విలువలతో కూడిన విద్యనందించాలి: మంత్రి ఈటల

ABN , First Publish Date - 2020-09-27T09:43:15+05:30 IST

పరీక్షల్లో సాధించిన మార్కులనే ప్రామాణికంగా తీసుకోకుండా, విలువలతో కూడిన నాణ్యమైన విద్య ను అందించాలని

విలువలతో కూడిన విద్యనందించాలి: మంత్రి ఈటల

పద్మారావునగర్‌, సెప్టెంబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): పరీక్షల్లో సాధించిన మార్కులనే ప్రామాణికంగా తీసుకోకుండా, విలువలతో కూడిన నాణ్యమైన విద్య ను అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ, ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న పద్మారావునగర్‌లోని సర్దార్‌ పటేల్‌ కళాశాల(ఎస్పీ కాలేజీ) 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం స్వర్ణోత్సవాలను మంత్రి ఈటల ప్రారం భించారు. ఈ సందర్భంగా కాలేజీలో గోల్డెన్‌ జూబ్లీబ్లాక్‌ను ప్రారంభించి, ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, మధ్య తరగతి విద్యార్థులకు తక్కువ ఫీజులతో ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఎగ్జిబిషన్‌ సొసైటీ, ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుల సంఘం సంయుక్తంగా 1970లో ఎస్పీ కళాశాలను ప్రారంభించారని, రాష్ట్రవ్యాప్తంగా 18 కళాశాలలను నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ టి.వి.గోపాలచారి, కార్యదర్శి జివి.రంగారెడ్డి, కోశాధికారి వనం సురేందర్‌, సహ కార్యదర్శి చక్రవర్తి, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.నర్మద, ఎగ్జిబిషన్‌, ఓజీసీ సభ్యులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-09-27T09:43:15+05:30 IST