సర్కారీ స్థలాల్లో భారీ భవనాలు.. ప్రభుత్వం పట్టించుకోదేం..!?

ABN , First Publish Date - 2021-06-24T18:24:59+05:30 IST

సర్కారీ స్థలాల్లో వాణిజ్య, నివాస భవనాలు వెలుస్తున్నాయి. నిబంధనలు తోసి రాజని..

సర్కారీ స్థలాల్లో భారీ భవనాలు.. ప్రభుత్వం పట్టించుకోదేం..!?

  • పట్టించుకోని భూ పరిపాలన శాఖ
  • గడువు ముగిసినా లీజుదారుల చేతుల్లోనే
  • యథేచ్ఛగా క్రయ, విక్రయాలు
  • సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌లో బాగోతం
  • చోద్యం చూస్తున్న సీసీఎల్‌ఏ, జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌ సిటీ : సర్కారీ స్థలాల్లో వాణిజ్య, నివాస భవనాలు వెలుస్తున్నాయి. నిబంధనలు తోసి రాజని.. యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. సొంత భూములు ఆక్రమణకు గురవుతున్నా భూపరిపాలన శాఖ పట్టించుకోవడం లేదు. కళ్ల ముందే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా, జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. వెరసి కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఒక్కొక్కటీ కనుమరుగవుతున్నాయి. బడాబాబుల భాగస్వామ్యం, వారి అండదండలతో సాగుతున్న ఆక్రమణల పర్వానికి అధికార యంత్రాంగం వత్తాసు పలుకుతోంది. గ్రేటర్‌లోని ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో ఒక్కటైన సికింద్రాబాద్‌లో ఈ తంతు జరుగుతోంది. ప్రభుత్వం నుంచి లీజు తీసుకున్న భూములను ఒప్పందాలను ఉల్లంఘిస్తూ కొందరు ఇష్టానికి విక్రయిస్తున్నారు. పాత భవనాలను నేలమట్టం చేసి అక్రమంగా కొనుగోలు చేసిన స్థలాల్లో అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. జనరల్‌ బజార్‌లోని ప్లాట్‌ నెంబర్‌-22లో ప్రస్తుతం భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పిల్లర్లకు గుంతలు తీసి ఫౌండేషన్‌ పనులు పూర్తి చేశారు. స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తి బంధువులే ఈ జాగా తీసుకొని నిర్మాణాలు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది.


లీజు ముగిసిన స్థలంలో భవనం

1945లో ఇప్పటి జనరల్‌బజార్‌లోని 190 చదరపు గజాల స్థలాన్ని దుబ్బాక పెద్దనర్సయ్య 30 ఏళ్లకు లీజు తీసుకున్నారు. ప్లాట్‌ నెంబర్‌ -22లోని ఈ స్థలాన్ని లీజ్‌ డీడ్‌-1706 ద్వారా కేటాయించారు. స్థలంలో గ్రౌండ్‌ ప్లస్‌ ఒకంతస్తు నిర్మించి వాణిజ్య అవసరాల కోసం వినియోగించారు. 1975తో  లీజు గడువు ముగిసింది. అనంతరం లీజు రెన్యువల్‌ చేసుకోలేదు. తాజాగా ప్లాట్‌ నెంబర్‌-22లో భవన నిర్మాణ పనులు మొదలయ్యాయి. పెద్ద నర్సయ్య వారసులు స్థలాన్ని ఇతరులకు విక్రయించారని సదరు వ్యక్తులు నిర్మాణం చేపట్టారని స్థానికులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం గడువు ముగిసిన అనంతరం లీజుదారులకు స్థలంపై ఎలాంటి అధికారాలూ ఉండవు. వినియోగించుకునే వెసులుబాటూ వారికి ఉండదు.


కానీ తద్విరుద్ధంగా జనరల్‌ బజార్‌లోని లీజు స్థలాల క్రయ, విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. లీజు స్థలాల పరిరక్షణ కోసం 1989లో అప్పటి సర్కారు జీఓ-109 జారీ చేసింది. గడువు ముగిసిన లీజుదారులు రెన్యువల్‌ చేసుకోని పక్షంలో నోటీసులిచ్చి స్థలాలు స్వాధీనం చేసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ బాధ్యతలు సీసీఎల్‌ఏ చూసుకోవాల్సి ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి 2006లో ప్రభుత్వం మరో జీఓ-177 జారీ చేసింది. రెన్యూవల్‌ చేసుకోని లీజు స్థలాలకు సంబంధించి షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసి స్వాధీనం చేసుకోవాలని పేర్కొంది. ఈ రెండు ఉత్తర్వుల అమలులో సీసీఎల్‌ఏ పూర్తిగా విఫలమైంది. గడువు ముగిసినా.. ఇప్పటికీ స్థలాలను కొందరు అనుభవిస్తుండగా..   మరి కొందరు అమ్ముకుంటున్నారు. లీజు గడువు ఉన్న సమయానికి కూడా కొందరు రుసుము చెల్లించక పోవడం గమనార్హం. 


బ్రిటీష్‌ కాలం నాటి స్థలాలు

బ్రిటీష్‌ పాలనలో అప్పటి మిలిటరీ ఎస్టేట్‌ అధికారులు తమ అవసరాలకు పోను మిగిలిన స్థలాలను వ్యాపార, వాణిజ్య, నివాస అవసరాల కోసం లీజుకిచ్చారు. 1930లో లీజు ప్రక్రియ ప్రారంభమైంది. 1946లో ఫస్లీ రూల్‌ ప్రకారం స్థలాలు సికింద్రాబాద్‌ ల్యాండ్‌ అడ్మినిస్ర్టేషన్‌ అధీనంలోకి వెళ్లాయి. అనంతరం రాష్ట్ర భూపరిపాలన శాఖ (సీసీఎల్‌ఏ) పరిధిలోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు అనంతరం స్థలాల లీజు, కేటాయింపు జరగలేదు. 1989, 2006లో గడువు ముగిసిన లీజు స్థలాల స్వాధీనానికి ఉత్తర్వులు జారీ చేశారు. క్రమం తప్పకుండా లీజు అద్దె చెల్లించిన వారికి నిర్ణీత రుసుం చెల్లించి స్థలాన్ని క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని ప్రభుత్వం 1994లో కల్పించింది. అపరాధ రుసుముతో కలిపి స్థలాలు రెగ్యులరైజ్‌ చేసుకునే అవకాశాన్ని 2003 నుంచి 2005 వరకు కల్పించారు. ఈ క్రమంలో కొందరు ఫీజు చెల్లించి స్థలాన్ని రెగ్యులరైజ్‌ చేసుకున్నారు. వందల సంఖ్యలో స్థలాలకు సంబంధించి క్రమబద్ధీకరణ జరుగలేదు. అయినా ఇప్పటికీ ఆ స్థలాలు వారసత్వంగా సంక్రమించినట్టు కొందరు అనుభవిస్తున్నారు. 


దొందూ.. దొందే...

గ్రేటర్‌ పరిధిలో ఎక్కడ భవనం నిర్మించాలన్నా జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం అనుమతి ఉండాలి. సికింద్రాబాద్‌ పరిసరాల్లోని లీజు స్థలాలకు సంబంధించి వివాదం ఉన్న నేపధ్యంలో సీసీఎల్‌ఏ కమిషనర్‌ ఎన్‌ఓసీ ఇస్తే తప్ప జీహెచ్‌ఎంసీ నిర్మాణ అనుమతులు జారీ చేయకూడదు. స్థలాలను క్రమబద్ధీకరించుకున్న వారు దరఖాస్తు చేసుకుంటే సీసీఎల్‌ఏ నుంచి ఎన్‌ఓసీ వస్తుంది. దానిని జతచేస్తూ జీహెచ్‌ఎంసీలో నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. లీజు గడువు ముగిసి క్రమబద్ధీకరించుకోని స్థలాలకు సంబంధించి అధికారికంగా అనుమతి పొందే అవకాశం లేదు. దీంతో ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టే వారు ఇటు సీసీఎల్‌ఏ, అటు జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను మేనేజ్‌ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా రెండు విభాగాల అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. 


సమాచారం లేదు..

గతంలో స్థలాలను లీజ్‌కు తీసుకున్న వారు రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను ఉన్నతాధికారులకు పంపించాం. అయితే ప్రభుత్వం ఆ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిర్మాణం విషయం గురించి సమాచారం లేదు. - వసంతకుమారి, ఆర్డీఓ, సికింద్రాబాద్‌.

Updated Date - 2021-06-24T18:24:59+05:30 IST