ఆరోగ్యంపై సర్వే...

ABN , First Publish Date - 2021-05-08T04:35:33+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జిల్లాలో కొవిడ్‌ నివారణ చర్యలకు అధికారులు సిద్ధపడ్డారు.

ఆరోగ్యంపై సర్వే...
ఇంటింటి సర్వేలో పాల్గొన్న మునిసిపల్‌ పాలక మండలి, వైద్య బృందం

- కరోనా నివారణ కోసం సర్వేకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం

- జిల్లా వ్యాప్తంగా 591 వైద్య బృందాల ఏర్పాటు

- గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతీ ఇంటిని సందర్శించనున్న వైద్య బృందం

- మొదటి రోజు 30423 గృహాల సందర్శన...436 మందికి వైద్య కిట్ల పంపిణీ

- కరోనా లక్షణాలు ఉన్న 109 మందిని గుర్తింపు

- జిల్లాలో 18 కొవిడ్‌ అవుట్‌ పెషంట్‌ కేంద్రాల ద్వారా వైద్య సేవలు

 వనపర్తి వైద్యవిభాగం, మే 7: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జిల్లాలో కొవిడ్‌ నివారణ చర్యలకు అధికారులు సిద్ధపడ్డారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు  ఫీవర్‌ సర్వేకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు కరోనా సోకిన వారిని వారి ఇంట్లోనే ప్రత్యేక ఐసోలేషన్‌లో పెట్టి ఉచితంగా మందులు ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభించిన జ్వరంపై సర్వే ద్వారా ఇంటింటికి తిరిగి కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారికి పలు సూచనలు, సలహాలు, మందులు ఇచ్చేందుకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు.  

ప్రత్యేక వైద్య బృందాలు...

జిల్లాలో ఒక జిల్లా ఆస్పత్రి, రెండు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, రెండు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, 12 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఒక పీపీ యూనిట్‌ కేంద్రాలు జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఆయా కేంద్రాల ద్వారా కరోనా లక్షణాలు ఉన్న ఓపీ రోగులకు సేవలు అందించేందుకే ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఆ విధంగా జిల్లా ప్రజలకు సేవలు అందించడం కోసం, కరోనాను కట్టడి చేయడం కోసం వైద్యాధికారులు 591 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఒక్కొ టీంలో ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ, అవసరం మేరకు ఆశా వర్కర్లతో పాటు వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, పంచాయతీ సెక్రటరీ, వీఆర్‌వోలు ఇంటింటి ఫీవర్‌ సర్వే నిర్వహిస్తారు. ఇంట్లో ఎవరికైనా జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉన్నాయా? అని తెలుసుకుని వారి వివరాలను నమోదు చేసుకుంటారు. 

ఇంటి దగ్గరే వైద్య పరీక్షలు...

అధికారులు చేపట్టిన సర్వే ద్వారా ఇంటింటిని సందర్శించే ప్రత్యేక బృందాలు ఇంట్లో ఎవరికైనా జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉంటే వారికి అక్కడే థర్మల్‌ స్కానింగ్‌ నిర్వహిస్తారు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, ఆయాసం, వాసన కోల్పోయిన వారికి ఆక్సోమీటర్‌ ద్వారా అక్సిజన్‌ లెవన్‌ను చెక్‌ చేస్తారు. వారిలో ఎవరికైనా స్వల్ప లక్షణాలను గుర్తించినట్లైయితే ఇంట్లోనే ప్రత్యేకంగా (విడిగా) ఉండాలని సూచించి వైద్య కిట్టు పంపిణీ చేస్తారు. మందులు వాడే విధానం, కోవిడ్‌ నిబంధనలు వంటి సలహాలు, సూచనలు ఇచ్చి ఆరోగ్య సేవలు అందిస్తారు. ఒక వేళా కొవిడ్‌ లక్షణాలు తీవ్రంగా ఉండి ఇబ్బంది కరంగా ఉన్న వారిని 108 వాహనం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రానికి రిఫర్‌ చేస్తారు. 

మొదటి రోజు...

కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారు పరీక్ష కేంద్రాలకు (నిబంధనలు పాటించకుండా), జనసమూహాలకు గుంపులు గుంపులుగా రావడంతో వ్యాధి విపరీతంగా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి సర్వేను గురువారం జిల్లా అధికారులు అధికారికంగా ప్రారంభించినప్పటికి శుక్రవారం నుంచే పూర్తి స్థాయిలో సర్వే మొదలైంది. జిల్లాలో ఏర్పాటు చేసిన 591 ప్రత్యేక టీంలు మొదటి రోజు 30423 గృహాలను సందర్శించారు. వారిలో కొవిడ్‌ కాకుండా ఇతరాత్ర ఆరోగ్య సమస్యలు ఉన్న 436 మందిని గుర్తించి మెడికల్‌ కిట్లను అందించారు. అంతేకాకుండా కరోనా లక్షణాలు ఉన్న 109 మందిని ఇంటింటి సర్వే ద్వారా గుర్తించి వారికి హోం ఐసోలేషన్‌ మెడికల్‌ కట్లను ఉచితంగా పంపిణీ చేశారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారు అనవసరంగా జనంలోకి వచ్చి తిరగకుండా ఉండేందుకే ఇంటింటి సర్వే చేపట్టినట్లు అధికారులు తెలుపుతున్నారు. 

కరోనా కట్టడి కోసమే ప్రత్యేక బృందాలు...

జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశాం. ఒక్కొక్క టీం ప్రతీ రోజు 25 నుంచి 30 ఇళ్లకు తిరిగి జ్వరం పరీక్ష నిర్వహిస్తారు. ఎవరికైనా స్వల్ప లక్షణాలు ఉంటే కొవిడ్‌ నిబంధనలను తెలియజేసి అట్టి వారికి ఇంటి దగ్గరే మెడికల్‌ కిట్టు అందిస్తారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిని 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఐసోలేషన్‌కు తరలిస్తాం. ప్రజలు ప్రత్యేక బృందాలకు సహకరించి కరోనా వైరస్‌ వ్యాప్తికి సహకరించాలి. 

- డాక్డర్‌ శ్రీనివాసులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

Updated Date - 2021-05-08T04:35:33+05:30 IST