వదలని వరద!

ABN , First Publish Date - 2020-10-18T09:16:51+05:30 IST

రాజధాని నగరంలోని పలు కాలనీలు, బస్తీలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. వాన తగ్గి ఐదు రోజులైనా నీరు అలానే ఉంది.

వదలని వరద!

నీటిలోనే కాలనీలు, బస్తీలు.. వరద వెళ్లే దారి లేక అక్కడే

బంధువుల ఇళ్లలో బాధితులు

అద్దె ఇళ్లు ఖాళీ చేస్తున్న వైనం

మినరల్‌ వాటర్‌తో కాలకృత్యాలు

సెల్లార్‌లలో నీరు తోడేందుకు

డీజిల్‌ మోటార్ల అద్దె రూ.25 వేలు

భారీగా కరెంటు మోటార్ల కొనుగోలు 

కరోనా భయంతో వణుకు

దుర్గంధం వెదజల్లుతున్న సెల్లార్లు

పొంచి ఉన్న రోగాల ముప్పు


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు17 (ఆంధ్రజ్యోతి): రాజధాని నగరంలోని పలు కాలనీలు, బస్తీలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. వాన తగ్గి ఐదు రోజులైనా నీరు అలానే ఉంది. దీంతో ఇల్లు వదిలి పునరావాస కేంద్రాల్లో, బంధుమిత్రుల ఇళ్లలో బాధితులు తల దాచుకున్నారు. వరద నీటితో ఇళ్లలోని వస్తువులు పాడయ్యాయేమో అన్న ఆందోళన ఓ వైపు... పునరావాస కేంద్రాల్లో కరోనా సోకుతుందేమో అన్న భయం మరో వైపు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మంగళవారం రికార్డు స్థాయిలో కురిసిన వాన పలు ప్రాంతాల్లో నగరవాసులకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన కొందరు విగత జీవులుగా మారగా.. చెరువుల్లా మారిన నివాసాలతో పలు కాలనీలు, బస్తీల్లో ప్రజలు కట్టుబట్టలతో బయటకు వచ్చారు.



సకాలంలో సహాయక చర్యలు అందించడంతోజీహెచ్‌ఎంసీ విఫలమైందని, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి భారీ వర్షానికి నగరంలో 1500లకు పైగా కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. మెజార్టీ ప్రాంతాల్లో రెండు, మూడు రోజుల్లో వరద నీరు బయటకు వెళ్లగా.. ఇప్పటికీ ముంపులోనే కొన్ని ఏరియాలున్నాయి. పల్లంలో ఉన్న ఇళ్ల నుంచి నీరు బయటకు వెళ్లడం లేదు. జీడిమెట్ల ఉమామహేశ్వర కాలనీ ఫాక్స్‌ సాగర్‌ ఎఫీటీఎల్‌లో ఉంది.


చెరువు నిండటంతో ఇప్పట్లో వరద నీరు వెళ్లే పరిస్థితి లేదు. కాలువ తీసి వర్షపు నీటిని బయటకు పంపిస్తున్నారు. నాలుగు రోజులైతే కానీ ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం లేదు. గడ్డిఅన్నారంలోని సీసాల బస్తీలోనూ అదే పరిస్థితి. డ్రైన్‌లలో వ్యర్ధాలు పేరుకు పోవడంతో నీరు బయటకు వెళ్లడం లేదు. నదీం కాలనీలో చెరువు అవుట్‌లెట్‌ పెద్దగా లేకపోవడం, ఎగువ నుంచి ప్రవాహం వస్తుండడంతో వరద నీరు తగ్గడం లేదు. 300 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.  


సెల్లార్లతో కన్నీళ్లు 

నల్లకుంట డివిజన్‌లో ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌ పూర్తిగా నిండిపోయింది. వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. విద్యుత్‌ సరఫరా లేక ఫోన్లు పని చేయలేదు. నిచ్చెన, చీరెలను వేసుకొని రోడ్డు మీదకు వస్తున్నారు. బంధువుల ఇళ్లకు వెళుతున్నారు. ఆ అవకాశం లేనివాళ్లు ఫ్లాట్‌కే పరిమితం అయ్యారు. సెల్లార్‌లో నీళ్లు ఉండడంతో కరెంటు పునరుద్ధరించలేదు. సెల్లార్‌లో నీటి బయటకు తీద్ధామంటే డీజిల్‌ ఇంజన్‌ మోటర్లు దొరకడంలేదు. విద్యుత్‌ మోటార్‌ను కొనుగోలు చేసి పక్క వీధిలో నుంచి విద్యుత్‌ను తీసుకొచ్చి రెండు రోజుల పాటు నీటిని తోడారు. మళ్ళీ నీళ్లు ఊరుతున్నాయి.


రాజధాని నగరంలో వందల అపార్ట్‌మెంట్ల పరిస్థితి ఇదే. పాలు, నీళ్లు అన్నీ బంద్‌ అయ్యాయి. మోహం కడుకుందామనుకున్నా, చివరకు కాలకృత్యాలు తీర్చుకుందామనుకున్న కానీ నీళ్లు లేవు. నీటి సంపులన్నీ దుర్గంధంగా మారాయి. సెల్లార్లలోని నీటిని తోడేందుకు 24 గంటల పాటు డీజిల్‌ ఇంజన్లను నడుపుతున్నారు. ఒక్కో అపార్ట్‌మెంట్‌కు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. అవి కూడా దొరక్కపోవడంతో విద్యుత్‌ మోటర్లను రూ.10 వేల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. సెల్లార్‌లోకి చేరిన నీళ్లను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగిస్తారని ఎదురుచూసిన అపార్ట్‌మెంట్‌వాసులకు నిరాశ ఎదురవుతోంది. గ్రేటర్‌ మాన్‌సూన్‌ బృందాల దగ్గర, డీఆర్‌ఎఫ్‌ బృందాల వద్ద పెద్దఎత్తున డీజిల్‌ ఇంజన్లు ఉన్నాయి. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు మాత్రమే ఈ డీజిల్‌ ఇంజన్లను వాడుతున్నారు. 


దుర్గంధం వెదజల్లుతున్న సెల్లార్‌లు

మణికొండ పుప్పాలగూడ గోల్డెన్‌ టెంపుల్‌ ప్రాంతంలో పందెన్‌వాగు పక్కనున్న పలు అపార్ట్‌మెంట్లలో నాలుగు రోజులుగా కరెంటు లేదు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా మినరల్‌ వాటర్‌ను వినియోగించాల్సివస్తోంది. ఫ్రీజర్‌లలో ఉంచిన కూరగాయలు, ఆహారపదార్దాలు, చెడిపోయాయి. అద్దె ఇళ్లలో ఉండేవాళ్లు ఖాళీచేసి వెళ్లిపోతున్నారు. సెల్లార్‌లో చేరిన బురద దుర్వాసన వెదజల్లుతుండటంతో అనారోగ్య సమస్యలు వస్తాయని బెంబేలెత్తిపోతున్నారు. నీటిలో మునిగిన విద్యుత్‌ మీటర్లను డ్రయ్యర్లతో ఆరబెట్టిన తర్వాతే కరెంట్‌ సరఫరా పునరుద్దరించగలమని విద్యుత్‌ అధికారులు తేల్చిచెప్పారు. 


వరద తగ్గి... బురదమయం


వరద తగ్గిన ప్రాంతాలు బురదమయంగా మారాయి. మురుగు నీరు ఏరులై పారుతోంది. దుర్గంధ పరిస్థితులు నెలకొన్నాయి. సికింద్రాబాద్‌ అడ్డగుట్టలోని మరాఠా బస్తీ, వడ్డెర బస్తీల్లో రోడ్లపై బురద పేరుకుపోయింది. కూకట్‌పల్లి ఏవీబీ పురంలో రహదారులు బురదతో నిండిపోయాయి. ఎల్‌బీనగర్‌లోని బాతుల చెరువు, మైసమ్మ కాలనీ, బంజారా కాలనీ, కుమ్మరికుంట, పద్మావతి కాలనీ, రాఘవేంద్ర కాలనీలు బురదమయంగా మారాయి. ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వ్యర్ధాల తొలగింపు ప్రారంభం కాలేదు. దీంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదముంది.


మళ్లీ ‘జడి’పించింది

హైదరాబాద్‌, శివార్లలో 

శనివారం వర్ష బీభత్సం

ఘట్‌కేసర్‌లో 15.7 సెం.మీ; 

షేక్‌పేటలో 13.5 సెం.మీ.

రహదారులపై పోటెత్తిన వరద నీరు

బాలాపూర్‌ చెరువు కట్ట 

తెగడంతో ముంపు ముప్పు

మళ్లీ ‘జడి’పించింది

హైదరాబాద్‌, శివార్లలో వర్ష బీభత్సం


హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ఇటీవలి కుంభవృష్టి విలయం నుంచి తేరుకోకముందే.. వరద సమస్య నుంచి కోలుకోకముందే హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో సాయంత్రం 5 గంటల నుంచి పలుచోట్ల వాన దంచికొట్టింది. రాత్రి వరకు కురుస్తూనే ఉంది. ప్రధాన రహదారులపైకి వరద పోటెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే ఇళ్లముందు మురు గు నిలిచి ఉండగా.. విద్యుత్‌ సరఫరా కూడా లేని నేపథ్యంలో హైదరాబాద్‌ వాసులు బెంబేలెత్తిపోయారు. శివారు కాలనీలు మళ్లీ నీట మునిగాయి. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పిడుగులు పడ్డాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. శివార్లలో నిండుకుండల్లా ఉన్న చెరువులు తాజా వర్షాలకు తెగేలా ఉన్నాయి.


ఆసరాగా విద్యుత్‌ స్తంభాన్ని పట్టుకుంటే..

ఓల్డ్‌ మలక్‌పేటలో రోడ్డుపై వెళ్తూ ఆసరా కోసం విద్యుత్‌ స్తంభాన్ని పట్టుకున్న రాములు(40) షాక్‌తో అక్కడికక్కడే చనిపోయాడు. ఇతడిది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా. దిల్‌సుఖ్‌నగర్‌-చైతన్యపురి జాతీయ రహదారిపై భారీగా వరద నీరు నిలిచింది.  

బార్కస్‌ బాలాపూర్‌ చెరువు కట్ట తెగింది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో 15.7 సెం.మీ. వర్షం కురిసింది. ఉప్పల్‌ మండలం బండ్లగూడలో 15.3 సెం.మీ, రంగారెడ్డి జిల్లా గండిపేటలో 13.9 సెం.మీ, హైదరాబాద్‌ షేక్‌పేటలో 13.5 సెం.మీ వర్షం కురిసింది.

బెంగుళూరు, విజయవాడ జాతీయ రహదారులపైకి భారీగా నీరు చేరింది. బాటసింగారం వద్ద బ్రిడ్జిపై వాహనం ఇరుక్కుపోయింది. ఇందులో నలుగురు ఉన్నట్లు సమాచారం. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Updated Date - 2020-10-18T09:16:51+05:30 IST