పోషకాల తాంబూలం

ABN , First Publish Date - 2020-07-11T06:14:32+05:30 IST

ఏదైనా సరే అతిగా తినడం మంచిది కాదు. అది పాన్‌కు కూడా వర్తిస్తుంది. వాటిలో ఉపయోగించే వక్క, పొగాకును బుగ్గన పెట్టుకొని గంటల కొద్దీ నమలడం వల్ల నోటి క్యాన్సర్‌కు కారణం అవుతాయి. తమలపాకుల వల్ల ప్రమాదం ఉండదు

పోషకాల తాంబూలం

తమలపాకులు నమలడం వల్ల క్యాన్సర్‌ వస్తుందా? లేక పాన్‌లో ఉపయోగించే ఇతర పదార్థాలతో ప్రమాదముందా వివరించండి. ఎలా తింటే మంచిది?

-కృష్ణవేణి, హైదరాబాద్‌

ఏదైనా సరే అతిగా తినడం మంచిది కాదు. అది పాన్‌కు కూడా వర్తిస్తుంది. వాటిలో ఉపయోగించే వక్క, పొగాకును బుగ్గన పెట్టుకొని గంటల కొద్దీ నమలడం వల్ల నోటి క్యాన్సర్‌కు కారణం అవుతాయి. తమలపాకుల వల్ల ప్రమాదం ఉండదు. ప్రతి శుభకార్యంలోనూ మనం తమలపాకులు ఉపయోగిస్తాం. తమలపాకు ఇంద్రలోకం నుంచి భూమిపైకి రాలిందని కథలుగా చెప్పుకుంటారు. దేవుడి దగ్గర తాంబూలం పెట్టడానికీ, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. తమలపాకులో పలు పోషకాలున్నాయి. కెరోటినాయిడ్స్‌, ఇనుము, క్యాల్షియం, విటమిన్‌ సి, విటమిన్‌ బి, జింక్‌లు సమృద్ధిగా ఉన్నాయి. కొద్ది మోతాదులో ప్రొటీన్‌ కూడా ఉంది. భోజనం తరువాత తమలపాకులు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. నోటి దుర్వాసనను పోగొడుతుంది. ఐరన్‌, క్యాల్షియం ఉండడం వల్ల గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు మేలు చేస్తుంది. వక్క, పొగాకు లేకుండా ఆరోగ్యకరమైన పాన్‌ను తయారుచేసుకుంటే, తినడానికి రుచిగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. 

ఆరోగ్యకరమైన పాన్‌ తయారీ:

శుభ్రంగా కడిగిన తమలపాకులో అప్పుడే అరగదీసిన గంధం ఒక చుక్క, రెండు చుక్కలు సున్నం, లవంగం, యాలక్కాయ, చిటికెడు సోంపు, పెసరగింజంత పచ్చ కర్పూరం, గుల్కండ్‌ (గులాబీ రేకుల లేహ్యం) ఒక టీస్పూన్‌ కలిపి చుడితే చక్కటి పాన్‌ రెడీ. ఈ దినుసులు యాంటీ ఆక్సిడెంట్‌లుగా పనిచేస్తాయి. నమలడం వల్ల గార వదిలి పళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Updated Date - 2020-07-11T06:14:32+05:30 IST