పెరుగు, మజ్జిగ తాగడం వల్ల ఇన్ని లాభాలా..?

ABN , First Publish Date - 2020-06-09T21:20:48+05:30 IST

పెరుగు వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అపారమైనవి. పాలలో కంటే పెరుగులో లాక్టోజు తక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి పాలలోని లాక్టోజ్‌ సరిపడని కారణంగా పాలు

పెరుగు, మజ్జిగ తాగడం వల్ల ఇన్ని లాభాలా..?

ప్రశ్న: పెరుగు, మజ్జిగ చేసే మేలేంటి? 

- సుశీల, మహబూబ్‌నగర్‌


డాక్టర్ సమాధానం: పెరుగు వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అపారమైనవి. పాలలో కంటే పెరుగులో లాక్టోజు తక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి పాలలోని లాక్టోజ్‌ సరిపడని కారణంగా పాలు, పాల ఉత్పత్తులు తిన్నప్పుడు జీర్ణాశయ ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు కూడా పెరుగును హాయిగా తినవచ్చు. పెరుగులో ప్రొటీన్లు అధికం. పాలకంటే పెరుగులో ఉన్న ప్రొటీన్లను శరీరం త్వరగా శోషించు కుంటుంది. పెరుగులో అధిక మోతాదులో లభించే గ్లైసిన్‌, ప్రొలైన్‌ అనే అమైనో ఆమ్లాలు చర్మాన్ని, గోళ్లను, వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తాయి. క్యాన్సర్‌ను, ముఖ్యంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌, పెద్దపేగుల క్యాన్సర్ల నిరోధకంగా పని చేసే ‘కాంజుగేటెడ్‌ లినోలిక్‌ యాసిడ్‌’ అనే ఫాటీయాసిడ్‌ ఇళ్లల్లో చేసే పెరుగులో ఎక్కువ. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, జింక్‌ లాంటి ఖనిజాలతో పాటు రిబోఫ్లోవిన్‌, నియాసిన్‌, బి-6, బి-12 లాంటి విటమిన్లు పెరుగులో అధికంగా ఉంటాయి. పెరుగు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకాన్ని పోగొట్టి, నీళ్ల విరోచనాలను నియంత్రిస్తుంది. కూర ముక్కలు వేసి రైతా లాగా, కొన్ని రకాల రోటి పచ్చళ్లలో, కూరల్లో పెరుగు కలపడం ద్వారా తీసుకోవచ్చు. ఏ కాలంలో అయినా రోజుకు ఓ పూట పెరుగు తీసుకుంటే మంచిది. మజ్జిగను వేసవిలో నీటికి ప్రత్యామ్నాయంగా తాగవచ్చు. వడదెబ్బ బారి నుంచి కాపాడడానికి మజ్జిగ ఉపయోగపడుతుంది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-06-09T21:20:48+05:30 IST