జగనన్న.. మాట నిలబెట్టుకో

ABN , First Publish Date - 2020-10-28T05:02:39+05:30 IST

డీఎస్సీ ద్వారా నియామకమై 19 ఏళ్ల నుంచి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న తమ సర్వీసు క్రమబద్ధీకరించాలని హెల్త్‌ అసిస్టెంట్లు డిమాండ్‌ చేశారు.

జగనన్న.. మాట నిలబెట్టుకో

పాలకోడేరు, అక్టోబరు 27: డీఎస్సీ ద్వారా నియామకమై 19 ఏళ్ల నుంచి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న తమ సర్వీసు క్రమబద్ధీకరించాలని హెల్త్‌ అసిస్టెంట్లు డిమాండ్‌ చేశారు. జగనన్న ఎన్నికల ముందు ఇచ్చిన మా ట నిలబెట్టుకో అంటూ కాంట్రాక్ట్‌ అభ్యర్థులు కోరారు. పాలకోడేరులో కాంట్రాక్ట్‌ హెల్త్‌అసిస్టెంట్‌లు మంగళవారం మంచినీటి ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపారు. జిల్లాలో సుమారు 350 మంది అభ్యర్థులు 92 పీహెచ్‌సీలో కాంట్రాక్ట్‌ సేవలందిస్తున్నారన్నారు. వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయం లో హెల్త్‌అసిస్టెంట్‌లు ఎంతో కష్టించి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని వాపోయారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగం చేస్తున్న పలువురు మృత్యువాత పడడంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కాంట్రాక్టు వైద్యసిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నా ఉద్యోగ భద్రత కల్పించడంలో పట్టనట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 19 ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నా తమ జీవితాలు దినదినగండంగా సాగుతున్నాయని వారు వాపోతున్నారు. ఎన్నికలకు ముందు జగన్‌మోహన్‌రెడ్డి కాంట్రాక్టు హెల్త్‌ ఉద్యోగులందరినీ పర్మినెంట్‌ చేస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని వారు కోరారు. తమ సర్వీసు క్రమబద్ధీకరించే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.


నేడు పాలకోడేరులో సమావేశం

కాంట్రాక్టు హెల్త్‌అసిస్టెంట్‌ల సమస్యలపై చర్చించేందుకు బుధవారం పాలకోడేరులో సమావేశం కానున్నారు. ఈ మేరకు హెల్త్‌అసిస్టెంట్‌లు ఎస్‌ బురాన్‌ఖాన్‌, జే.శ్రీను ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉన్న హెల్త్‌అసిస్టెంట్‌లు అందరూ తప్పక హాజరుకావాలని వారు కోరారు.


ప్రాణత్యాగానికైనా సిద్ధం

భీమవరం టౌన్‌: ఉద్యోగ భద్రత కల్పించకుంటే కాంట్రాక్ట్‌ హెల్త్‌ అసిస్టెంట్లు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని ఏపీ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ జీవీవీ.ప్రసాద్‌ అన్నారు. పాలకోడేరులో కాంట్రాక్టు, హెల్త్‌ అసిస్టెంట్ల ఆందోళన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏళ్ల తరబడి ఎదురు చూశామని, మాటిచ్చిన ముఖ్యమంత్రి కూడా కాల యాపన చేయడంతో కాంట్రాక్టు ఉద్యోగులు తీవ్ర ఆవేదనతో ఉన్నారన్నారు. గత ప్రభుత్వం తమను మోసం చేసిందని, ఈ ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి ఎదురవుతోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-10-28T05:02:39+05:30 IST