ఉస్మా ‘నయా’హామీలైనా నెరవేరేనా.. మంత్రి Harish rao మాట నిలబెట్టుకుంటారా..!?

ABN , First Publish Date - 2021-12-15T14:38:55+05:30 IST

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. దాదాపు మూడు గంటల పాటు..

ఉస్మా ‘నయా’హామీలైనా నెరవేరేనా.. మంత్రి Harish rao మాట నిలబెట్టుకుంటారా..!?

  • ముచ్చటగా మూడో మంత్రి హామీల ప్రకటన?
  • ట్విన్‌ టవర్స్‌పై ముందుకు పడని అడుగులు  
  • మోడ్రన్‌ హామీ మూడోసారీ..

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. దాదాపు మూడు గంటల పాటు కలియ తిరిగి ఆస్పత్రి అభివృద్ధికి పలు కొత్త హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో గతంలో కూడా నాటి మంత్రులు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగా మిగిలాయని పలువురు బాహాటంగానే చర్చించుకున్నారు. 


గత మంత్రులు కూడా...?

2017లో అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఉస్మానియా మార్చురీలో పర్యటించి మోడ్రన్‌గా తీర్చిదిద్దుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని మార్చురీలను ఆధునికీకరించడంతోపాటు మోడ్రన్‌ మార్చురీల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీఎన్‌ఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు. 2018 వరకు ఎలాంటి పనులూ మొదలు కాలేదు. ఆ తర్వాత వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు చేపట్టిన ఈటల రాజేందర్‌ ఉస్మానియాలో పర్యటించి వెంటనే రూ.19.50 కోట్లు మంజూరు చేస్తున్నామని, పాత భవనాన్ని ఓ ట్రస్ట్‌ సహకారంతో పటిష్టం చేస్తున్నామని ప్రకటించారు. అందుకు అనుగుణంగా జీవో విడుదల చేయడంతోపాటు భవనం పటిష్టతకు దాదాపు రూ.23 కోట్లు విడుదల చేశారు. నిధులు మంజూరు చేసినప్పటికీ నేటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఆ శాఖను హరీశ్‌రావుకు అప్పగించారు. మొదటిసారి మంగళవారం ఉస్మానియా ఆస్పత్రికి వచ్చిన హరీష్‌రావు మార్చురీలో పర్యటించి వెంటనే రూ.5 కోట్లు విడుదల చేస్తున్నామని, మార్చురీ నూతన భవనం నిర్మించడంతోపాటు రాష్ట్రంలో ఉన్న అన్ని మార్చురీలను ఆధునికీకరించనున్నట్లు ప్రకటించారు.


నిధులు మంజూరైనా..

లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్‌లు కూడా గతంలో ఆస్పత్రిలో అభివృద్ధి పనులను వెంటనే చేపడుతున్నట్లు ప్రకటనలు చేశారు. ఒక దశలో నిధులు సైతం మంజూరు చేశారు. చివరకు పనులు ప్రారంభం కాక ముందే మంత్రి పదవులకు వారు దూరమయ్యారనే చర్చ సాగుతోంది. లక్ష్మారెడ్డికి ఎన్నికల తరువాత మంత్రి పదవి దక్కకపోగా, పలు సమస్యలతో ఈటల పదవిని, పార్టీని వీడారు. ప్రస్తుతం మంత్రి హారీ‌ష్‌రావు ఇచ్చిన హామీలైనా నెరవేరుతాయా? లేక ఇవి కూడా నీటిమూటలుగానే మిగిలిపోతాయా..? అనేది వేచి చూడాలి.


ట్విన్‌ టవర్స్‌ ఎప్పుడో..?

సీఎం కేసీఆర్‌ తొలిసారి 2015లో ఉస్మానియా ఆస్పత్రిలో పర్యటించిన సందర్భంగా పాత భవనం కూల్చి ట్విన్‌ టవర్స్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే అధికారులు కొద్ది రోజులు హడావిడి చేశారు. నేటి వరకు ట్విన్‌టవర్స్‌ అంశం ఒక్క అంగుళం ముందుకు కదల లేదు.  


ల్యాబ్‌  టెక్నీషియన్ల నిరాశ 

రెండు నెలలుగా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్లకు జీతాలు రావడం లేదు. దాదాపు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్ధీకరించాలనే అంశాలపై మంత్రి నుంచి ప్రకటన వస్తుందని భావించిన వారికి నిరాశే మిగిలింది. కనీసం వారి బాధలను చెప్పుకునేందుకు మంత్రి సమయం ఇవ్వలేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 



Updated Date - 2021-12-15T14:38:55+05:30 IST