ఆరోగ్యకర సమాజంతోనే అభివృద్ధి

ABN , First Publish Date - 2022-08-06T06:50:42+05:30 IST

ఆరోగ్యకర సమాజంతోనే దేశాభివృద్ధి సాధ్యమని, సీబీఐ మాజీ డైరెక్టర్‌ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

ఆరోగ్యకర సమాజంతోనే అభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ

నూజివీడు, ఆగస్టు 5: ఆరోగ్యకర సమాజంతోనే దేశాభివృద్ధి సాధ్యమని, సీబీఐ మాజీ డైరెక్టర్‌ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం నూజివీడులో సేంద్రియ రైతు ఉత్పత్తిదారుల సంఘం, రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో సేంద్రియ పంటల సాగుపైన అవగాహన సదస్సు, అమృతభూమి సినిమా ఉచిత ప్రదర్శన ప్రారంభం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ సేంద్రియ ఉత్పత్తులతోనే ఆరోగ్యం సాధ్యమన్నారు.  విద్యార్థులు సోషల్‌ మీడియాలో వృథాగా గడిపే సమయాన్ని భూసారం పెంచేందుకు కృషి చేయాలన్నారు. మూల్పూరి చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత లక్ష్మణస్వామి మాట్లాడుతూ భవిష్యత్‌ తరాలకు సారవంతమైన భూమిని అందించేందుకు ప్రతి ఒక్కర్ని కంకణబద్దుల్ని చేసేలా రూపొందించిన అమృత భూమి సినిమా వారం రోజుల పాటు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రదర్శించటం తన కర్తవ్యమన్నారు. నూజివీడు ఏఎంసీ మాజీ చైర్మన్‌, టీడీపీ నాయకుడు కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతు కుటుంబాలన్నీ  ఈ చిత్రాన్ని వీక్షించాలన్నారు.  రోటరీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, రైతు నాయకులు పాతూరి రవి, సినీ నిర్మాత నాయుడు, రోటరీ సభ్యులు ఎస్‌.శ్రీనివాస్‌, కుమారస్వామి పాల్గొన్నారు.


పరిశ్రమల ఏర్పాటుతోనే  ఉపాధి

ఆగిరిపల్లి: పరిశ్రమల ఏర్పాటుతోనే యువ తకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయ పడ్డా రు. శుక్రవారం ఆగిరిపల్లిలో  గ్రామ ప్రము ఖులు మాదల సోమసూర్య ప్రకాశరావు, మాదల వెంకటప్పయ్య విగ్రహాలకు ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. వీరి విగ్రహావిష్కరణకు తాను రాలేకపోయినట్టు తెలిపారు. అనంతరం యువతతో ముఖాముఖి మాట్లాడారు.  మెరుగైన ఉపాధి కావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని యువకుల నుంచి అభ్రిపాయాలు సేకరించారు. ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల తాత్కాలిక లబ్ది తప్పించి ఉపయోగం లేదని పలువురు అభిప్రాయపడ్డారు. అనంతరం  జేడీ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటైతేనే  ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రభుత్వాలు కూడా నిరుద్యోగ యువతకు భృతిని నగదు రూపంలో ఇవ్వకుండా వారి అవసరాల మేరకు నేరుగా చెల్లింపులు చేసే విధానం వల్ల యువత చెడు మార్గంలో పయనించే వీలుండదన్నారు.  ముఖాముఖిలో ఆగిరిపల్లికి చెందిన పాతూరి రవి, కంచర్ల సత్యనారాయణ, చనమోలు బాబూరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-06T06:50:42+05:30 IST