జోరు వాన

ABN , First Publish Date - 2021-07-23T08:20:36+05:30 IST

జోరు వాన

జోరు వాన

బంగాళాఖాతంలో అల్పపీడనం

గోదావరి, కృష్ణా, గుంటూరుల్లో భారీ వాన

మిగిలిన జిల్లాల్లో మోస్తరు జల్లులు

పొంగుతున్న వాగులు, వంకలు

నేడు కోస్తాలో అతిభారీ వర్షాలు

వేటకెళ్లొద్దని జాలర్లకు హెచ్చరిక

ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు: సీఎం


రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు కురవడంతో నగరాలు, గ్రామాలు జలమయమవుతున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. కాల్వలు పూర్తి సామర్థ్యంతో ప్రవహిస్తున్నాయి. అసలే అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు మరింత అధ్వానంగా మారాయి. ఈదురు గాలులకు కొన్ని చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.



(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కృష్ణా జిల్లా నూజివీడులో 75, విసన్నపేటలో 64, గన్నవరంలో 48 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తా తీర ప్రాంతంలో గంటకు 20-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసరాలపై గురువారం అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా ఒంగి ఉంది. వీటి ప్రభావంతో శుక్రవారం విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీగా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్రం అలజడిగా మారి, తీరం వెంబడి గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్‌ కన్నబాబు హెచ్చరించారు. జాలర్లు రెండ్రోజులపాటు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. ఎడతెరపి లేని వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదుల్లో వరద నీరు ప్రవహిస్తోంది. కోస్తా జిల్లాల్లో ముసురు పట్టినట్లు నానుడు వాన పడుతుండటంతో వాగులు, వంకలు, కాల్వలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో వాగుల పక్కన పల్లపు భూముల్లోని ఖరీఫ్‌ పంటలు నీట మునిగాయి. మొలక దశలో ఉన్న పత్తి, అపరాల పైర్లు ముంపుబారిన పడుతున్నాయి. ఈ వర్షాలు అప్పుడే నాటిన విత్తనాలు, మొక్కలకు ఇబ్బంది కలిగించినా, కాస్త పెరిగిన మొక్కలకు జీవం పోస్తాయని రైతులు చెప్తున్నారు. 




గోదావరిలో పెరుగుతున్న వరద

పశ్చిమ గోదావరి జిల్లాలో కుంభవృష్టి కురవడంతో 6,986 హెక్టార్లలో వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. 100 విద్యుత్‌ పీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయాలు ఏర్పడ్డాయి. జంగారెడ్డిగూడెం పట్టెన్నపాలెం వద్ద జల్లేరువాగు పొంగటంతో రాకపోకలు స్తంభించాయి. జీలుమిల్లి మండలం కామయ్యపాలెం వద్ద రహదారికి అడ్డంగా చెట్టు విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కుక్కునూరు వద్ద గుండేటి వాగు పోటెత్తింది. కొంగువారిగూడెం వద్ద ఎర్రకాలువ జలాశయంలోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరుతోంది. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి నదికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. పోలవరం స్పిల్‌ వే నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే 1,08,606 క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే నుంచి విడుదల చేయగా, ధవళేశ్వరం వద్ద 175 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు దిగువ, ఎగువన నీటిమట్టం పెరుగుతోంది. పలు గ్రామాల ప్రజలు తమ సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మిగిలినవారు ఎతైన ప్రదేశాల్లో గుడిసెలు వేసుకుని తరలిపోయేందుకు సిద్ధమవుతున్నారు. 


కలెక్టర్లు అప్రమత్తంగా ఉండండి: సీఎం

భారీ వర్షాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సీఎం జగన్‌ ఆదేశించారు. తాడేపల్లి నుంచి వర్చువల్‌గా కలెక్టర్లతో సీఎం మాట్లాడారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లోనూ, వర్షాలకు గోడలు నానిపోయి ఇళ్లు కూలిపోయే ప్రమాదంపైనా అప్రమత్తంగా ఉంటూ, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని, ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా, వర్షాలకు పంట నష్టం జరిగితే పూర్తిగా ఎన్యుమరేషన్‌ చేస్తామని వ్యవసాయ మంత్రి కన్నబాబు తెలిపారు. రైతులకు నష్టం జరిగితే తక్షణమే స్పందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 55 మండలాల్లో పొలాలు ముంపునకు గురయ్యాయన్నారు. 


ప్రకాశం బ్యారేజీకి 11,449 క్యూసెక్కులు  

కృష్ణాజిల్లా గుడివాడ, తోట్లవల్లూరు, పామర్రు ప్రాంతాల్లో వరినాట్లు నీట మునిగాయి. మున్నేరు, కీసర వాగుల్లో నీటి ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. అధికారులు ముందస్తుగా లింగాల - చిట్యాల, ముచ్చింతల - పెనుగంచిప్రోలు మధ్య ఉన్న కాజ్‌వేలను మూసివేశారు. మున్నేరు వాగులోకి పోలంపల్లి ప్రాజెక్టు నుంచి 25వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రవాహం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. పులిచింతలతోపాటు వాగుల నుంచి నీరు వస్తుండటంతో కృష్ణానది నిండుకుండలా ఉంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి 6,848 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. పాలేరు నుంచి 275, కీసర నుంచి 3726 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. బ్యారేజీ 16 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 14,203 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కేఈబీ, కేఈ ప్రధాన, బందరు, ఏలూరు, రైవస్‌, గుంటూరు చానల్‌కు 2283 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గుంటూరుజిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు వద్ద బ్రిడ్జి నిర్మాణం కారణంగా ఏర్పాటు చేసిన డైవర్షన్‌ రోడ్డుపై వర్షపు నీరు ప్రవహించటంతో రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు నగరంలోని బ్రాడీపేట, ఉమెన్స్‌ కాలేజీ వద్ద, డోలా్‌సనగర్‌లో చెట్లు నేలకొరిగాయి. మంగళగిరిలోని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని గురువారం వివిధ ముంపు ప్రాంతాలకు తరలించారు.  కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. బస్టాండ్‌, తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణాల్లో నీరు నిలిచింది. ఆత్మకూరు శివార్లలో పడేవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పాములపాడు-చెలిమిల్ల మధ్య భవనాశి, సుద్దవాగు, ఎద్దులవంక వాగులు పొంగి పొర్లడంతో వంద ఎకరాలకుపైగా మొక్కజొన్న పంట నీటమునిగింది. భవనావశి నది ఉప్పొంగడంతో ఇస్కాల గ్రామశివారులోని నందీశ్వరాలయం నీట మునిగింది. 


కంట్రోల్‌ రూంల ఏర్పాటు: బొత్స

అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): ఎడతెరపి లేని వర్షాల నేపథ్యంలో మున్సిపల్‌ కమిషనర్లు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. సచివాలయంలోని కమాండ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌ నుంచి గురువారం వీడియోకాన్ఫరెన్స్‌లో వర్షాలపై మంత్రి సమీక్షించారు. అన్ని మున్సిపల్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పారిశుధ్యం లోపించకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని, క్లోరినేషన్‌ చేయించాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి వసతి, భోజన, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుల ఏర్పాటుకు భూసేకరణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కమిషనర్లను మంత్రి ఆదేశించారు. మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-07-23T08:20:36+05:30 IST