Abn logo
Oct 19 2021 @ 01:41AM

ఉత్తర-దక్షిణాల్లో భారీ వర్షాలు..శబరి, చార్‌ధామ్‌ యాత్రలకు బ్రేక్‌

కేరళలో రెడ్‌ అలర్ట్‌ పరిధిలో 10 డ్యామ్‌లు

శబరిమలకు భక్తుల రాకపోకల నిలిపివేత

20 నుంచి 4 రోజులకు ఐఎండీ హెచ్చరికలు

ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాలు.. ముగ్గురి మృతి


తిరువనంతపురం/డెహ్రాదూన్‌, అక్టోబరు 18: కేరళను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా శబరిమల పుణ్యక్షేత్రం, అయ్యప్ప జన్మస్థలమైన పందళం, అచ్చన్‌కోవిల్‌ వంటి ముఖ్యమైన సందర్శక ప్రదేశాలున్న పతనంతిట్ట జిల్లాతోపాటు.. దేశ, విదేశీ పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే ఇడుక్కి జిల్లా, అటు తమిళనాడులోని త్రిషూర్‌ జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది. పంపానదిపై ఉన్న ‘కక్కి’ డ్యామ్‌ వద్ద వరద ఉధృతి పెరుగుతుండడంతో నీటిని కిందకు వదలాలని అధికారులు నిర్ణయించారు. దీని వల్ల పంపాబేస్‌ వద్ద నది ఉప్పొంగనుంది.  డ్యామ్‌ తెరిస్తే శబరి కొండకు చేరుకునే మూడు బ్రిడ్జిలు మూసుకుపోతాయి. కేరళలోని నదులపై ఉన్న 81 డ్యామ్‌లలో, 10 రెడ్‌ అలర్ట్‌ పరిధిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. కోటాయం జిల్లాలో వరద తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా పలు జిల్లాల మీదుగా ప్రవహించే మణిమాల నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద తాకిడికి ముందకాయం గ్రామంలో ఓ రెండంతస్తుల భవనం నదిలో కొట్టుకుపోయింది.


ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మణిమాల నది పరీవాహక ప్రాంతాల్లో  కొండచరియలు విరిగిపడడంతో మొత్తం 62 ఇళ్లు ధ్వంసమయ్యాయని జిల్లా అధికారులు చెప్పారు.  ఈ నెల 12 నుంచి కేరళలో మొత్తం 24 చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయని, 38 మరణాలు సంభవించాయని వివరించారు. ఓ వైపు వరద బీభత్సం.. మరోవైపు ఆసక్తికరంగా ఓ వివాహ వేడుక. అలప్పుళలో  సోమవారం ముహూర్తం సమయానికి భారీ వర్షాలు, వరదలు. దీంతో.. వధూవరులిద్దరినీ నీటిపై తేలియాడే ఓ భారీ బాండీలో కూర్చోబెట్టి, పీటల వద్దకు తీసుకువచ్చారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలైంది. ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పౌరీ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ముగ్గురు నేపాలీలు దుర్మరణం పాలయ్యారు. హిమాలయ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చార్‌ధామ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రిషికే్‌షలో పలు బ్రిడ్జిల వద్ద రాకపోకలను నిలిపివేశారు. యమునోత్రి మార్గంలో ఉన్నవారిని బడ్‌కోట్‌, జానకీచట్టీ ప్రాంతాల్లో, గంగోత్రి యాత్రలో ఉన్నవారిని హర్సిల్‌, భట్వారీ, మనేరీల్లో నిలిచిపోవాలని కోరారు. బద్రీనాథ్‌ మార్గంలో ఉన్న వారు చమోలి వద్ద బస చేయాలని సూచించారు. కేదార్‌నాథ్‌ యాత్రను పూర్తిచేసుకున్న 6 వేల మందిలో.. 4 వేల మంది ఆదివారం సాయంత్రానికే వెనక్కి వచ్చేశారని, మిగతావారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఢిల్లీ నగరంలోనూ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. 


కేరళలో చిక్కుకుపోయిన అచ్చంపేట అయ్యప్ప భక్తులు

అచ్చంపేట: నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట డివిజన్‌కు చెందిన పి.వెంకట్‌రెడ్డి, ఎస్‌.శ్రీకాంత్‌రెడ్డి, మల్లేశ్‌యాదవ్‌, హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్‌రెడ్డి ఈ నెల 15న కారులో శబరిమల బయలుదేరారు. వరదలవల్ల కేరళలోని ఇడుక్కి జిల్లాలోని కుట్టికన్నెంలో  ఆగిపోయారు.  సోమవారం నీలక్కల్‌ బేస్‌ వద్ద శివాలయంలో ఇరుముడిని సమర్పించి, తిరుగు ప్రయాణమైనట్లు వెంకట్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్‌లో చెప్పారు.