ఆరోగ్య కార్డు!

ABN , First Publish Date - 2021-10-01T06:37:39+05:30 IST

ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌లో భాగంగా దేశంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డు ఇచ్చే భారీ కార్యక్రమానికి కేంద్రప్రభుత్వం నడుంబిగించింది....

ఆరోగ్య కార్డు!

ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌లో భాగంగా దేశంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డు ఇచ్చే భారీ కార్యక్రమానికి కేంద్రప్రభుత్వం నడుంబిగించింది. ఏడాదికాలంగా ఆరు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలైన ఈ పథకం ఇకపై దేశవ్యాప్తంగా అమలు జరుగుతుంది. ప్రతీ ఒక్కరి ఆరోగ్య రహస్యాన్నీ తనలో భద్రపరుకున్న ఒక గుర్తింపు కార్డు ఆధార్‌ తరహాలో జేబులోకి వచ్చిచేరబోతున్నది. గోప్యతకు సంబంధించిన భయాలు, వాదనలు ఈ ఆరోగ్యకార్డు విషయంలోనూ లేకపోలేదు. అత్యంత ముఖ్యమైన ‘పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు–2019’ ఇంకా పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉండగా ఈ హెల్త్‌ కార్డుకు సంకల్పించడం సరికాదంటున్నవారూ ఉన్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమస్త సమాచారాన్నీ సంక్షేమం పేరిట ప్రభుత్వం సేకరించి భద్రపరుస్తున్నప్పటికీ అది రాబోయే రోజుల్లో కార్పొరేట్‌ సంస్థలకూ, వేగంగా విస్తరిస్తున్న ప్రైవేటు బీమా సంస్థలకు లబ్ధిచేకూర్చవచ్చునన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.


రాజస్థాన్‌లో నాలుగు మెడికల్‌ కాలేజీలు ఆరంభిస్తూ ప్రధాని నరేంద్రమోదీ ఆరోగ్యరంగంమీద దృష్టిసారించవలసిన అవసరాన్ని గుర్తుచేశారు. కరోనాతో గుణపాఠాలు నేర్చినందునే ఆరోగ్యరంగంలో సంస్కరణలు ఆరంభించామన్నారు. కరోనా దెబ్బకు ఆర్థికం ఎంత దెబ్బతిన్నదో తెలియదుకానీ, దానిని అడ్డుపెట్టుకొని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు చిత్తంవచ్చిన నిర్ణయాలు చేస్తున్న విషయం తెలిసిందే. అప్పులూ అమ్మకాలూ తాకట్టులకు అంతులేకుండా పోతున్నది. ప్రధానంగా ప్రభుత్వరంగం బతికిబట్టకట్టకూడదన్న రీతిలో కేంద్రం బంగారు బాతులను కూడా పీకనులిమేస్తున్నది. ఏడుదశాబ్దాలపాటు నిర్మించుకున్న వ్యవస్థలన్నీ బడాబాబులకు, కార్పొరేట్లకు హారతి అయిపోతున్న పాడుకాలం ఇది. ఆరోగ్యరంగంలో అద్భుతసంస్కరణలకు కరోనా తమను మేల్కొలిపిందని ఇలా విన్నప్పుడు అనుమానాలు, భయాలు కలగడం సహజం. కనిపించే ప్రయోజనాలకంటే, తెరవెనుక లక్ష్యాలు మరేవో ఉండివుంటాయన్న అడ్డగోలు వాదనలకూ ప్రస్తుత కాలం అవకాశం ఇస్తున్నది. 


యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేజ్‌ (యూపీఐ) లాగానే, హెల్త్‌ ఇంటర్‌ఫేజ్‌ వాడతారనీ, వైద్యులు, ల్యాబులు, ఆస్పత్రులు, చివరకు మందుల దుకాణాలు కూడా ప్రతీ రిపోర్టునూ డిజిటల్‌ రూపంలో రికార్డుచేయడంతో ఒక రోగి సమస్త సమాచారమూ నమోదవుతుందని చెబుతున్నారు. ఆధార్‌ మాదిరిగానే పద్నాలుగు అంకెల డిజిటల్‌ హెల్త్‌ ఐడీతో రోగి ఆరోగ్యచరిత్ర మొత్తం కంప్యూటర్‌ స్క్రీన్‌మీద ప్రత్యక్షమవుతుంది. రోగి దేశంలో ఎక్కడనుంచి ఎక్కడకు పోయినా, హఠాత్తుగా ఏ ఆస్పత్రిలో చేరవలసి వచ్చినా వైద్యులు అతడి చరిత్ర చూసుకొని వైద్యం చేయవచ్చును. కొన్ని విషయాలు వైద్యులకు చెప్పడం మరిచిపోయామన్న బాధా తప్పుతుంది, పాత రికార్డులు మోయవలసిన బరువూ ఉండదు. ఈ డిజిటల్‌ హెల్త్‌మిషన్‌లో భాగంగా సేకరించే ప్రతీ ఒక్కరి ఆరోగ్యసమాచారాన్ని రహస్యంగా, భద్రంగా దాచుతామని ప్రభుత్వం చెబుతోంది. రోగి ఆమోదించని పక్షంలో ఎవరూ అతడి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోలేరన్నది వినడానికి బాగుంటుంది తప్ప ఆచరణ సాధ్యం కాదు. చిన్న ఆరోగ్య సమస్యతో తమవద్దకు వచ్చినవారిని కూడా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు దోచేస్తున్న స్థితిలో, ఇకపై రోగి చరిత్ర అంతా వారికి కనిపించవచ్చు. పౌరుల ఆరోగ్యసమాచారాన్ని ఇలా సేకరించి, విశ్లేషించడం ద్వారా మెరుగైన పథకాలు తయారుచేయవచ్చుననీ, అవసరమైన నిధులు కేటాయించవచ్చునని ప్రభుత్వాలు చెబుతూంటాయి. కానీ, ప్రతీ ఏటా క్రమం తప్పకుండా వచ్చిపడే వ్యాధులను కూడా పాలకులు ఏ మాత్రం అరికట్టగలుగుతున్నారో చూస్తూనే ఉన్నాం.


ఆధార్‌ మాదిరిగా దశాబ్దాలు కాకున్నా, దేశప్రజలందరికీ ఈ ఆరోగ్యకార్డులు అందించడానికి ఎన్నో ఏళ్ళుపట్టవచ్చు. నమోదులో లోపాలు ఉండవచ్చు, డేటా అక్రమవాడకానికి సంబంధించిన కుంభకోణాలూ జరగవచ్చు. ఈ తరహా ఆరోగ్యకార్డులకంటే ప్రతీ గ్రామంలో చక్కగా పనిచేస్తున్న ఒక ఆరోగ్యకేంద్రం, సరిపడా మందులు, తగినంతమంది వైద్యులు, వైద్యసిబ్బంది ఉండేట్టు చేయగలిగితే అత్యధికశాతం ప్రజలకు మేలు జరుగుతుంది కదా అని నిపుణులు అంటున్నారు. ప్రతీజిల్లాకు ఒక వైద్యకళాశాల ఏర్పాటుతో పాటు, మొత్తం ఆరోగ్యరంగాన్నే ప్రక్షాళిస్తానని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇస్తున్నారు.

Updated Date - 2021-10-01T06:37:39+05:30 IST