తడిసి ముద్దయిన ఢిల్లీ

ABN , First Publish Date - 2021-09-01T20:33:52+05:30 IST

రెండు రోజులుగా కురుస్తున్నభారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ తడిసి ముద్దయింది. పలు ప్రాంతాలు వర్షం నీటిలో చిక్కుకున్నాయి.

తడిసి ముద్దయిన ఢిల్లీ

న్యూఢిల్లీ: రెండు రోజులుగా కురుస్తున్నభారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ తడిసి ముద్దయింది. పలు ప్రాంతాలు వర్షం నీటిలో చిక్కుకున్నాయి. రహదారులపై వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీర్‌సింగ్ మార్గ్‌లో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. మరోవైపు జన్‌పథ్ మార్గ్‌లో భారీ చెట్టు నేలకొరిగింది. రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో  ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చెట్టు కూలడంతో ప్రక్కనే ఉన్న పలు ఇళ్ల ప్రహరీ గోడలు ద్వంసమయ్యాయి. పార్కింగ్‌ చేసిన పలు కార్లు కూడా దెబ్బతిన్నాయి.


దౌవ్‌లాఖాన్ అండర్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు చేరడంతో రాకపోకలు స్తంభించిపోయి కారు నీటిలో చిక్కుకుంది. దాన్ని తొలగించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీవీఐపీలు తిరిగే 7 రేస్ కోర్స్ రహదారిపై భారీ చెట్లు నేలకొరిగాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీ గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్ వేపై భారీ వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వాహనాలు కదలలేని పరిస్థితి నెలకొంది. రహదారి పూర్తిగా నీటితో నిండిపోవడంతో ఎక్కడ ఏ గుంట ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. మోకాలు లోతు నీరు ఉండడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Updated Date - 2021-09-01T20:33:52+05:30 IST