మరో 76

ABN , First Publish Date - 2020-07-02T09:38:02+05:30 IST

నగరంలో కరోనా మహమ్మారి పడగవిప్పింది. బుధవారం మరో 76 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మరో 76

వరుసగా రెండో రోజూ

భారీగా కరోనా కేసులు నమోదు 

పెదజాలరిపేటపై పంజా

మరో 20 మందికి పాజిటివ్‌ నిర్ధారణ

ఈ ప్రాంతంలో మొత్తం బాధితులు 107 మంది

ఇంకా పెరిగే అవకాశం

వడ్లపూడి, ఎర్రయ్యపాలెంలో మూడేసి, మద్దిలపాలెం, కొత్తపాలెం, కొత్త నక్కవానిపాలెంలో రెండేసి కేసులు

జిల్లాలో కేసుల సంఖ్య 976


విశాఖపట్నం, జూలై 1 (ఆంధ్రజ్యోతి):  నగరంలో కరోనా మహమ్మారి పడగవిప్పింది. బుధవారం మరో 76 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క పెదజాలరిపేటలోనే 20 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇక గాజువాక ప్రాంతంలోని వడ్లపూడిలో మూడు, మద్దిలపాలెం, కొత్తపాలెం, కొత్త నక్కవానిపాలెంలో రెండేసి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం నమోదైన 76తో కలిపి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 976కు చేరింది. 


పెదజాలరిపేటలో 20

నగరంలోని పెదజాలరిపేట ప్రాంతంపై కరోనా వైరస్‌ ముప్పేట దాడి చేస్తున్నది. బుధవారం 20 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 107కు చేరింది. వైరస్‌ బారినపడిన వారితో ప్రైమరీ కాంటాక్టు అయిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే కేసులు మరింత పెరుగుతాయని అంటున్నారు. పెదజాలరిపేటలో కరోనా కేసులు పెరుగుతుండడంతో సమీపంలో వున్న కిర్లంపూడి లే అవుట్‌, ఈస్ట్‌పాయింట్‌ కాలనీ, చినవాల్తేరు, పెదవాల్తేరు, లాసన్స్‌ బే కాలనీల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పెదజాలరిపేటకు చెందిన పలువురు మహిళలు ఈ ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లలో ఇళ్ల పనులకు వెళుతుండడమే ఇందుకు కారణం.  


వడ్లపూడిలో ముగ్గురికి..

కూర్మన్నపాలెం పరిధిలోని వడ్లపూడి, సిద్ధార్థ నగర్‌, అగనంపూడి సాయినగర్‌ ప్రాంతాల్లో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది. సిద్ధార్థనగర్‌కు చెందిన ఓ వ్యక్తి (57) వైద్యం నిమిత్తం చెన్నై వెళ్లి వచ్చాడు. ఈ నెల 26న పరీక్ష చేయించుకోగా, బుధవారం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది. పరవాడ సమీపంలోని గొర్లెవానిపాలేనికి చెందిన వ్యక్తి (47) శస్త్ర చికిత్స కోసం నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. తొలుత కొవిడ్‌ పరీక్ష కోసం స్వాబ్‌ తీశారు. రిపోర్టు వచ్చిన తరువాత చికిత్స చేస్తామని వైద్యులు చెప్పారు. సొంతూరు దూరం కావడంతో వడ్లపూడిలోని పద్మశాలి వీధిలో గల బంధువులు ఇంటిలో ఉంటున్నాడు. ఆయనకు వైరస్‌ సోకినట్టు బుధవారం రిపోర్ట్‌ వచ్చింది. అలాగే హైదరాబాద్‌ నుంచి వచ్చి సాయినగర్‌లో నివాసముంటున్న యువకుడి (24)కి పాజిటివ్‌గా తేలింది. 


కొత్తపాలెంలో ఇద్దరికి...

గోపాలపట్నం దగ్గరలోని కొత్తపాలెం డీఏఆర్‌ నగర్‌కు చెందిన ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఒక పురుషుడు, మరో మహిళ వైరస్‌ బారినపడ్డారు. ఆ మహిళ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు పరామర్శించేందుకు వెళ్లి వీరిద్దరూ వైరస్‌ బారినపడ్డారు. 

 

ఆరిలోవలో మహిళకు..

ఆరిలోవ టీఐసీ పాయింట్‌ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వుంటున్న 52 ఏళ్ల మహిళకు వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ ఇంట్లో వుంటున్న ఇద్దరు పిల్లలకు వైరస్‌ నిర్ధారణ కాగా, వీరిని కాంటాక్టు అయిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళకు పాజిటివ్‌గా తేలింది.

 

కొత్త నక్కవానిపాలెంలో ఇద్దరికి...

మల్కాపురం పరిధిలోని కొత్త నక్కవానిపాలెంలో ఇద్దరు మహిళలకు వైరస్‌ సోకింది. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లి వచ్చి వైరస్‌ బారినపడిన మహిళ కాంటాక్ట్‌ కేసులుగా భావిస్తున్నారు.  


తగరపువలసలో మహిళకు...

తగరపువలస మెయిన్‌రోడ్డును ఆనుకుని రామాలయం సందులో వుంటున్న 35 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. ఇటీవల హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆమెకు ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. బుధవారం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది.  


ఎర్రయ్యపాలెంలో ముగ్గురికి... 

భీమునిపట్నం మండలం అన్నవరం పంచాయతీ ఎర్రయ్యపాలెంలో ముగ్గురికి వైరస్‌ సోకింది. ఈ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల నగరంలోని పెదజాలరిపేట ప్రాంతానికి వెళ్లి వచ్చాడు. ఇతనికి కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, ఇతనితో సన్నిహితంగా వున్న వారికి వైద్య పరీక్షలు చేశారు. ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.  


ముసలయ్యపాలెంలో ఒకరికి...

సాగర్‌నగర్‌ పరిధిలోని ముసలయ్యపాలెంలో ఒకరికి కరోనా సోకింది. సదరు వ్యక్తి కొద్దిరోజుల కిందట భార్య సీమంతం కోసం శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి వచ్చాడు. తరువాత జ్వరంతో బాధపడుతుండడంతో ప్రథమ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. బుధవారం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది. 


మారికివలసలో ఒకరికి...

మధురవాడ పరిధిలోని మారికివలస రాజీవ్‌ గృహకల్ప కాలనీలో 39 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. ఇటీవల ఢిల్లీ నుంచి రైలులో విశాఖ వచ్చారు. పాజిటివ్‌ రావడంతో కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. 


మద్దిలపాలెంలో దంపతులకు...

మద్దిలపాలెం శివాలయం వీధిలో వుంటున్న దంపతులకు బుధవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించడంతో దంపతులిద్దరూ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. బుధవారం వచ్చిన రిపోర్టుల్లో పాజిటివ్‌గా తేలింది. 


కరోనాతో మెడికల్‌ షాపు యజమాని మృతి

 నగరంలోని తాటిచెట్లపాలెం ప్రధాన రహదారిలో మందుల దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తి (55) కరోనాతో ఆస్పత్రిలో కన్నుమూశారు. కొద్దిరోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ రావడంతో గత నెల 26న కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియల సమయంలో శ్మశానం వద్దకు అనుమతించకపోవడంతో కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోయామని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రధాన రహదారిలో దుకాణం నిర్వహిస్తున్న ఆయనకు స్థానికులతో ఏళ్లనాటి నుంచి అనుబంధం ఉంది. పలు స్వచ్ఛంద సంస్థల్లో సభ్యుడిగా వున్న ఆయన సేవా కార్యక్రమాలు కూడా చేపట్టేవారు. కాగా, ఆయన సతీమణి, వారి కుమారుడు, కుమార్తెలను కూడా ఆస్పత్రికి తరలించారు. ఆయన నివాసం వుంటున్న అపార్ట్‌మెంట్‌ వాసులను క్వారంటైన్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.


జీవీఎంసీ ఉద్యోగికి పాజిటివ్‌

జీవీఎంసీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఒకరికి (27) కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో అతను పనిచేస్తున్న సీ సెక్షన్‌ను పూర్తిగా మూసేశారు. ఆ విభాగం అంతటినీ సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో స్ర్పేయింగ్‌ చేశారు. మూడు రోజులపాటు ఆ విభాగాన్ని మూసేయాలని అధికారులు నిర్ణయించారు. సీ సెక్షన్‌లో ఉద్యోగికి పాజిటివ్‌గా తేలడంతో అతనితో కలిసి పనిచేస్తున్న సహచరులకు, అతనితో కాంటాక్టు అయిన వారిలో ఆందోళన నెలకొంది. అతను పెందుర్తి-పులగాలిపాలెం రోడ్డులో వున్న గేటెడ్‌ కమ్యునిటీలో నివాసం ఉంటున్నాడు.


Updated Date - 2020-07-02T09:38:02+05:30 IST