మన్యంలో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-04-09T06:19:15+05:30 IST

ఏజెన్సీలో గురువారం మధ్యాహ్నం ఊహించని విధంగా భారీ వర్షం కురిసింది.

మన్యంలో భారీ వర్షం
జీకేవీధిలో కురుస్తున్న వర్షం

పాడేరు, ఏప్రిల్‌ 8: ఏజెన్సీలో గురువారం మధ్యాహ్నం ఊహించని విధంగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తీవ్రంగా ఎండ కాసింది. ఆతర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ స్థాయిలో వర్షం కురిసింది. అలాగే పలుచోట్ల వడగళ్లు సైతం పడ్డాయి. గత వారం రోజులుగా ఏజెన్సీలో విభిన్నమైన వాతావరణం నెలకొంటున్నది. ఉదయం వేళల్లో మంచు కురవడం, మధ్యాహ్నం ఎండ కాయడం, ఆ తర్వాత వర్షం కురవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. గురువారం పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ మండలాల్లో భారీగా వర్షం గంటన్నర సేపు కురవగా ఆ తర్వాత సాధారణ వాతావరణం నెలకొని సాయంత్రం నాలుగున్నర తర్వాత ఎండ కాసింది.

చింతపల్లి మండలంలో పలు గ్రామాల్లో కుండపోత వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఎడతెరిపివ్వకుండా  వర్షం పడింది. అయితే వర్షం ప్రారంభమయ్యే సమయానికి ఓటింగ్‌ పూర్తికావడంతో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. బ్యాలెట్‌ బాక్స్‌లు రిసీవింగ్‌ కేంద్రంలో టెంట్లు పూర్తిగా తడిసిపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. వర్షం కారణంగా ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు వర్షపు నీరుతో నిండుకున్నాయి. 

గూడెంకొత్తవీధి మండలంలో భారీ వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే పోలింగ్‌ ముగిసిన తరువాత వర్షం రావడంతో ఎన్నికలకు ఎటువంటి అంతరాయం కలగలేదు.

అరకులోయలో గురువారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత భారీ వర్షం కురిసింది. అంతవరకు ఎండ మండింది.  పట్టణంలో జరిగిన పోలింగ్‌ కేంద్రం ఆవరణలో ఎండ తీవ్రతకు ఓ మహిళా ఓటరు సొమ్మసిల్లి పడిపోయింది. వైద్య సిబ్బంది సేవలందించడంతో ఆమె కోలుకుం. పోలింగ్‌ ముగిసిన కొద్దిసేపటికే భారీ వర్షం పడింది. దీంతో వాతావరణం చల్లబడింది. 

Updated Date - 2021-04-09T06:19:15+05:30 IST