నిద్రతోనే ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-07-10T06:23:30+05:30 IST

జీవితంలో నిద్రలేని రాత్రులెన్నో ఉన్నాయి. నిద్రపోకుండా కష్టపడ్డాను.. లాంటి మాటలు విజేతల నోటి వెంట వస్తే వినటానికి బావుంటాయి.

నిద్రతోనే ఆరోగ్యం

జీవితంలో నిద్రలేని రాత్రులెన్నో ఉన్నాయి. నిద్రపోకుండా కష్టపడ్డాను.. లాంటి మాటలు విజేతల నోటి వెంట వస్తే వినటానికి బావుంటాయి. అయితే నిద్రలేమి అలవాటు అలానే కొనసాగితే ఏ విజేతలైనా.. జీవితంలో విజయం సాధించలేరు. నిద్ర అనేది నిజమైన జీవితానికి సంకేతం. 

 

నిద్రనే జీవితమా? అనే ప్రశ్న వేసేవాళ్లు కనీసం రోజుకు ఏడు గంటలు నిద్రపోతే చాలు. మానసికంగా ఎంత అద్భుతంగా ఆలోచిస్తారో అర్థమవుతుంది. తక్కువగా నిద్రపోతే మానసిక సమస్యలు మొదలౌతాయి. ఒత్తిడి, కోపం, ఆందోళన మొదలవుతాయి. నిద్రలేమితో బాధపడే వాళ్లు ‘నిద్రరాదు’ అంటూ వారే నిర్ణయించుకుంటారు. క్రమంగా ఆ నిర్ణయం అలవాటుగా మారుతుంది. 


అప్పుడే అసలు కష్టాలు మొదలైతాయి. ముఖ్యంగా వారిలో ఏకాగ్రత ఉండదు. చీటికిమాటికి చిరాకు పడతారు. దీనివల్ల ఎక్కడా విజయం సాధించలేరు. మన శరీరానికి నిద్ర రీఛార్జ్‌ లాంటిదని గుర్తించాలి. ప్రతి వ్యక్తి రోజుకు కనీసం ఆరేడుగంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. నిద్ర సరిగ్గా ఉంటే మెదడులోని న్యూరాన్ల మధ్య కనెక్షన్‌ పెరుగుతుంది.  దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందరిలో కెల్లా హుషారుగా ఉంటారని తాజా పరిశోధనల సారాంశం. ముఖ్యంగా యువత ఏడుగంటలకు పైగా నిద్రపోవాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. ఈ సాంకేతిక ప్రపంచంలో స్మార్టుఫోన్లు, కంప్యూటర్‌ తెరలతో స్నేహం చేసే యువతకు నిద్రలేమి సమస్య అధికంగా ఉంది. నిద్రపోయే ముందు కళ్లపై గ్యాడ్జెట్ల కాంతి కిరణాలు పడకపోవటమే మంచిది. అందుకే వాటికి దూరంగా ఉండాలి. మరుసటి రోజు ఏమి చేయాలో ఓ లిస్ట్‌ను పేపరు మీద రాసుకుని నిద్రపోవటం ఉత్తమం. 

Updated Date - 2021-07-10T06:23:30+05:30 IST