IMD warning: దేశంలో మరో 7 రోజులపాటు భారీవర్షాలు

ABN , First Publish Date - 2021-07-17T13:24:14+05:30 IST

నైరుతి రుతుపవనాల పునరుజ్జీవనం తర్వాత రాబోయే ఏడు రోజుల పాటు దేశంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని....

IMD warning: దేశంలో మరో 7 రోజులపాటు భారీవర్షాలు

న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాల పునరుజ్జీవనం తర్వాత రాబోయే ఏడు రోజుల పాటు దేశంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది.ఉత్తర భారత దేశంతోపాటు పలు ప్రాంతాల్లో మరో ఏడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఉత్తరప్రదేశ్ లలో శనివారం నుంచి ఈ నెల 20వతేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ తెలిపింది. జులై 18 నుంచి 20వతేదీ వరకు పంజాబ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. జులై 18న ఢిల్లీలోనూ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. 


జులై 18న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, జులై 19న జమ్మూలో, జులై 18,19 తేదీల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయి. వచ్చే 24 గంటల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, దక్షిణ రాజస్థాన్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని, దీనివల్ల ప్రజలు, జంతువులకు ప్రాణనష్టం జరిగే అవకాశముందని ఐఎండీ తెలిపింది. రాబోయే ఏడు రోజుల పాటు పశ్చిమ తీరం, పశ్చిమ ద్వీపకల్పంతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.


కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలలో ఇదే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.ఈశాన్య భారతదేశం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో జులై 19 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. 


Updated Date - 2021-07-17T13:24:14+05:30 IST