బిడ్డ పుట్టిన నిమిషాల్లోనే భారీ పేలుళ్లు.. బీరుట్‌లో..

ABN , First Publish Date - 2020-08-10T22:36:55+05:30 IST

లెబనాన్ రాజధాని బీరుట్‌లో సంభవించిన భారీ పేలుళ్లు ప్రపంచాన్ని విషాదానికి గురిచేశాయి.

బిడ్డ పుట్టిన నిమిషాల్లోనే భారీ పేలుళ్లు.. బీరుట్‌లో..

బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్‌లో సంభవించిన భారీ పేలుళ్లు ప్రపంచాన్ని విషాదానికి గురిచేశాయి. ఈ ఘటనలో ఇప్పటికే 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 6 వేల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ భారీ పేలుళ్లు సంభవించిన సమయంలో ఓ ఆసుపత్రిలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రతిఒక్కరిని ఆవేదనకు గురిచేస్తున్నాయి. పైనున్న ఫొటోలను పరిశీలిస్తే రక్తపు మరకల్లో ఉన్న వ్యక్తి  అప్పుడే పుట్టిన బాబును తన చేతుల్లోకి తీసుకోవడం గమనించవచ్చు. మరోపక్క ఓ యువతి పడుకున్న బెడ్ కూడా ఇరిగిపోవడం చూడవచ్చు. బీరుట్‌లో పేలుళ్లు సంభవించిన సమయంలో దగ్గరలో ఉన్న ఓ ఆసుపత్రిలో జరిగిన సంఘటన ఇది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. 


బెడ్ మీద కనిపిస్తున్న యువతి పేరు క్రిస్టల్ సవాయా. సరిగ్గా పేలుళ్లు సంభవించే కొద్ది నిమిషాల ముందే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన బిడ్డను తన పక్కన పడుకోబెట్టుకోగా.. సరిగ్గా కొద్ది నిమిషాలకే భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో ఆసుపత్రిలో వస్తువులు మొత్తం చెల్లాచెదురుగా పడిపోయాయి. బెడ్ కూడా ఇరిగిపోయిందంటే పేలుళ్ల ప్రభావం ఏ విధంగా ఆసుపత్రిపై పడిందో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో మొత్తం గందరగోళంగా అనిపించిందని.. అసలు ఏం జరిగిందో కూడా తమకు అర్థం కాలేదని క్రిస్టర్ భర్త సవాయా తెలిపాడు. 


తన భార్య పక్కనే కొడుకు నిద్రపోతున్నాడని.. ఇదే సమయంలో ఓ గాజు గ్లాసు వారిపైకి దూసుకెళ్లడాన్ని తాను గమనించానని సవాయా తెలిపాడు. దీంతో వెంటనే కొడుకును రక్షించేందుకు బెడ్ వద్దకు వెళ్లి తన చేతుల్లోకి తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఈ సమయంలో తనకు, తన భార్యకు అనేక గాయాలయ్యాయని చెప్పాడు. దేవుడి దయవల్ల తన కొడుకుకు ఏమీ జరగకుండా కాపాడగలిగామని సవాయా ఆనందం వ్యక్తం చేశాడు.

Updated Date - 2020-08-10T22:36:55+05:30 IST