బాబోయ్‌ జ్వరాలు

ABN , First Publish Date - 2021-05-12T07:26:36+05:30 IST

జిల్లాను జ్వరాలు పీడిస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో ఎక్కడికక్కడ వందలాది మంది అనారోగ్యంతో విలవిల్లాడుతున్నారు. కొందరు సాధారణ జ్వరం అనే భావనతో సొంతంగా మందుబిళ్లలు వాడుతున్నారు.

బాబోయ్‌ జ్వరాలు
ఏలేశ్వరంలో ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

  • జిల్లాలో వందల్లో జ్వరపీడితులు
  • కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో పీహెచసీల వారీగా ఫీవర్‌ సర్వే
  • ఎక్కడికక్కడ పదుల సంఖ్యలో జ్వర బాధితుల గుర్తింపు
  • గుర్తిస్తున్న కేసుల్లో సగానికి పైగా కొవిడ్‌ బాధితులే
  • పాజిటివ్‌ ఉంటే ఆసుపత్రి లేదా ఐసోలేషన విధింపు
  • నేటి నుంచి జిల్లాలో మళ్లీ వ్యాక్సినేషన
  • కొత్తగా 15వేల కొవిషీల్డ్‌ డోసుల రాక
  • మండల కేంద్రాల్లో శాశ్వత టీకా కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్‌ ఆదేశాలు
  • ప్రత్తిపాడు మండల కేంద్రానికి బదులు ఒమ్మంగి ఎంపిక
  • ఎమ్మెల్యే బంధువుల తీరుపై కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డికి పలువురు సర్పంచల ఫిర్యాదు

జిల్లాను జ్వరాలు పీడిస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో ఎక్కడికక్కడ వందలాది మంది అనారోగ్యంతో విలవిల్లాడుతున్నారు. కొందరు సాధారణ జ్వరం అనే భావనతో సొంతంగా మందుబిళ్లలు వాడుతున్నారు.  వాస్తవానికి కొవిడ్‌ పరీక్షలు చేయించకోవాల్సి ఉండగా, అది ప్రహసనంగా మారడంతో మరికొందరు సొంతింటి వైద్యం చేసుకుంటున్నారు. అయితే జిల్లాలో వేలల్లో పాజిటివ్‌లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ నాలుగు రోజుల కిందట జిల్లాలో 95 పీహెచ్‌సీల్లో ఈ సర్వే నిర్వహించగా పదుల సంఖ్యలో జనం జ్వరాలతో ఈసురోమంటున్నట్టు గుర్తించారు. ఇలా ఒక్కో పీహెచ్‌సీలో 50 నుంచి 70 మంది వరకు జ్వరపీడితులున్నట్టు తేల్చారు. ఈ నేపథ్యంలో వారందరికీ ఇప్పుడు కొవిడ్‌ టెస్ట్‌లు నిర్వహించి పాజిటివ్‌ వస్తే వైరస్‌ తీవ్రత, లక్షణాల ఆధారంగా కొవిడ్‌ ఆసుపత్రికి లేదంటే హోం ఐసోలేషన్‌ విధిస్తున్నారు. 

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

వాస్తవానికి జిల్లావ్యాప్తంగా కొన్ని నెలలలుగా ఎక్కడికక్కడ ఎవరికివారు సొంతంగా కొవిడ్‌ లక్షణాలుంటే టెస్ట్‌లు చేయించుకుంటున్నారు. ఇందుకోసం ఆయా పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. కొంతమంది స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకుంటుంటే మరికొందరు అసలు కొవిడ్‌ టెస్ట్‌లకు ససేమిరా అంటున్నారు. జ్వరం ఉన్నా ఏం కాదులే అనే భావనతో బయట యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. ఇందులో అనేక మందికి కొవిడ్‌ ఉన్నా తెలియకుండానే ఇతరులకు వైరస్‌ వ్యాపించేస్తోంది. తద్వారా పాజిటివ్‌ల సంఖ్య ఎక్కువైపోతోంది. ఈ నేపథ్యంలో ఫీవర్‌ సర్వే నిర్వహించాలని నాలుగు రోజుల కిందట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా పీహెచ్‌సీ పరిధిలో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తిస్తున్నారు. థర్మల్‌ స్కానింగ్‌ చేసి జ్వరం అంచనా వేస్తున్నారు. జ్వరం ఉన్న వారికి కొవిడ్‌ టెస్ట్‌లు జరుపుతున్నారు. ఇప్పటివరకు దాదాపు అన్ని పీహెచ్‌సీల్లో సరాసరి 40మంది వరకు జ్వరంతో బాధపడుతున్నట్టు గుర్తించారు. మరికొన్ని పీహెచ్‌సీల్లో 80 నుంచి 100 వరకు బాధితులున్నట్టు తేల్చారు. శంఖవరం పీహెచ్‌సీలో 45 మందికి జ్వరాలుంటే అందులో ఎనిమిది మంది కొవిడ్‌ బాధితులున్నట్టు నిర్ధారించారు. శాంతి ఆశ్రమం పీహెచ్‌సీలో 25 మందికి జ్వరం తేలగా, ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఏలేశ్వరం పీహెచ్‌సీలో 65 మందికి జ్వరం నిర్ధారణ కాగా అందులో 26 మందికి కొవిడ్‌ ఉంది. గండేపల్లి పీహెచ్‌సీలో 25 మందికి జ్వరం రాగా 16 మందికి కొవిడ్‌ ఉంది. రావులపాలెం మండలం ఊబలంక పీహెచ్‌సీ పరిధిలో 26మందికి జ్వరాలుంటే పది మందికి కొవిడ్‌గా తేలింది. గోపాలపురం పీహెచ్‌సీలో ఒక్కరోజులో 35 మందికి జ్వరం ఉన్నట్టు గుర్తించగా 17 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇలా దాదాపు అన్ని మండలాల్లోని పీహెచ్‌సీల్లో కనీసం 8 నుంచి 17 మంది వరకు పాజిటివ్‌ల బారిన పడినట్టు గుర్తించారు. వీరందరినీ లక్షణాలను బట్టి కొందరిని ఇంట్లో ఉంచి మందుల కిట్‌ అందిస్తే మరికొందరిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలిస్తున్నారు. ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉన్న వారిని ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రులకు పంపుతున్నారు. అయితే కొవిడ్‌తో సిబ్బంది సమస్య వల్ల అనేక పీహెచ్‌సీల్లో ఇంకా సర్వే సగం కూడా పూర్తికాలేదు. అయితే ఇది పూర్తయ్యాక వందల్లో పాజిటివ్‌లు పెరిగే ప్రమాదం ఉంది. 

కాగా జిల్లాలో మంగళవారం 1,527 పాజిటివ్‌లు గుర్తించారు. అయితే బాధితులు రాన్రానూ పెరుగుతుండడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకలు అసలు దొరకడం లేదు. దీంతో అనేక మంది బెడ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. కొందరైతే ఆరోగ్యం తీవ్రంగా విషమించి అంబులెన్స్‌లో వస్తున్నా పడక ఇవ్వని పరిస్థితి జీజీహెచ్‌లో ఉంది. దీంతో కొందరు ఆ వాహనంలోనే కన్నుమూస్తున్నారు. ఇదిలా ఉంటే మండల కేంద్రాల్లో శాశ్వత టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ కలెక్టర్‌ ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. కానీ ప్రత్తిపాడు మండలంలో మాత్రం అధికార పార్టీ నేతలు అక్కడ ఉంచకుండా తమకు అనుకూలమైన ఒమ్మంగి ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయిస్తుండడం వివాదాస్పదమవుతోంది. దీనికి నిరసనగా ప్రత్తిపాడు, లంపకలోవ, పెదశంకర్లపూడి, ఉత్తరకంచి, రాయవరం, ఏలూరు సర్పంచ్‌లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే బంధువుల ఒత్తిడికి తలొంచి ప్రజలకు దూరంగా అధికారులు టీకా కేంద్రం ఏర్పాటు చేయడాన్ని మానుకోవాలని అందులో పేర్కొన్నారు. కాగా మూడు రోజుల విరామం తర్వాత జిల్లాలో మళ్లీ బుధవారం నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ మొదలుకానుంది. ఈ మేరకు ఎవరెవరికి టీకా ఇవ్వాలనే దానిపై కూపన్లు కూడా పంపిణీ చేశారు. మార్చి 10న ఫస్ట్‌ డోస్‌ తీసుకున్న వారికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాత రోజు మార్చి 11న తొలిసారి టీకా తీసుకున్న వారికి కూపన్లు కేటాయించనున్నారు. కాగా జిల్లాకు మంగళవారం 15వేల కొవిషీల్డ్‌ టీకాలు వచ్చాయి. సెకండ్‌ డోస్‌ పూర్తిగా అందరికీ అందిన తర్వాతే 45ఏళ్లు దాటిన వారికి కొత్తగా టీకా పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

Updated Date - 2021-05-12T07:26:36+05:30 IST