గాలివానతో పవర్‌ కట్‌.. వణికిపోతున్న విద్యుత్‌వ్యవస్థ

ABN , First Publish Date - 2021-05-16T14:12:27+05:30 IST

గాలివానలకు గ్రేటర్‌లో విద్యుత్‌ వ్యవస్థ వణికిపోతోంది. మూడురోజుల్లో కురిసిన వర్షాలతో

గాలివానతో పవర్‌ కట్‌.. వణికిపోతున్న విద్యుత్‌వ్యవస్థ

  • ఈదురుగాలులకు వణికిపోతున్న విద్యుత్‌వ్యవస్థ
  • గ్రేటర్‌జోన్‌లో 30కి పైగా విరిగిన స్తంభాలు
  • విరిగిపడుతున్న చెట్లకొమ్మలతో తెగిపడుతున్న విద్యుత్‌తీగలు
  • కొమ్మల తొలగింపులో యంత్రాంగం నిర్లక్ష్యం
  • వర్షం పడితే గంటలకొద్దీ నిలిచిపోతున్న విద్యుత్‌సరఫరా
  • నష్టం రూ.20 లక్షలు...

హైదరాబాద్‌ సిటీ : గాలివానలకు గ్రేటర్‌లో విద్యుత్‌ వ్యవస్థ వణికిపోతోంది. మూడురోజుల్లో కురిసిన వర్షాలతో గంటలకొద్దీ  విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు నెలకొనడంతో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులకు చెట్లు విరిగి విద్యుత్‌తీగలపై పడటంతో అవి తెగిపోతున్నాయి. బుధవారం అర్ధరాత్రి కురిసిన గాలివానతో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మణికొండ ప్రాంతాల్లో చెట్లకొమ్మలు విరిగి విద్యుత్‌తీగలపై పడటంతో 16 విద్యుత్‌స్తంభాలు విరిగిపోయాయి.


శుక్రవారం సాయంత్రం కురిసిన గాలివానకు సైతం నాగోలు, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో చెట్లువిరిగి తీగలపై పడటంతో 14 విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్‌తీగలు తెగిపోవడం, స్తంభాలు విరిగిపోవడంతో మరమ్మతులు చేసేందుకు సిబ్బందికి గంటలకొద్ది సమయం పడుతోంది. కొమ్మలు తొలగించడంలో పలు శాఖల మధ్య సమన్వయం కొరవడంతో పనుల్లో ఆలస్యం జరుగుతోంది. వర్షం వస్తే చాలు 2-4 గంటలకు పైగా విద్యుత్‌సరఫరాలో అంతరాయాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నాగోల్‌ ప్రాంతంలో విద్యుత్‌ తీగలు తెగిపోవడంతో 6 గంటలకు పైగా కరెంట్‌సరఫరా నిలిచిపోయిందని స్థానికులు తెలిపారు. విరిగిన స్తంభాలు, తెగిన తీగలతో డిస్కంకు రూ.20లక్షలవరకు నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు.


శివారుప్రాంతాల్లో ముందస్తు చర్యలు అంతంతే..

మరో 20 రోజుల్లో వర్షకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రోజూ వర్షాలు కురిస్తే విద్యుత్‌సరఫరాలో అంతరాయాలు పెరిగే అవకాశాలున్నాయి. గ్రేటర్‌జోన్‌ పరిధిలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో వర్షకాలం ప్రారంభానికి ముందే విద్యుత్‌తీగలకు తగిలే చెట్లకొమ్మలు తొలగించాల్సిన అధికారులు వాటిని పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో సమస్యలు తలెత్తుతున్నాయి.  ప్రధానంగా రాజేంద్రనగర్‌, సైబర్‌సిటీ, మేడ్చల్‌, సరూర్‌నగర్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌, సౌత్‌ సర్కిళ్లలోని పలు సెక్షన్లలో విద్యుత్‌తీగలకు చెట్లకొమ్మలు తగులుతుండటంతో చిన్న వర్షం పడినా  ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. చార్మినార్‌, రాజేంద్రనగర్‌, అఫ్జల్‌గంజ్‌, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, మణికొండ ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాల నిర్వహణలో క్షేత్రస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈదురుగాలులకు స్తంభాలు విరిగిపోతున్నాయి. 


పవర్‌కట్స్‌తో వర్క్‌ ఫ్రం ఉద్యోగులకు తిప్పలు...

వర్షం పడితే చాలు విద్యుత్‌ సరఫరాలో గంట, రెండు గంటలు అంతరాయాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఇళ్లలో ఉంటూ వర్క్‌ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉదయం 10 దాటితే అత్యవసరముంటే తప్ప ఇళ్లనుంచి ఎవరూ బయటకు రావడం లేదు. దీంతో అరగంటపాటు విద్యుత్‌సరఫరా నిలిచిపోయినా విద్యుత్‌శాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1912కు వేలలో ఫిర్యాదులు వస్తున్నాయి. సౌత్‌ సర్కిల్‌ పరిధిలోని అఫ్జల్‌గంజ్‌, చార్మినార్‌, ఓల్డ్‌సిటీతోపాటు రాజేంద్రనగర్‌, బాచుపల్లి, నాగోలు, జీడిమెట్ల, బాలానగర్‌, సికింద్రాబాద్‌ కిమ్స్‌, బోయిన్‌పల్లి, వెస్ట్‌మారెడ్‌పల్లి, పేట్ల బురుజు, అత్తాపూర్‌, హైదర్‌గూడ, జియాగూడ ప్రాంతాల్లో విద్యుత్‌సరఫరాలో అంతరాయాలు ఎక్కువగా నమోదవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. 


ఆపరేషన్‌ విభాగం అధికారుల అప్రమత్తం...

భారీవర్షాల నేపథ్యంలో టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ ఆపరేషన్‌ యంత్రాంగం అప్రమత్తమయ్యింది. గ్రేటర్‌జోన్‌ వ్యాప్తంగా ఎస్‌ఈలు, డీఈలు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రమాదంగా ఉన్న విద్యుత్‌స్తంభాలు, తీగలు యుద్ధప్రాతిపదికన మార్చాలని టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ ఆపరేషన్‌ డైరెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి అధికారులను ఆదేశించారు. సాధారణంగా ఎంత వర్షం కురిసినా విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తలెత్తవని అధికారులు చెబుతున్నారు. ఈదురుగాలులు భారీగా వీస్తుండటంతో చెట్లువిరిగి విద్యుత్‌తీగలపై పడుతుండటంతోనే బరువు తట్టుకోలేక స్తంభాలు విరిగిపోతున్నాయని వారు పేర్కొంటున్నారు. రాత్రివేళల్లో ఈదురుగాలులతో వర్షం కురిస్తే విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా వర్షం తగ్గేవరకు విద్యుత్‌సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆపరేషన్‌ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2021-05-16T14:12:27+05:30 IST