భారీ వర్షం

ABN , First Publish Date - 2021-06-04T05:17:02+05:30 IST

ఏజెన్సీ, మెట్టప్రాంతంతో పాటు కొవ్వూరు, చాగల్లు మండలాల్లో గురువారం బారీ వర్షం కురిసింది.

భారీ వర్షం
జంగారెడ్డిగూడెం పట్టణంలో రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపు నీరు

రహదారులు జలమయం

విరిగిపడిన చెట్లు


ఏజెన్సీ, మెట్టప్రాంతంతో పాటు కొవ్వూరు, చాగల్లు మండలాల్లో గురువారం బారీ వర్షం కురిసింది. వర్షానికి గాలి తోడవడంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఏజెన్సీ గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి గ్రామాల్లో అంధకారం అలుముకుంది.


(జంగారెడ్డిగూడెం / బుట్టాయగూడెం / పోలవరం / కొవ్వూరు )

జంగారెడ్డిగూడెం పట్టణంలో భారీ వర్షం పడింది. గురువారం ఉదయం 11 గంటల తర్వాత వాతావరణం చల్లబడింది. పెద్ద ఎత్తున గాలితో కూడిన భారీ వర్షం పడింది. పట్టణ ప్రధాన రహదారులపై వర్షపు నీరు వరదలా పారింది. డ్రెయినేజీలు పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అశ్వారావుపేట రోడ్డు కాలువను తలపించింది. ఇక బుట్టాయిగూడెం రోడ్డు, ఏలూరు రోడ్డు, కొత్తబస్టాండ్‌, పాతబస్టాండ్‌ తదితర ప్రాంతాలన్నీ వర్షపు నీరుతో నిండిపోయాయి.


బుట్టాయగూడెంతోపాటు ఏజెన్సీలో అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు అక్కడ క్కడ వర్షం పడుతోంది. గురువారం సుమారు రెండు గంటలపాటు కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. రోడ్లన్ని బురదమయం కావడంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం రాత్రి వర్షానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి కేఆర్‌.పురం, తదితర ప్రాంతాల వారు రాత్రంతా చీకటిలో ఉన్నారు.


పోలవరం మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పోలవరం మెయిన్‌ బజారులో నీరు నిలిచిపోవడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి రోడ్లు బురదమయమై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పట్టిసీమ, బంగార మ్మపేట, వెంకటాపురం గ్రామాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పంట తడిచి పోయింది. వాడపల్లి, కొండ్రూకోట గ్రామాల మధ్య  రహదారిపై భారీ వృక్షం కూలిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.


కొవ్వూరు పట్టణం 2వ వార్డు శ్రీరామకాలనీలో గాలి దుమారానికి చెట్టు నేలకొరిగింది. విద్యుత్‌ తీగలపై పడడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఎండలతో అల్లడిల్లిన జనం వర్షం కురియడంతో సేదతీరారు.


చాగల్లు మండలంలో గురువారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమైంది. 11.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్‌ ఎం శ్రీనివాసరావు తెలిపారు. వర్షాలతో మామిడి తోటల రైతులకు నష్టమని అం టున్నారు. రైస్‌ మిల్లర్లు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో పొలంలోనే ఉండిపోయిందని రైతులు వాపోతున్నారు.

Updated Date - 2021-06-04T05:17:02+05:30 IST