కుండపోత

ABN , First Publish Date - 2021-06-24T05:03:26+05:30 IST

నగరంలో బుధవారం కుండపోతగా వర్షం కురిసింది.

కుండపోత

నగరంలో పలు ప్రాంతాలు జలమయం

చినవాల్తేరులో 9.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

రూరల్‌లోనూ భారీవర్షం

వరి ఆకుమడులకు రైతుల సన్నద్ధం


విశాఖపట్నం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): నగరంలో బుధవారం కుండపోతగా వర్షం కురిసింది. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో ప్రారంభమైన వర్షం క్రమేపీ జోరందుకున్నది. సుమారు గంట నుంచి రెండు గంటలపాటు కురిసింది.  కూలీలు, చిరు వ్యాపారులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తడిసి ముద్దయ్యారు. భారీవర్షానికి మురుగు కాల్వలు పొంగి రోడ్లపైకి నీరు చేరడంతో వాహనచోదకులు ఇబ్బందిపడ్డారు. రైల్వే న్యూకాలనీ, జ్ఞానాపురం, పూర్ణామార్కెట్‌ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. చావులమదుము వంతెన కింద నడుములోతు వరకు నీరు చేరడంతో కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బస్సుల్లోకి కూడా నీరు చేరింది. కాగా కలెక్టరేట్‌లో వున్న జిల్లా ఖజానా కార్యాలయంలోని అన్ని గదుల్లో వర్షం కురిసింది. అప్రమత్తమైన సిబ్బంది కంప్యూటర్లను టార్పాలిన్‌ కవర్లతో కప్పేశారు. బుధవారం కురిసిన వర్షానికి తడిసిన పై కప్పు ఏక్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం వుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

గ్రామీణంలో భారీ వర్షం

గ్రామీణ ప్రాంతంలోని పలు మండలాల్లో భారీవర్షం కురిసింది. అనకాపల్లి, రోలుగుంట, గొలుగొండ, మాకవరపాలెం, బుచ్చెయ్యపేట, రావికమతం, ఎలమంచిలి, రాంబిల్లి, మునగపాక, పాయకరావుపేట, కోటవురట్ల తదితర మండలాల్లో అధిక వర్షం కురిసింది. ఏజెన్సీలోని ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు ప్రాంతాల్లో భారీగా, మిగిలిన మండలాల్లో ఒక మోస్తరుగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోని పొలాల్లో నీరు చేరింది. రానున్న రెండు, మూడు రోజుల్లో కూడా ఇదేమాదిరిగా వర్షం కురిస్తే వరి ఆకుమడులు పోయడానికి వీలవుతుందని రైతులు చెబుతున్నారు. అధిక వర్షం కురిసిన ప్రాంతాల్లో దుక్కులు దున్నడానికి, పచ్చిరొట్ట విత్తనాలు చల్లడానికి రైతులు సన్నద్ధం అవుతున్నారు. కాగా ఈ వర్షం నువ్వు, కార్సీ చెరకు, కూరగాయలు, చిరుధాన్యాల పంటలకు ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. వాతావరణం చల్లబడడంతో వారం రోజుల నుంచి ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం ఊరట చెందారు.


వర్షపాతం వివరాలు

కేంద్రం వర్షపాతం (మి.మీలు)

చినవాల్తేరు      92.1

జాలరిపేట                  87.0

ఎంవీపీ సర్కిల్‌ 85.75

హెచ్‌బీ కాలనీ పాఠశాల 71.75



Updated Date - 2021-06-24T05:03:26+05:30 IST