ఆరోగ్య సన్నద్ధత

ABN , First Publish Date - 2021-04-10T08:20:50+05:30 IST

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రతి నాలుగు రోజులకు రెట్టింపు..! ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఆరోగ్య సన్నద్ధత

  • ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు
  • 2 లక్షల రెమ్‌డెసివిర్‌ కొనుగోలుకు ఆర్డర్‌
  • ఐదు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సెల్ఫ్‌ జనరేటర్స్‌
  • నేడు ప్రైవేటు ఆస్పత్రులు, వైద్య కళాశాలల
  • యాజమాన్యాలతో ఈటల చర్చలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రతి నాలుగు రోజులకు రెట్టింపు..! ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మున్ముందు తలెత్తనున్న పరిస్థితులు, పరిణామాలను అంచనా వేసుకుని జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా కొవిడ్‌తో భారీగా ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు చేపడుతోంది. గురువారం సీఎం కేసీఆర్‌ వైద్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తీవ్ర ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దాంతో వైద్య శాఖ నిర్ణయాలు తీసుకుంది. కొవిడ్‌తో ఆరోగ్యం విషమించకుండా ఉండేందుకు రోగులకు రెమ్‌డెసివిర్‌ఇస్తారు. కేసులతో పాటు ఆస్పత్రుల్లో చేరికలు పెరగడంతో సీఎం కేసీఆర్‌ యుద్ధప్రాతిపదికన 2 లక్షల డోసుల రెమ్‌డెసివిర్‌ కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు టీఎ్‌సఎంఎ్‌సడీసీ ఉన్నతాఽధికారులు రెమ్‌డెసివిర్‌ కొనుగోలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.


 ఆక్సిజన్‌ సెల్ఫ్‌ జనరేటర్లు

కొవిడ్‌ రోగుల్లో 5 శాతం మందికి ఆక్సిజన్‌ అవసరం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా ప్రభుత్వ దవాఖానల్లో వాడకం 20 శాతం పెరిగింది. దీంతో ప్రాణ వాయువు కొరత రాకుండా హైదరాబాద్‌ గాంధీ, టిమ్స్‌తో పాటు ఖమ్మం, భద్రాచలం, కరీంనగర్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సెల్ఫ్‌ జనరేటర్లను ఏర్పాటు చేస్తోంది. బయటి గాలిని తీసుకుని ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేేస వీటిని కేంద్ర ప్రభుత్వం పంపింది. దీంతో ఆక్సిజన్‌ అయిపోవడం అంటూ ఉండదని అధికారులు చెబుతున్నారు.  22 ఆస్పత్రుల్లో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ట్యాంకులను ప్రభుత్వం ఇప్పటికే  ఏర్పాటు చేసింది.


పాజిటివ్‌లకు గాంధీలో డయాలసిస్‌ 

కరోనా కేసుల పెరుగుదలతో.. కొవిడ్‌ చికిత్స అందిస్తున్న అన్ని సర్కారు దవాఖానల్లో ఎలక్టివ్‌ సర్జరీలను నిలిపివేయాలని వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ శస్త్రచికిత్సలు చేయించుకున్నవారిలో ఎవరైనా ఒకరికి పాజిటివ్‌ వస్తే, మిగిలిన రోగులంతా ఇబ్బంది పడతారని అందుకే ఆ నిర్ణయం తీసుకున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.  పూర్తిస్థాయి కొవిడ్‌ ఆస్పత్రి అయిన టిమ్స్‌లో సీటీ స్కాన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే, దీనికి నెల పట్టే అవకాశం ఉంది. గాంధీ ఆస్పత్రిలో పాజిటివ్‌లకు ప్రత్యేకంగా డయాలసిస్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. 


ఆ వైద్యులకు మళ్లీ చాన్స్‌

ప్రస్తుతం కొవిడ్‌ చికిత్స అందిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో.. గతంలో విఽధులకు డుమ్మా కొట్టి తొలగింపునకు గురైన వైద్యులను తిరిగి సర్వీ్‌సలోకి తీసుకోవాలని వైద్య శాఖ నిర్ణయించింది. తమ పరిధిలోని స్పెషలిస్టు వైద్యుల్లో ఇలాంటివారు ఉంటే..  20లోగా రిపోర్టు చేయాలని ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) డాక్టర్‌ గడల శ్రీనివాసరావు శుక్రవారం ఉత్తర్వ్యులు జారీ చేశారు. కేసుల పెరుగుదలతో.. ప్రైవేటు వైద్య కళాశాలల సేవలను పూర్తిస్తాయిలో వినియోగించుకోవాలని వైద్యశాఖ నిర్ణయించింది. మంత్రి ఈటల రాజేందర్‌ శనివారం ప్రైవేటు వైద్య విద్య కళాశాలల, ప్రైవేటు సూపర్‌ స్పెషాలిటీ యాజమాన్యాలు, నర్సింగ్‌ హోం అధిపతులతో సమావేశం కానున్నారు.

Updated Date - 2021-04-10T08:20:50+05:30 IST