కోలుకోలేని దెబ్బ

ABN , First Publish Date - 2020-12-01T06:18:37+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో నాలుగు రోజులపాటు కుంభవృష్టిగా కురిసిన వర్షాలు ప్రస్తుతం తెరిపిచ్చాయి.

కోలుకోలేని దెబ్బ
ఇంకొల్లు మండలం గంగవరంలో ఉరకెత్తిన మిర్చి తోట

తెరిపిచ్చిన వాన.. వెలుగుచూస్తున్న నష్టాలు 

ఇంకా నీటిలోనే పలు ప్రాంతాల్లో పంటలు

ఉరకెత్తుతున్న మిర్చి, పొగాకు, మొలకెత్తిన మినుము

ఇతర పంటలకూ భారీగానే నష్టాలు

సర్వే ప్రారంభించిన యంత్రాంగం 

   ఒంగోలు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి)/అద్దంకి : నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో  నాలుగు రోజులపాటు కుంభవృష్టిగా కురిసిన వర్షాలు ప్రస్తుతం తెరిపిచ్చాయి. పంట పొలాలను ముంచెత్తిన వర్షపు నీరు కొన్ని ప్రాంతాల్లో బయటకుపోగా, మరికొన్ని చోట్ల అలాగే ఉంది. దీంతో పంటలకు జరిగిన వాస్తవ నష్టాలు వెలుగు చూస్తున్నాయి. అనేకచోట్ల వారంక్రితం వరకు చేతికి అందివస్తాయన్న ఆనందం కలిగించిన పంటలు ప్రస్తుతం సర్వనాశనం కావడం చూసి రైతులు ఘొల్లుమంటున్నారు. వేలాది హెక్టార్లలో ఇంకా వర్షపు నీరు కనిపిస్తుండగా, అది బయటకు వెళ్లిన చోట పంటలు అత్యధికంగా దెబ్బతిన్న వైనం బయటపడుతోంది. ప్రత్యేకించి జిల్లాలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో అపారనష్టం కనిపిస్తోంది.


పెరుగుతున్న నష్టం అంచనా 

జిల్లాలో నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో ఈనెల 25 నుంచి 28 వరకూ కుంభవృష్టిగా కురిసిన వర్షాలతో లక్షా 50వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నష్టం అంతకన్నా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం రెండురోజులుగా వర్షాలు తెరిపి ఇచ్చి పొడి వాతావారణం నెలకొనగా వర్షపు నీటిలో మునిగిన పంటలను కాపాడు కొనేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇంకా చాలాప్రాంతాల్లో మి ర్చి, పొగాకు, పత్తి, వరి పంటలు వేలాది హెక్టార్లు నీటిలోనే కనిపిస్తు న్నాయి. మరోవైపు కాస్త మెరక ప్రాంతాల్లోని పంట భూముల్లో నుంచి నీరు  బయటకు వెళ్లినప్పటికీ వేలాది హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిపోయింది. పొగాకు, మిర్చి వంటి పంటలు అధిక ప్రాంతాల్లో పూర్తిగా ఉరకెత్తిపోగా మినుము కాయలు కుళ్లి మొలకెత్తాయి. ఇక వరి ఓదెలు నీటమునిగిన చోట అలాంటి పరిస్థితే కనిపిస్తుండగా కంది, ఇతరత్రా పంటలు కోలుకోనే పరిస్థి తి. కొన్నిచోట్ల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. 


నష్టం పరిశీలనలో యంత్రాంగం

భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న పంటలపై నిన్న మొన్నటి వరకు ప్రాథమిక అంచనాలు వేసిన అధికార యంత్రాంగం ప్రస్తుతం రైతువారీ నష్టాలపై సర్వే చేపట్టింది. తొలుత వ్యవసాయశాఖ పరిధిలో 98 వేల హెక్టార్లు, ఉద్యానశాఖ పరిధిలో మరో 12వేల హెక్టార్లు వెరసి లక్షా 10వేల హెక్టార్లలో దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రైతు వారీ, పంట వారీ నష్టాల అంచనాలపై సర్వే ప్రారంభించారు. ఈనెల 4 వరకు క్షేత్రస్థాయిలో గ్రామ వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంటలను పరిశీలించి సర్వేను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు ఆ వివరాలను 5న రైతుభరోసా కేంద్రాల్లో ప్రచురించి లోటుపాట్లపై 6న మండల స్థాయిలోని ఏవోలు వినతులు స్వీకరించి వాటిని పరిశీలిస్తారు. 7న సబ్‌డివిజన్‌ అధికారి కి నివేదిస్తారు. ఆ మరుసటిరోజు జేడీఏ కార్యాలయానికి సమగ్ర వివరాలు ఇవ్వాలి. ఆ మేరకు షెడ్యూల్‌ రూపొందించి సర్వే చేపట్టారు. ఒకవైపు సర్వే పరిశీలన, మరోవైపు ఉన్న పంటల రక్షణపై రైతులకు సూచనలు ఇచ్చేం దుకు జిల్లావ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యానశాఖలు, పొగాకు బోర్డు అధికారు లు, శాస్త్రవేత్తలు పర్యటిస్తున్నారు. జేడీఏ శ్రీరామమూర్తి, దర్శి పరిశోధన కేంద్రం శాస్త్ర వేత్త జీ.రమేష్‌ తదితరులు సోమవారం దర్శి, అద్దంకి సబ్‌ డివిజన్‌లో, పొగాకు బోర్డు ఎస్‌బీఎస్‌ ఆర్‌ఎం శ్రీనివాసులునాయుడు ఒంగోలు రూరల్‌ పరిధిలోని గ్రామాల్లో పర్యటించారు. 





Updated Date - 2020-12-01T06:18:37+05:30 IST