పెళ్లి దుస్తులతోనే వైద్యం

ABN , First Publish Date - 2021-12-01T04:45:50+05:30 IST

పెళ్లి తంతు ముగించుకుని హైదరాబాదు నుంచి ప్రొద్దుటూరు తిరుగు ప్రయాణమైన వధువు, వరుడు ప్రయాణిస్తున్న వాహనశ్రేణిలో ఓ వాహనం ప్రమాదానికి గురైంది.

పెళ్లి దుస్తులతోనే వైద్యం
పెబ్బేరు పీహెచ్‌సీలో లక్ష్మిదేవికి వైద్యం అందిస్తున్న మల్లెల హర్షతేజారెడ్డి

హైదరాబాదులో మల్లెల లింగారెడ్డి కొడుకు వివాహం

తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం 

గాయపడ్డ వారికి వైద్యం


ప్రొద్దుటూరు క్రైం, నవంబరు 30 : పెళ్లి తంతు ముగించుకుని హైదరాబాదు నుంచి ప్రొద్దుటూరు తిరుగు ప్రయాణమైన వధువు, వరుడు ప్రయాణిస్తున్న వాహనశ్రేణిలో ఓ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వరుడి తల్లితో పాటు మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. వీరికి యువ వైద్యుడైన నవవరుడే వైద్యం అందించాడు. వివరాలిలా.. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు మల్లెల లక్ష్మీప్రసన్నల కుమారుడు డాక్టర్‌ హర్షతేజారెడ్డి, డాక్టర్‌ లక్ష్మిసాహిత్య వివాహం హైదరాబాదులో 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు జరిగింది. ఈ పెళ్లి తంతు ముగిసాక డాక్టర్‌ హర్షతేజారెడ్డి, డాక్టర్‌ లక్ష్మిసాహిత్య కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి వాహనాల్లో ప్రొద్దుటూరుకు బయలుదేరారు. మార్గమధ్యంలో జడ్చర్ల దాటాక సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో వాహనశ్రేణిలోని ఓ వాహనం ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న వరుడి తల్లి మల్లెల లక్ష్మీప్రసన్న, వైసీపీ కౌన్సిలర్‌ గరిశపాటి లక్ష్మిదేవి, మరో మహిళ గాయపడ్డారు. వెంటనే వీరిని సంఘటనా స్థలికి దగ్గరలోని పెబ్బేరు ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా, ఆ సమయంలో అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. దీంతో ఎంఎస్‌ ఆర్థో పూర్తి చేసిన నవవరుడు డాక్టర్‌ హర్షతేజారెడ్డి పెళ్లిబట్టలతోనే వైద్యం అందించారు. ఆచారం, సంప్రదాయం పక్కన పెట్టి వైద్యం చేయడం పట్ల అక్కడి వైద్య సిబ్బంది అభినందించారు.

Updated Date - 2021-12-01T04:45:50+05:30 IST