బందితో 24 గంటల పాటు నడిచిన క్లినిక్‌ను ఉదయం పూట మాత్రమే నిర్వహించే విధంగా సిబ్బందిని తగ్గించారు. గత నెల వరకు కేవలం ఒక వైద్యురాలు మాత్రమే డిప్యూటేషన్‌పై ఈ క్లినిక్‌లో సేవలు అందించేవారు. కాగా వారం రోజుల క్రితం ఆమె డిప్యూటేషన్‌ సమయం ముగిసింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమె తిరిగి వెళ్లిపోవడంతో క్ల్లినిక్‌ మూతపడింది. 

ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన

ఎల్జీ పాలిమర్స్‌ విష వాయువు లీకేజీ సంఘటన తరువాత వెంకటాపురంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనలు ఉధృతం కాకుండా అప్పట్లో కంటితుడుపు చర్యగా ఈ క్లినిక్‌ను ప్రారంభించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వం కోల్పోయిన గ్రామస్థులకు కనీసం వైద్య సేవలు అందించడానికైనా ప్రభుత్వం స్పందించలేదంటూ స్థానికులు వాపోతున్నారు.


Updated Date - 2021-09-18T05:35:32+05:30 IST