గోళ్ల రంగులో ఆరోగ్య జాతకం.. ఇలా చెక్ చేసుకుని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

ABN , First Publish Date - 2021-12-30T12:59:30+05:30 IST

మీ ఆరోగ్య పరిస్థితిని మీ గోళ్ల రంగు, ఆకృతి..

గోళ్ల రంగులో ఆరోగ్య జాతకం.. ఇలా చెక్ చేసుకుని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

మీ ఆరోగ్య పరిస్థితిని మీ గోళ్ల రంగు, ఆకృతి ఇట్టే తెలియజేస్తాయి. మీ గోళ్లను చూసి మీ ఆరోగ్యానికి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకోవచ్చు. కొంతమంది గోళ్లు పసుపు, నలుపు, తెలుపు రంగులలోకి మారడాన్ని మీరు గమనించే ఉంటారు. అలాగే కొందరి గోళ్లపై నీలం లేదా నలుపు రంగు గీతలు కనిపిస్తాయి. మరికొందరి గోళ్లు బలహీనంగా మారి విరిగిపోవడాన్ని కూడా చూస్తుంటాం. గోళ్లలో కనిపించే ఇటువంటి మార్పులు సాధారణమైనవి కావు. ఇవి పలు రకాల వ్యాధులను సూచిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీ గోళ్లలో సంభవించిన మార్పులు ఏ వ్యాధిని సూచిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఎరుపు రంగు

మీ శరీరంలోని ఏభాగంలోనైనా మంట లేదా లూపన్ (ఆటో ఇమ్యూన్)వ్యాధి ఉంటే, మీ గోళ్ల రంగు మారేందుకు అవకాశాలున్నాయి. అటువంటి పరిస్థితిలో మీ గోళ్ల రంగు ఎరుపులోకి మారుతుంది.

పసుపు రంగు

గోళ్ల రంగు పసుపులోకి మారితే అది ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు సంకేతం. అలాగే ఇది థైరాయిడ్, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధిని కూడా సూచిస్తుంది.

తెల్లటి మచ్చలు

కొంతమందికి గోళ్లపై తెల్లటి మచ్చలు వస్తాయి. ఇవి కనిపించినప్పుడు వారికి విటమిన్ బి, ప్రొటీన్, జింక్ లోపం ఉందని అర్థం చేసుకోవాలి.


నీలి, నలుపు మచ్చలు

గోళ్లపై నీలి, నలుపురంగు మచ్చలు ఉంటే శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరగడం లేదని అర్థం. రక్త ప్రసరణకు భంగం ఏర్పడినప్పుడు గోళ్లపై నలుపు లేదా నీలిరంగు మచ్చలు ఏర్పడతాయి. గుండె జబ్బుల బారిన పడినవారి గోళ్ల రంగు కూడా ఈ విధంగా మారుతుంది.

తెల్లటి గీతలు

ఎవరి గోళ్లపైనైనా తెల్లటి చారలు కనిపిస్తే, అది కిడ్నీ లేదా కాలేయ సంబంధిత వ్యాధికి సంకేతంగా గ్రహించాలి. అంతే కాకుండా గోళ్లపై తెల్లటి గీతలు ఏర్పడటం హెపటైటిస్  వ్యాధికి సంకేతంగా గమనించాలి.

గోళ్లు విరగడం

కొందరి గోళ్లు బలహీనపడి విరిగిపోవడం జరుగుతుంటుంది. ఈ లక్షణం అనేక వ్యాధులకు సంకేతమని అర్థం చేసుకోవచ్చు. గోళ్లలో ఇటువంటి సమస్య కనిపిస్తే శరీరంలో తగినంత రక్తం లేకపోవడం లేదా థైరాయిడ్ వంటి వ్యాధి ఉండవచ్చని గుర్తించాలి. ఇటువంటి ఏ లక్షణమైనా మీ గోళ్లపై కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

Updated Date - 2021-12-30T12:59:30+05:30 IST