వరుణుడొచ్చాడు..

ABN , First Publish Date - 2020-06-05T11:26:24+05:30 IST

నిన్నటి వరకూ ఒక్కటే ఎండ. భానుడు 40 డిగ్రీలు దిగిరాలేదు. ఎంత కాలమో ఇలా..? అనుకుంటూ ఆపసోపాలు పడుతుంటే. వరుణుడు ..

వరుణుడొచ్చాడు..

 7.6 మి.మీ వర్షపాతం నమోదు 

12 మండలాల్లో పడని వాన

చల్లబడిన వాతావరణం 


నిన్నటి వరకూ ఒక్కటే ఎండ. భానుడు 40 డిగ్రీలు దిగిరాలేదు. ఎంత కాలమో ఇలా..? అనుకుంటూ ఆపసోపాలు పడుతుంటే. వరుణుడు    నేనున్నానంటూ వచ్చాడు.. గత రెండు రోజులుగా ఒక మోస్తరు చినుకులతో రానా వద్దా అంటూ తటాపటాయించిన వరుణుడు.. గురువారం తెల్లవారుజాము నుంచి కాస్త ఉత్సాహం చూపాడు.. ఆగుతూ.. పడుతూ మధ్యాహ్నం వరకూ లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాడు.. చినుకుల పలకరింపుతో జనం ఆనందం వ్యక్తం చేశారు. 


 నైరుతి రుతుపవనాల రాకతో  భారీ వర్షం కురిసింది. వాతావరణం చల్లబ డింది. వేసవి కావడంతో నిన్నటి వరకూ ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు జోరువానతో సేద తీరారు. మూడు రోజులుగా కొంచెం కొంచెంగా ఊరిస్తున్న వరుణుడు గురువారం కరుణించాడు. తెల్లవారు జాము నుంచి చినుకులు పడుతూనే ఉన్నాయి.  ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య భారీ వర్షం కురవడంతో ప్రజలు వేసవి తాపం నుంచి సేదతీరారు. వేసవి ముగు స్తుం డగా కురిసిన ఈ వర్షంతో చల్లదనాన్ని ప్రజలు ఆస్వాదించారు. నెల రోజులుగా వేసవి తాపంతో సతమతమైన ప్రజానీకం వర్షంతో సేద తీరారు.ఈ వర్షం

పంటలకు ఎంతో ఉపయోగమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


రహదారులపై నిలిచిన నీరు..

రహదారులు చిత్తడిగా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ య్యాయి. రహదారులపై గోతలన్నీ వాననీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేకుండా వాన పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం రోడ్లపక్కన వ్యాపారాలు చేసుకునేవారు ఇబ్బందులు పడ్డారు. భీమవరం నాచువారి సెంటర్‌ ప్రాంతంలో రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు ఇక్కట్లకు గురయ్యారు. విస్సాకోడేరు వంతెన సమీపంలో రోడ్డు పక్కన వర్షపునీరు నిలిచి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు.


సాగుకు సమాయత్తం..

రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు.కాస్త ముందస్తుగా వాతావరణంలో మార్పు రావడంతో పంట సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. రోహిణి కార్తెలోనే విత్తనాలు వేస్తే పంట దిగుబడి అధికంగా ఉంటుందని రైతుల నమ్మకం. దాంతో రైతులు సాగు పనులకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే దుక్కి దున్ని సిద్దం చేసుకున్న పొలాల్లో విత్తనాలు వేసేందుకు సిద్ధమవు తున్నారు. కాల్వలకు శుక్రవారం నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో ముందస్తు సాగుపై దృష్టి పెడుతున్నారు.


కురిసిందిలా...

ఏలూరు సిటీ : జిల్లాలో గడచిన 24 గంటల్లో సరాసరి  7.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు అయిందని  జిల్లా ప్రణాళికా శాఖ తెలియజేసింది. జిల్లాలో అత్యధికంగా నరసాపురంలో బుధవారం 40.4 మిల్లీమీటర్లు, ఉంగుటూరు 31.8, కొవ్వూరు 25.8, తణుకు 23.4, పెంటపాడు 22.6 , తాడేపల్లిగూడెంలో 19.8, ఆచంట 18.6, చాగల్లు 17.4 , ఉండ్రాజవరం 15.4 , పెరవలి 14.8, యలమంచిలి 14.6 , పాలకొల్లు 14.2 , అత్తిలి 13.2, పాలకోడేరు 10.4, నల్లజర్ల  7, పెనుమంట్ర, ఇరగవరం 6.4, మొగల్తూరు 6.2 , జీలుగుమిల్లి  5.8 , తాళ్ళపూడి, పోడూరు 5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. 15 మండలాల్లో ఐదు మిల్లీమీటర్లు కన్నా తక్కువగానే వర్షపాతం నమోదు కాగా 12 మండలాల్లో అసలు వర్షపాతం నమోదు కాలేదు. 

Updated Date - 2020-06-05T11:26:24+05:30 IST