కడలి కల్లోలం

ABN , First Publish Date - 2020-10-13T08:10:56+05:30 IST

బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. సోమవారం విశాఖకు ఆగ్నేయంగా..

కడలి కల్లోలం

మరింత తీవ్రంగా వాయుగుండం

15న మరో అల్పపీడనం 

సంద్రంలో భారీగా ఎగసిపడుతున్న అలలు

తీరంలో 60 కిలోమీటర్ల వేగంతో గాలులు

‘తూర్పు’లో నీట మునిగిన మత్స్యకారుల ఇళ్లు

బిక్కవోలు, పెద్దాపురంలలో కూలిన పాత ఇళ్లు

పూరిళ్లు, విద్యుత్‌, కమ్యూనికేషన్‌లకు ముప్పు

పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక

నేడు కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. సోమవారం విశాఖకు ఆగ్నేయంగా 220 కి.మీ., కాకినాడకు ఈశాన్యంగా 270, నరసాపురానికి ఈశాన్యంగా 310 కి.మీ. దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. పశ్చిమ వాయువ్యంగా పయనించి మంగళవారం ఉదయం విశాఖపట్నం-నరసాపురం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఆ ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగసిపడుతున్నాయి. తీరం వెంబడి గంటకు 50-60, అప్పుడప్పుడు 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి.


తీరం దాటే సమయంలో 65-75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం పేర్కొంది. కళింగపట్నం నుంచి కృష్ణపట్నం వరకు అన్ని ఓడరేవుల్లో మూడవ నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. బలమైన గాలులు వీస్తున్నందున ఉత్తరాంధ్రలో పూరిళ్లు, విద్యుత్‌, కమ్యూనికేషన్స్‌ వ్యవస్థకు నష్టం వాటిల్లనుందని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. 


ముంచెత్తిన వర్షాలు

ఆదివారం సాయంత్రం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు భీమిలిలో 170, విశాఖపట్నం 150, పెద్దాపురం, కాకినాడల్లో 140, యానాం 110, అమలాపురం, అనకాపల్లిల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం ఉత్తరాంధ్రతోపాటు ఉభయగోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లోను భారీ వర్షం కురిసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.విశాఖపట్నంలోని నాతయ్యపాలెంలో రెండు చెరువులకు గండ్లు పడ్డాయి.  పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో వాగులు పొంగుతున్నాయి.


నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని చిన్నలంక, పీఎం లంక, పేరుపాలెం ప్రాంతాల్లో సముద్ర నీరు ముందుకు చొచ్చుకొస్తోంది. తూర్పుగోదావరిలోనూ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత మండలాలు, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని లంక గ్రామాల్లో  సహాయక చర్యలు చేపడుతోంది. కాకినాడ రూరల్‌ మండలంలో నీట మునిగిన పంటలను సోమవారం వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు పరిశీలించారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లా అధికారులు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1804253077 కేటాయించారు.    


శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు..

మంగళవారం శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు, అలాగే కర్నూలు జిల్లాలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. ఇతర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు హెచ్చరించారు. మరో రెండు రోజులు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదన్నారు. బుధ, గురువారాల్లోను కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. కాగా. అరేబియా సముద్రంలో ఈనెల 15న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. 

సిక్కోలుకు కరువుతీరా వర్షాలు..

తీవ్ర వాయుగుండం ప్రభావంతో సిక్కోలులో కురువు తీరా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని 18 చోట్ల 64-115 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువులు, వాగులు, వంకలు నీటితో కళకళలాడాయి. గడిచిన మూడు నెలల్లో జిల్లా సాధారణ వర్షపాతం 2679.4 మి.మీ. కాగా, తాజా వర్షాలతో 2688.7 మిల్లీమీటర్లు నమోదైంది. గొట్టా బ్యారేజీ వద్ద 9 గేట్లు ఎత్తి 6,400 క్యూసెక్కుల నీటిని వదిలారు. 


రైతుకు ‘ఖరీఫ్‌’ కుదుపు

(అమరావతి-ఆంధ్రజ్యోతి):ఖరీఫ్‌ రైతులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. అధిక వర్షాలు భారీ నష్టం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట వర్షార్పణం అవుతోంది. ఆగస్టు, సెప్టెంబరులో భారీ వర్షాలు, వరదలతో మూడు లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. మూడురోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉభయగోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో అధిక వర్షాలు పైర్లను ముంచెత్తి, పాడు చేస్తున్నాయి. వరికోతలకు ఆటంకం ఏర్పడింది. పైరు నేలకొరిగి, గింజ పాడవుతోంది. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పత్తి పూతరాలిపోయి, కాయ బూజు పడుతోంది. రాయలసీమలో వేరుశనగకు వేరుకుళ్లు సమస్య ఏర్పడుతోంది. తీర గ్రామాల్లోని చేపల చెరువుల్లో చేపలు, రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. 


పోలీసుశాఖ బీ అలర్ట్‌: డీజీపీ 

‘తీవ్ర వాయుగుండం నేపథ్యంలో 24 గంటల పాటు ఎస్‌హెచ్‌వో నుంచి ఎస్పీ వరకూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2020-10-13T08:10:56+05:30 IST